మీద్వారా అభివృద్ధి జరక్కపోవచ్చు

26 Nov, 2016 00:59 IST|Sakshi
మీద్వారా అభివృద్ధి జరక్కపోవచ్చు
సాక్షి, అమరావతి: అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నయి... కానీ అవి మీ ద్వారా జరక్కపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలేదని పరోక్షంగా స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన 13 నిమిషాలపాటు వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమపై జరుగుతున్న కక్షసాధింపు, నిధుల విడుదల చేయకపోవడంపై గట్టిగా ప్రశ్నించడంతో సీఎం ఆచితూచి స్పందించారు. తాను రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నానని, నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మీ నియోజకవర్గాల్లో మీరు అడిగినవి జరగకపోయినా, తమ వారి ద్వారా నిధులు పంపిస్తున్నానని తెలిపారు. ఓడిపోయిన వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించినా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు.
 
  నియోజకవర్గాలకు నిధులిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నానని చెప్పారు. రేషన్ వ్యవస్థను గాడిన పెట్టామని అందరికీ సక్రమంగా సరుకులు అందిస్తున్నామని సీఎం చెప్పగా... రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని వైఎస్సార్‌సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాంటివేం ఇప్పుడు జరగడంలేదని, కాంగ్రెస్ హయాంలోనే అవన్నీ జరగాయని సీఎం బుకాయించారు. తన నియోజకవర్గంలో తానే స్వయంగా బియ్యం లారీని పట్టించానని రామకృష్ణారెడ్డి చెప్పగా మారుమాట్లాడలేదు. రాష్ట్రమంతా అభివృద్ధి జరిగిపోతుందని సీఎం చెబుతున్నప్పుడు... మన సొంత గ్రామం చంద్రగిరిలో ఏం అభివృద్ధి జరిగిందో ఇద్దరం వెళ్లి చూద్దామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.
 
  ఎమ్మెల్యేలంతా తమకూ నిధులివ్వాలని కోరినా ఆయన మాట్లాడలేదు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలంతా కలిసి తమ సమస్యలను వినిపించినప్పుడు వారికివ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తరచూ పిలుపునిచ్చే ముఖ్యమంత్రి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గొడవ చేస్తారేమోననే ఆందోళన అటు అధికారవర్గాల్లోనూ, పోలీసుల్లోనూ కనిపించింది. 
 
>
మరిన్ని వార్తలు