ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

22 Dec, 2016 03:05 IST|Sakshi



సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా పార్టీ రంగులను ప్రతిబింబించే విధంగా రూపొందించిన భారీ కేక్‌ను ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి,  ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా సంయుక్తంగా కట్‌ చేశారు. పరస్పరం అభినందనలు తెలుపు కొన్నారు. అదే సమయంలో ‘జై.. జగన్‌!..’ అనే నినాదాలు మిన్నంటుతుండగా నీలి, ఆకుపచ్చ, తెలుపు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఆ తరువాత పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురు నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనాథ పిల్లలకు నోటు పుస్తకాలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తొలుత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీనియర్‌ నేతలు నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. ‘జై.. జగన్‌.. వైఎస్సార్‌ అమర్‌ రహే..’ అనే కార్యకర్తల నినాదాల నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, కొరుముట్ల శ్రీనివాసులు, గిడ్డి ఈశ్వరి, అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, వాసిరెడ్డి పద్మ, ఎం.అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.లక్ష్మీపార్వతి, ఎస్‌.దుర్గా ప్రసాదరాజు, బీవై రామయ్య, కార్యదర్శులు చల్లా మధుసూదన్‌రెడ్డి, కొల్లి నిర్మల, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, బుర్రా సురేశ్‌గౌడ్, ఏఎన్‌ఎన్‌ మూర్తి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు తమ జిల్లాల్లో జగన్‌ జన్మ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. విదేశాల్లో ఉన్న జగన్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.




మీ దీవెనలే నాకు బలం, స్ఫూర్తి
వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
‘మీ దీవెనలు, మీ శుభాకాంక్షలే నాకు బలం, స్ఫూర్తి’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. అభిమానులు, పార్టీ శ్రేణుల నుంచి వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలకు ఆయన స్పందిస్తూ అభినందనలు తెలిపిన వారందరికీ తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని పేర్కొన్నారు.


 

 




మరిన్ని వార్తలు