ముదురుతున్న వివాదం

28 Sep, 2016 23:10 IST|Sakshi
ముదురుతున్న వివాదం

వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం టీచింగ్‌ అసిస్టెంట్‌ నోటిఫికేషన్‌ విషయం అధికారులు, పరిశోధక విద్యార్థుల మధ్య వివాదంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. యోగివేమన విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానాల్లో పీజీ అర్హత కలిగిన అభ్యర్థులను టీచింగ్‌ అసిస్టెంట్‌లుగా (బోధన సహాయకులుగా) నియమిస్తారు. ఈ యేడాది కళాశాల ప్రారంభమై మూడు నెలలు గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. తీరా దసరా సెలవులు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా నోటిఫికేషన్‌ జారీచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూ (కొన్ని విభాగాల్లో) మరోవైపు తరగతులు కూడా బోధిస్తున్న పరిశోధక విద్యార్థులకు టీచింగ్‌ అసిస్టెంట్‌గా అవకాశం కల్పించి కాస్త ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. దీనికి అధికారులు స్పందించకపోవడంతో వైవీయూ పరిశోధక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. దీంతో వ్యవహారం వాయిదా పడింది. అయితే మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం అనుమతి పొందిన పాలకులు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పరిశోధక విద్యార్థి సంఘం నాయకులు దీనిని అడ్డుకునే యత్నం చేశారు.
ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌ వద్ద ఆందోళన..
టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలుసుకున్న వైవీయూ పరిశోధక విద్యార్థులు బుధవారం ప్రిన్సిపల్‌ ఛాంబర్‌ వద్దకు వెళ్లి బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైవీయూ పరిశోధక విద్యార్థుల సంఘం నాయకుడు దస్తగిరి మాట్లాడుతూ ఇతర విశ్వవిద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులకు టీచింగ్‌ అసిస్టెంట్‌లు అవకాశం కల్పిస్తుంటే మీరెందుకు కల్పించరని కోరారు. తొలి ప్రాధాన్యత వైవీయూలో పరిశోధన చేస్తున్న విద్యార్థులకే ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులు దీనిపై తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని నోటిఫికేషన్‌ ప్రక్రియను వాయిదా వేశారు. కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు రమేష్‌పిచయ్, శ్రీనివాసులు, భరత్‌కుమార్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
 
 

>
మరిన్ని వార్తలు