వీడని జెడ్పీట ముడి

24 May, 2017 00:23 IST|Sakshi
 
- చేతులెత్తేసిన ‘దేశం’
- చతికిలపడ్డ నేతలు
- పార్టీ జిల్లా పగ్గాలపై వెనకడుగు
- భంగపడిన పార్టీ పెద్దలు
- నిరాశలో జ్యోతుల వర్గం, 
.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
క్రమశిక్షణ ... ఓ పద్ధతి ప్రకారం నడిచే పార్టీ ... మాట మీద నిలబడే కార్యకర్తల శ్రేణి తమకే సొంతమనే టీ డీపీలో క్రమ ‘శిక్ష’ గానే మారుతోంది. తాజాగా పార్టీ జిల్లా పగ్గాలను కార్యకర్తల సమక్షంలో ప్రకటించినప్పటికీ అప్పగించలేక చేతెలెత్తేసి చతికిలపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెంది దాదాపు 14 నెలలైంది. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న ఆ పోస్టును కోనసీమకు చెందిన జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబుకు అప్పగించేందుకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రకటించడం తెలిసిందే. జిల్లా పగ్గాలు అప్పగించి చైర్మన్‌ పీఠం వదులుకోమంటే ససేమిరా అంటూ చైర్మన్‌ నామన రాంబాబు ధిక్కార స్వరం వినిపించారు. వాస్తవానికి మంగళవారం ప్రత్తిపాడులో జరిగిన పార్టీ మినీ మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడిగా రాంబాబును ప్రకటించాలి. కానీ మనస్తాపంతో అలక వహించిన నామన ధిక్కార స్వరం వినిపించడమే కాకుండా అన్న మాట ప్రకారమే మినీ మహానాడుకు రాకుండా జెడ్పీ బంగ్లాకే పరిమితమయ్యారు. 
.
కాళ్లా వేళ్లా పడి...
ఆయన మినీ మహానాడుకు రాకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డునపడ్డాయంటూ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి అధిష్టానం నుంచి అక్షింతలు పడతాయనే భయం నేతలను వెంటాడింది. జిల్లా టీడీపీలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ బయటపెట్టిన విషయం పాఠకులకు విదితమే. వరుస కథనాల్లో బయటపడిన లుకలుకలు మాదిరిగానే అగ్రనేతలు కూడా పార్టీ పగ్గాల విషయంలో ఎటూ తేల్చుకోలేక తలలుపట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, పెందుర్తి వెంకటేష్, వర్మను నామన వద్దకు రాయబారానికి పంపించగా సుమారు గంటపాటు సమాలోచనలు జరిగాయి. పార్టీ జిల్లా పగ్గాలను జెడ్పీ చైర్మన్‌కు అప్పగించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే స్వీయ నిర్ణయం తీసుకున్నారని, అందులో మెజార్టీ అభిప్రాయం లేదని పలువురు నేతలు నామన దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. 
.
మౌన ముద్రలోనే నామన...
చివరకు నామన మినీ మహానాడుకు రావడం వరకు ఒప్పించగలిగారుగానీ వేదికపైకి వచ్చిన దగ్గర నుంచి వేదిక దిగిపోయే వరకు నామన మౌనముద్రలోనే గడిపారు. వేదికపై ఉన్న ఎవరితోను కనీస పలకరింపు కూడా లేకుండా ముభావంగా కనిపించారు. జెడ్పీ చైర్మన్‌ మాట ఎలా ఉన్నా పార్టీ జిల్లా పగ్గాలు మినీ మహానాడు వేదికగా ప్రకటించాలనుకున్న చినరాజప్ప, కళావెంకట్రావు వంటి అగ్రనేతలకు భంగపాటు తప్పలేదు.
.
జిల్లా అధ్యక్ష బాధ్యతలు వాయిదా...
మినీ మహానాడుకు నామనను తీసుకు రావడంతో కొంతవరకు పరువు దక్కిందనుకున్నా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని నేతలు గుసగుసలాడుకోవడం వినిపించింది. నామన అలకబూనడం, పార్టీ జెడ్పీటీసీలు చైర్మన్‌ పీఠం మార్చవద్దని, అలా మారిస్తే రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు వెనక్కు తగ్గక తప్పింది కాదు. మినీ మహానాడు వేదికపై తమ పార్టీ క్రమ శిక్షణకు మారుపేరంటూ  మంత్రి యనమల గొప్పలకు పోతూనే జెడ్పీ చైర్మన్‌ మార్పు, పార్టీ జిల్లా పగ్గాలు వ్యవహారంలో అసమ్మతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీ అంతర్గత విషయాల్లో రోడ్డెక్క వద్దని నేతలకు సూక్తులు వినిపించారు. కానీ మినీ మహానాడు వేదికపై ప్రకటించాల్సిన పార్టీ జిల్లా పగ్గాలు విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. యనమల ప్రసంగాన్ని ముగించి భోజన విరామ సమయంలో నామనను వేదికకు దిగువన ఒకపక్కకు తీసుకువెళ్లి పార్టీ పగ్గాలపై ఒప్పించేందుకు యనమల చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో పార్టీ నేతలంతా కుదేలయ్యారు. ఇక చేసేదేమీ లేక పార్టీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్‌ మార్పు వ్యవహారంపై ఒకరకంగా ‘స్టే’ విధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ ఎదురుకాని పరిస్థితి పార్టీలో తలెత్తడంతో పార్టీ అగ్రనేతలు ఎటూ నిర్ణయం తీసుకోలేక తలలుపట్టుకుంటున్నారు.
.
పాపం జ్యోతుల...
మరోపక్క పార్టీ జిల్లా పగ్గాలు నామనకు అప్పగించేలా ఒప్పించే ప్రక్రియ పూర్తయితే జెడ్పీ చైర్మన్‌ వ్యవహారంలో స్పష్టత వస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం ఎదురుచూసింది. ఆ దిశగా కొందరు అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం ఆ వర్గానికి నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం అనవసర రాద్ధాంతం ఉండకూడదని పార్టీ పగ్గాలు వ్యవహారాన్ని  తాత్కాలికంగా పక్కనబెట్టారంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి  నిర్ణయం అక్కడే జరిగేలా నేతల వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంమీద పార్టీ ముఖ్యనేతలంతా ఉండి కూడా జిల్లా స్థాయిలో సమస్యను పరిష్కరించ లేక చేతులెత్తేయడం కేడర్‌కు ఏమాత్రం రుచించడం లేదు. 
మరిన్ని వార్తలు