డబ్బులు కాలి బూడిదవుతున్నాయి!

22 Oct, 2019 14:36 IST|Sakshi

దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. చెడు పై మంచి గెలిచినందుకు చిహ్నంగా ఆరోజు ఆనందంతో దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుతూ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం భారతీయ సంసృ‍్కతి.  అయితే ఆనందాన్ని పంచుకోవల్సిన దీపావళి నాడు టపాసుల పేరుతో వాతావరణంలో కాలుష్యాన్ని పెంచేస్తూ అనేక తప్పిదాలకు పాల్పడుతున్నాం. దీపావళినాడు టపాసులు పేల్చడానికి సైంటిఫిక్‌ కారణము ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం శరదృతువులో దీపావళి పండుగ వస్తుంది. ఆ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. వర్షాకాలం నుంచి చలి కాలానికి మారే ఈ సమయంలో తేమ వాతావరణం, చలి కారణంగా అనేక అంటువ్యాధులను రోగాలను కలిగించే క్రిములు, దోమలు అభివృద్ధి చెందుతాయి. దీపావళి నాడు నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, టపాసులు కాల్చడం వలన వచ్చే పొగతో వీటిని నివారించవచ్చు. అందుకే భారతీయ సంస్కృతిలో దీపావళినాడు టపాసులు కాల్చే  సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.కానీ ఇప్పుడు మతాబులు, కాకరపువ్వొత్తులు లాంటి చిన్న చిన్న టపాసులుకాల్చే అలవాటు పోయు పెద్ద పెద్ద శబ్దాలు చేసే లక్ష్మీ బాంబులు, థౌజెండ్‌వాలాలు పేల్చే పనిలో పడ్డారు. వీటి వల్ల కేవలం వాతావరణ కాలుష్యం, శబ్ధకాలుష్యం లాంటివి పెరగడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కాలిబూడిద అవుతున్నాయి. 

భారతదేశంలో మత, కుల, ప్రాంతీయ బేధాలు లేకుండా చిన్న పెద్ద అందరూ కలసి చేసుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. అయితే ఆరోజు భారతదేశం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయలను ఒక్కరోజు సరదా కోసం భారతీయులు ఖర్చుచేస్తున్నారు. ఈ దుబారా ఖర్చు ప్రతి యేడాది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.కొన్ని సర్వేల ప్రకారం భారతదేశంలో 120 బిలియన్ల టపాసుల వ్యాపారం జరుగుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా 120కోట్లు (ఇప్పుడు 130 కోట్లు పైన పెరిగే అవకాశం ఉంది). అయితే వీరిలో ఒక్కొక్క కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు అనుకున్న మొత్తంగా 30 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు లెక్క. వీరిలో హిందువులు కానీ వారు 30శాతం మంది ఉన్నారు. మిగిలిన 70శాతంగా ఉన్న హిందువుల కుటుంబాలు దీపావళి నాడు ఎంతో కొంత టపాసులపై ఖర్చు చేస్తున్నాయి. సరాసరి ఒక కుటుంబం వచ్చి 500వందల నుంచి వేయి రూపాయల వరకు ఖర్చుచేసిన రూ. 21000 వేల కోట్లు ఒక్కదీపావళి నాడే కాల్చి బూడిద చేస్తున్నాం. భారతదేశంలో 1923వ సంవత్సరం నుంచి బాణసంచా కాలుస్తున్నాము. అప్పటిలో పశ్చిమ బెంగాల్‌లో ఉండే టపాసుల పరిశ్రమ చెన్నైలోని శివకాశీలో ఎక్కువగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం భారతదేశంలో బాణసంచా తయారు చేసే సంస్థలు 8000లకు పైనే ఉన్నాయి. ఇక్కడ 2000వేల కోట్ల వరకు బిజినెస్‌ జరుగుతుంటే బయట మార్కెట్లో వీటిని రూ.20,000వేల కోట్ల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కవగా బయట మార్కెట్లో అమ్ముతూ పండుగ రోజు జనాలను దోచుకుంటున్నారు.

భారతదేశంలో నేటికి అనేక మంది మూడుపూట్ల తిండి దొరక ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా విడుదలయిన ఆకలి సూచిలో భారతదేశం 102 వ స్థానంలో ఉంది. దీపావళినాడు మన సంతోషం కోసం చేసే ఖర్చుతో ఎంతో మంది ఆకలి తీర్చొచ్చు. 2019-20 సంవత్సరానికి గాను మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్రప్రభుత్వం రూ.12,054కోట్లు కేటాయించింది. దీని ద్వారా దాదాపు 12కోట్ల మంది పిల్లలకు సంవత్సరం పాటు భోజనాన్ని అందించగలుగుతున్నాం. కానీ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బాణాసంచా పేరుతో ఒక్కరోజులో తగులబెడుతున్నాం. మనం ఒక్కరోజు ఖర్చు చేసే ఈ మొత్తం సిక్కిం(రూ. 8,665.36కోట్లు, మణిపూర్‌(రూ.14,636కోట్లు) లాంటి ఎన్నో రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌ కంటే రెట్టింపు అంటే ఆశ్చర్యపడకతప్పదేమో! 

కాబట్టి మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. దీపావళినాడు కేవలం టపాసుల రూపంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను కాల్చేస్తేనే ఆనందం వస్తుందా? అదే ఆ డబ్బుతో ఎవరో ఒక్కరికైనా సహాయం చేస్తే ఆనందం వస్తుందా అని. కాలుష్యాన్ని తగ్గించండి అంటూ  ఏ కోర్టోలో, పర్యావరణవేత్తలో చెబితే మారే బదులు స్వయంగా మారుదాం.దీపావళినాడు ఆనందాన్ని టపాసులతో కాకుండా మిఠాయిలతో పంచుకుందాం.


 

Read latest Diwali News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ఏంటి?

దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..

ఆనందాల వెలుగులు నిండాలి

ఇవి లేకుంటే దీపావళి అసంపూర్ణం

వెలుగు పువ్వుల దిబ్బు దిబ్బు దీపావళి