హద్దులు దాటొద్దు, పార్టీకి చెడ్డపేరు తేవొద్దు: చంద్రబాబు

30 Dec, 2017 18:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోడిపందాలు, జూదాల విషయంలో హద్దులు దాటొద్దంటూ పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. జూదాల విషయంలో పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

అలాగే నియోజకవర్గాలకు ఏ,బీ,సీ గ్రేడింగులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పనితీరు సరిగా లేకుంటే అభ్యర్థులను మార్చడానికి వెనకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2018 చివరికల్లా జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని సూచన చేశారు. అలాగే జన్మభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. అర్హులైన లబ్దిదారులు ఇబ్బండి పడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, పార్టీ ఇన్‌ఛార్జుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు