టమాటా.. ముంచింది నట్టేట!

24 Jan, 2018 12:35 IST|Sakshi

కిలో రూ.2కు పడిపోయిన ధర

కూలి కూడా రావడం లేదని రైతుల ఆవేదన

ఎకరానికి రూ.30 వేల వరకూ నష్టం

పిఠాపురం : పంట బాగా పండడంతో అనుకున్న ఆదాయం ఉంటుందని ఆశించిన టమాటా రైతుకు అమాంతం పడిపోయిన ధర తీవ్ర నష్టాలను మిగిల్చింది. కోత కూలి కూడా రావడంలేదని, పంటను వదిలేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వరకూ రూ.50కి పైగా పలికిన కేజీ టమాటా ధర అమాంతం రూ.2కు పడిపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని వాపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో ఈ ఏడాది పత్తి పంట తెగుళ్లతో నాశనమైంది. దీంతో పంట మార్పు చేయాలన్న వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు సుమారు 500 హెక్టార్లలో టమాటా సాగు చేశారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోనే సుమారు 300 హెక్టార్లలో టమాటా సాగు చేశారు. ఎకరానికి సుమారు రూ.35వేల నుంచి రూ.45వేల వరకూ పెట్టుబడి పెట్టారు. ఎకరాకు సుమారు 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు.

గత నెలలో కిలో రూ.50 వరకూ అమ్ముడైన టమాటా.. గడచిన 25 రోజుల్లో హఠాత్తుగా రూ.2కు పడిపోయింది. మార్కెట్‌లో కిలో రూ.10 వరకూ అమ్ముడవుతున్నా తమ వద్ద మాత్రం 25 కేజీల టమాటాలు ఉండే ట్రేలు ఒక్కోటి రూ.50కి మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఫలితంగా ఎకరానికి రూ.12 వేలకు మించి ఆదాయం రాకపోవడంతో సుమారు రూ.30 వేల వరకూ నష్టం వస్తోందని వాపోతున్నారు. వస్తున్న ఆదాయం కోత కూలికే సరిపోతోందని చెబుతున్నారు. పంట ఒకేసారి అందుబాటులోకి రావడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగడంతో రానున్న రోజుల్లో టమాటా ధర మరింత క్షీణించవచ్చని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఇతర జిల్లాల్లో ఇప్పటికే టమాటా ధర పైసల్లోకి పడిపోయిందని, అదే పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, తమకు నష్టాలు రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

మార్కెటింగ్‌ శాఖకు సమాచారం ఇస్తున్నాం
చిత్తూరు జిల్లాలో టమాటా ధర తీవ్రంగా పడిపోవడంతో అక్కడి రైతుల అభ్యర్థన మేరకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడా చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు నేలపై టమాటా సాగు చేయడంవల్ల దిగుబడి చాలా తక్కువగా ఉండి, ధర పడిపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎకరానికి రూ.7,500 సబ్సిడీపై ట్రిల్లీస్‌ (పందిర్లు) విధానంలో టమాటా సాగు చేసుకునే వీలును ఇక్కడి రైతులకు కల్పిస్తున్నాం. పందిర్లు వేసి సాగు చేయడంవల్ల ఎకరానికి 30 టన్నుల వరకూ టమాటా దిగుబడి వస్తుంది. అప్పుడు రేటు ఎంత తగ్గినా నష్టం అనేది రాదు. దీనిపై రైతులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – కె. గోపీకుమార్, హార్టికల్చర్‌ ఏడీ, కాకినాడ

మరిన్ని వార్తలు