వేకువనే ఈ వేట.. చూడనెంతో ముచ్చట

26 Jan, 2018 14:21 IST|Sakshi

మామిడికుదురు (పి.గన్నవరం): అందరికీ దప్పిక తీర్చే నీరు వారికి.. అన్నం పెట్టే పెన్నిధి కూడా! అమ్మ ఒడిలో పారాడే బిడ్డల్లా వారు.. వారు నదిలో వేట సాగిస్తారు. రేయైనా, పగలైనా తన ప్రయాణానికి ఏ దిక్సూచీ అవసరం లేని నదిలాగే.. ఆ నది కడుపులో చేపలను అన్వేషించే వారి వేటకూ, వలలకూ కూడా వేళలతో, వాతావరణంతో పని లేదు. చిక్కని చీకటి రాత్రయినా, దట్టమైన మంచు కమ్ముకున్న వేకువనైనా.. గంగపుత్రుల వేటకు ఆటంకం ఉండదు.

అందరూ కప్పుకున్న దుప్పట్లను వీడి, తల బయటకు పెట్టడానికి కూడా ఇష్టపడని వేళ.. ఇదిగో ఇక్కడ ఇద్దరు మత్స్యకారులు కమ్ముకున్న మంచుకు అణుమాత్రం  ‘చలి’ంచకుండా వేట సాగిస్తున్నారు. ఒక వృద్ధుడు సారథిలా నావకు తెడ్డు వేస్తుంటే, నడివయస్కుడొకరు యోధునిలా వల విసురుతున్నారు. వైనతేయ గోదావరి నదీతీరంలో గురువారం వేకువన పెదపట్నంలంక వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన జీవన ‘చిత్రం’ ఇది. మన కంటికి పసందైన ఈ దృశ్యం.. నది కడుపున వెతికే వారి వల కన్నులకు చేపలు కంటబడి, పట్టుబడితేనే వారి కృషి ఫలించినట్టవుతుంది.

మరిన్ని వార్తలు