యూఎస్‌ వదిలి... ఐపీఎస్‌ చేపట్టి...

12 Jan, 2018 11:48 IST|Sakshi
భర్త రాహుల్‌దేవ్‌సింగ్‌తో అజిత

 లక్షల జీతం కాదనుకొని సివిల్స్‌కు దగ్గరయ్యారు

పేదలకు సేవ చేయాలనే ఆశయమే అలా అడుగులు వేయించింది

ఐపీఎస్‌ అధికారి అజిత వేజెండ్ల

లక్షల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకొని  సివిల్స్‌ బాట పట్టారు అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి యూఎస్‌లో ఫైనాన్స్‌ విభాగంలో ఎంఎస్‌ పూర్తి చేశారు. అక్కడే కొంతకాలం ఫైనాన్స్‌ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చేశారు. తరువాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తూనే సివిల్స్‌ సాధించారు.

జనపక్షపాతి అయిన ఆమె లక్షల డాలర్ల జీతాన్నిచ్చే ఉన్నతోద్యోగాన్ని వదులుకున్నారు. చిన్ననాటి నుంచీ చూసిన ప్రజల ఇబ్బందులను గమనించిన ఆమె హృదయంలో.. వారి కోసమే తన శక్తియుక్తులను వినియోగించాలన్న సంకల్పం బలంగా నాటుకుంది. ఆ సంకల్పాన్ని సాకారం చేసే లక్ష్యంతోనే సివిల్స్‌ రాశారు. కృషికి కుటుంబ ప్రోత్సాహం తోడు కాగా ఐపీఎస్‌ సాధించారు. ఆ లక్ష్యసాధకురాలే.. ఇప్పుడు రంపచోడవరం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అజిత వేజెండ్ల. చెన్నై ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక అమెరికా వెళ్లి ఫైనాన్స్‌లో ఎంఎస్‌ పూర్తి చేశారు. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేసినా తన జీవితధ్యేయ సాధనకు స్వదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తూనే సివిల్స్‌లో విజయం సాధించారు. లక్ష్యసాధకురాలైన అజిత విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..

తూర్పుగోదావరి, రంపచోడవరం: నా బాల్యం తెనాలిలో గడవగా.. పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న, అమ్మ ఉద్యోగస్తులు కావడంతో హైదరాబాద్‌లోనే పెరిగాను. అక్కడే సెయింటాన్స్‌లో ప్రా«థమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు చదివాను. నెల్లూరు  నారాయణలో ఇంటర్, మద్రాస్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశాను. స్కాలషిప్‌తోనే యూఎస్‌లో ఎంఎస్‌ ఫైనాన్స్‌ కోర్సు పూర్తి చేశాను. కొద్దికాలం  క్రితమే వివాహం జరిగింది. భర్త రాహుల్‌దేవ్‌సింగ్‌ కూడా ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. తమ్ముడు అజయ్‌ కూడా ఐఐటీలో చదివాడు

గిరిజన బాలలతో గడుపుతా..
ఖాళీ సమయాల్లో దగ్గరలోని పాఠశాలకు వెళ్లి పిల్లలకు బోధన చేయడం ఎంతో ఇష్టం. రంపచోడవరం ఏజెన్సీలో కూడా వీలైతే గిరిజన బాలలతో సమయం గడపదలచుకున్నాను. పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ వినడం, కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి వ్యక్తీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని, దానిని సాధించడానికి శాయశక్తులా  కృషి చేయాలి. ఎన్నుకున్న రంగంలో నైపుణ్యం పొందాలి. లక్ష్యం సాధించే వరకూ కష్టపడాలి. మానవతా దృక్పథంతో ముందుకు సాగాలి.

ప్రజల కష్టాలు దగ్గరగా చూశాను..
తాత గారి ఊరు తెనాలి తరచూ వచ్చేవారం. అక్కడ ప్రజల ఇబ్బందులు, బంధువుల పరిస్థితి దగ్గర నుంచి చూశాను. అప్పుడే పబ్లిక్‌ ఓరియంటెడ్‌ జాబ్‌ (ప్రజాజీవితంతో ముడిపడ్డ ఉద్యోగం) చేయాలని ఉండేది. యూఎస్‌లో ఉద్యోగం వచ్చినా  సివిల్స్‌ సాధించాలనే కోరికతో ఇండియాకు వచ్చేశాను. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తూనే సివిల్స్‌ సాధించాను.

గ్రేహౌండ్స్‌లో శిక్షణ వృత్తి నైపుణ్యం పెంచింది..
గ్రేహౌండ్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా చేయటం వృత్తి నైపుణ్యాన్ని పెంచింది. ప్రాథమికంగా పోలీస్‌ ఉద్యోగంలో నేర్పుకోవాల్సిన మెళకువలు, వ్యూహరచన, సహనం, సమయస్ఫూర్తి  ఆకళింపు చేసుకున్నాను. పోలీసులు చైతన్యవంతులై పనిచేసేలా సహకరిస్తాను. చట్టం అమలు కోసం అన్ని విభాగాలనూ సమన్వయం చేస్తాను. మానవీయంగా వ్యవహరించాలనేది నా లక్ష్యం.

Read latest East-godavari News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా