యాజమాన్యాల 'చిత్ర'హింస..

30 Jan, 2018 13:22 IST|Sakshi
సూర్యా కాంప్లెక్స్‌ గేటు వద్ద జోరుగా సాగుతున్న బాక్ల్‌ టికెట్ల విక్రయం

ప్రేక్షకుల నిలువు దోపిడీ 

థియేటర్ల వద్దే బ్లాక్‌ టికెట్ల జోరు

బయట వ్యక్తులకు ఏకమొత్తంలో విక్రయం

రూ.110 టికెట్లు రూ.160కి ఇస్తున్న యాజమాన్యాలు

డిమాండ్‌ను బట్టీ గేటు వద్దే అమ్మకాలు

రాజమహేంద్రవరంలో సామాన్యుడికి అందని టికెట్లు

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నగరంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను బాక్ల్‌లో విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్‌ టికెట్ల దందా చేస్తూ కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతున్నాయి. మరుసటి రోజు శని, ఆదివారాలు కావడంతో ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ మూడు రోజుల్లో థియేటర్ల కౌంటర్లలో ఒక్క టికెట్‌ కూడా విక్రయించడంలేదు. నాలుగు ఆటల టికెట్లు అయిపోయాయని థియేటర్ల వద్ద బోర్డులు పెడుతున్నారు. ఎవరైనా ప్రేక్షకులు అడిగితే ఆన్‌లైన్‌లో అన్నీ విక్రయించామని థియేటర్ల మేనేజర్లు చెబుతున్నారు.

థియేటర్ల వద్ద బ్లాక్‌ టికెట్ల దందా రెండు విధాలుగా జరుగుతోంది. నాలుగు షోల టికెట్లను బ్లాక్‌ చేస్తున్న యాజమాన్యాలు వాటిని గంపగుత్తగా బయట వ్యక్తులకు విక్రయిస్తున్నాయి. రూ.110 టికెట్లను రూ.160లకు, రూ.40 టికెట్లను రూ.70కు విక్రయిస్తున్నారు. వారు రూ.110 టికెట్లు డిమాండ్‌ను బట్టీ రూ.200లకు పైగా విక్రయిస్తున్నారు. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు తమ సిబ్బందితోనే రెట్టింపు ధరలకు టికెట్లు బ్లాక్‌లో అమ్మిస్తున్నాయి. శుక్రవారం విడుదలైన భాగమతి, పద్మావత్‌ చిత్రాల ప్రదర్శిస్తున్న థియేటర్లలో సూర్యా మినీ, సూర్యా కాంప్లెక్స్, శ్యామలా, స్వామి, శివజ్యోతి, రాజా థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయించారు. రూ.110 టికెట్లు రూ.200 నుంచి రూ.300, రూ.40 టికెట్లు రూ.100 లెక్కన అమ్మి ప్రేక్షకులను నిలువదోపిడీ చేశారు. నలుగురు సభ్యుల కుటంబంతో వెళ్లిన వారు రూ. టికెట్లకే రూ.800 నుంచి రూ.1200 వరకు వెచ్చించాల్సి వచ్చింది. అంత మొత్తం వెచ్చించలేని సామాన్యులు నిరాశతో వెనుదిరిగి
వెళ్లిపోయారు.

50 శాతం నిబంధన ఎక్కడ?
థియేటర్లలోని టికెట్లలో 50 శాతం ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు అనుమతి ఉంది. మిగతా 50 శాతం టికెట్లు కౌంటర్లలో విక్రయించాలి. కానీ ఎక్కడా ఇది అమలు కావడంలేదు. వంద శాతం ఆన్‌లైన్‌లో పెడుతున్నామని సూర్యా కాంప్లెక్స్‌ మేనేజర్‌ చెబుతున్నారని రమేష్‌ అనే ప్రేక్షకుడు పేర్కొన్నారు. తాము కుటుంబంతో సహా వచ్చామని, సినిమా చూడకపోతే పిల్లలు నిరాశ చెందుతారని బ్లాక్‌లో రూ.110 టికెట్లు రూ.200లకు కొనుగోలు చేశానని శనివారం ‘సాక్షి’ వద్ద వాపోయారు. సామాన్యులకు టికెట్లు అందేలా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు