ఆగని అన‘కొండ’ కాట్లు

23 Jan, 2018 09:48 IST|Sakshi

కాకినాడలో అరాచకాల పరంపర

ఎమ్మెల్యే కొండబాబు అనుచరుల దౌర్జన్యకాండ

కొనసాగుతున్న దాడులు, ధ్వంస రచన

ప్రేక్షకపాత్రలో అధికారులు

కలెక్టర్‌ జోక్యంతో ఎమ్మెల్యే కుటుంబీకులపై ఎట్టకేలకు కేసు నమోదు

ఈ నెల మొదటివారంలో కొవ్వూరు రోడ్డు తారకరామానగర్‌ ప్రాంతంలోని సర్వే నెంబర్‌ 20/2ఎలో ఆ స్థల యజమానులు నిర్మాణాలు చేపడుతుంటే ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు దాడి చేశారు. కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టుకుంటున్న 60 మందిపై సుమారు పది మంది ఎమ్మెల్యే మనుషులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అక్కడ నిర్మాణాల్ని దౌర్జన్యంగా కూల్చేశారు. ఆ 60 మంది చేత స్థలాలు కొనుగోలు చేయించిన ఎమ్మెల్యే అనుచరుడే ఆ తర్వాత వారిపై దాడి చేసి, ధ్వంస రచనకు పాల్పడ్డాడు. దాడుల్లో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. తిరిగి బాధితుల్నే వేధించిన పరిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా కాకినాడ మహలక్ష్మీ నగర్‌లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు, అనుచరులు జేసీబీ సాయంతో తవ్వేసి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. రోడ్డేసిన స్థలం ప్రైవేటుదని, తమదే ఆ స్థలమని ఎమ్మెల్యే కుటుంబీకుల కను సన్నల్లో దౌర్జన్యానికి దిగారు. గూండా గిరీ ప్రదర్శించారు. రోడ్డును ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు ఫిర్యాదులు రావడంతో అధికారులు తప్పని పరిస్థితుల్లో స్పందించారు.

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: కాకినాడలో టీడీపీ ఆగడాల్లకు అంతులేకుండా పోతోంది. వరుస ఘటనలు పట్టణం నడిబొడ్డున యథేచ్ఛగా జరుగుతున్నా జిల్లా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. తాజా ఘటనలతోపాటు ఇదే నెల మొదటి వారంలో జరిగినవే కాకుండా గత ఏడాదిలో కాకినాడ మెయిన్‌ రోడ్డులోని జగన్నాథపురం వంతెన సమీపంలో విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదస్పదమయింది. ఆ స్థలంలో  ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నించడంతోపాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లైనర్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. ఇవన్నీ అధికార అండ చూసుకుని చేసినవే.

జిల్లా కేంద్రమైన కాకినాడలో ఇటువంటి దారుణాలు అనేకం జరుగుతున్నా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సాహసించడం లేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఏమాత్రం భయం లేకుండా తెగబడుతున్నారు. దాడులకు దిగి, ధ్వంస రచనకు పాల్పడిన భూముల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు చేసిన ఎత్తుగడే. గతంలో జరిగిన ప్రయివేటు షాపు కూల్చివేత , మొన్న తారకరామ నగర్‌లో చేసిన దౌర్జన్యకాండ పక్కన పెడితే తాజాగా మహలక్ష్మీ నగర్‌లో ప్రభుత్వ రోడ్డును ధ్వంసం చేసిన ఘటన మరింత దారుణమైంది. అసలు అక్కడ తమ భూములగా చెప్పుకుంటున్నవాటిపైనే అనుమానాలున్నాయి.

అసలా భూములపైనే అనుమానాలు
సముద్ర నీరు వేసిన మేటల్ని ఆక్రమంచి, తమవిగా రికార్డుల్లో ఎక్కించే యత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అక్కడున్న పోలీసు ౖరైఫిల్‌ రేంజ్‌ స్థలం కూడా ఆక్రమణకు గురైందన్న వాదనలున్నాయి. సముద్రం ఒడ్డున స్తంభాలు వేసి తమ భూములగా చెప్పుకుంటున్న వైనంపైనే సందేహాలున్నాయి. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు. ఆ భూముల సంగతేమిటన్నది తేల్చడం లేదు. వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా వదిలేయడంతోనే సముద్రం ఒడ్డున ఉన్న భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లో ఉండటంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూలేకుండా పోతోంది. రూ.6 లక్షల ప్రభుత్వ నిధులతో పట్టపగలు, జేసీబీని తీసుకెళ్లి ధ్వంసం చేశారంటే ఏ స్థాయిలో బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్టు రోడ్డును ధ్వంసం చేసినచోట స్థానికుల శిబిరం ఏర్పాటు చేసి, నిరసన తెలియజేస్తుంటే వారిపై కొందర్ని ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడున్న టెంట్లు తొలగించాలని హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం బాధితులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వీరే కాకుండా అక్కడ వివాదాస్పదంగా ఉన్న భూములపై కొందరు చేస్తున్న అజమాయిషీపై కూడా ఫిర్యాదులు చేశారు. విషయం అంతవరకు వెళ్లినా స్థానిక అధికారులకు ఏమాత్రం పట్టనట్టే ఉన్నారు సరికదా ఆ రోడ్డు  తాము వేయలేదని ఎమ్మెల్యే మనుషులకు వత్తాసు పలికే పరిస్థితి నెలకుంది. మీడియాలో పతాక శీర్షికల్లో దౌర్జన్యకాండా వెలుగులోకి రావడంతో

ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు.
ఎమ్మెల్యే కుటుంబీకులపై ఎట్టకేలకు కేసు నమోదు : స్థానికులు ఆందోళనలకు దిగడం, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సహా పలువురు ప్రజలు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో కలెక్టర్‌ జోక్యం చేసుకున్నారు. జిల్లా పం చాయతీ అధికారి ద్వారా ఆదేశాలిప్పించి తూరంగి పంచాయతీ ప్రత్యేకాధికారి పి.మణేశ్వరావు చేత ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పబ్లిక్‌ ప్రాపర్టీస్‌ ధ్వంసం దృష్ట్యా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ, ఆయన కుమారుడు ఉమాశంకర్‌తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు