భావితరాలకు ఆక్సిజన్‌ సిలిండర్లే గతి

9 Feb, 2018 13:31 IST|Sakshi
సావనీర్‌ను ఆవిష్కరించిన ప్రముఖులు

నన్నయ వీసీ ముత్యాలునాయుడు

శక్తి పునరుత్పాదకతపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు సంభవించకపోతే మన భావితరాలు ఆక్సిజన్‌ సిలిండర్లతో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ ఎం.ముత్యాలునాయుడు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాలలో గురువారం రాత్రి ‘శక్తి పునరుత్పాదకత’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించిన ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రకృతి పరంగా లభించే మంచినీటినే ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఉందని, వాతావరణంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఆక్సిజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. బొగ్గు, ఆయిల్, గ్యాస్‌ను స్థాయికి మించి తవ్వేస్తున్నాం.

దాని దుష్ఫలితాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులు గాలి, నీరు, సౌర శక్తి, సముద్రం మన దగ్గర అధికంగా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కావలసినంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించారు. వీటన్నింటినీ మనం అందుబాటులోకి తీసుకువస్తే 2030 నాటికి 40 శాతం అభివృద్ధి సాధిస్తామన్నారు. 2050 నాటికి నూరు శాతం అభివృద్ధి సాధించి గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి రక్షించుకోగలుగుతామన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డేవిడ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశాలలో సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. సోలార్‌ విద్యుత్‌పై త్వరలో తమ కళాశాలలో గ్రాడ్యుయేట్, అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో కోర్సులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు, ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కళాశాల విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు