బ్లేడ్‌.. బెంబేలు..

18 Jan, 2018 03:22 IST|Sakshi

► నగరంలో మళ్లీ బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా    ఆగడాలు పెరిగాయా? 

► వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చిన వారిని కొంతమంది రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారా? 

► బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠాల్లోని వారు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారా? అవుననే అంటోంది తాజా సంఘటన. 

► కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఈ ముఠా మంగళవారం మరోసారి రెచ్చిపోయింది. దీంతో వీరి చేష్టలు శ్రుతిమించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

రాజమహేంద్రవరం క్రైం : బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా తగాదాల్లో ఓ వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. కొంత కాలంగా బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా సభ్యులు స్థబ్దుగా ఉండగా మంగళవారం రాత్రి కోటగుమ్మం సెంటర్‌లో ఇరువర్గాల వారు ఒకరి పై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో రాజమహేంద్రవరం రూరల్‌ నామవరం గ్రామానికి చెందిన కందా శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల వారు దాడులు చేసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాల పాలైన శ్రీనును చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మరలా రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా
గతంలో ఒకరిపై మరొకరు దాడులు, హత్యలు చేసుకున్న బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠా సభ్యులు ప్రస్తుతం బెయిల్‌ పై జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మరలా వీరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే లక్ష్యంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ముఠా సభ్యులు వివిధ కేసుల్లో జైలుకు వెళితే కొందరు రాజకీయ నాయకులు వీరికి బెయిల్‌ ఇప్పించి మరీ బయటకు తీసుకువస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తరచూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం, ఒంటిరిగా ఉన్న మహిళలు, పురుషులు, ఆటోలో వెళుతున్న వారిపై దాడులు చేసి వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు దోచుకోవడం వీరి వృత్తిగా మారింది.

 ఎస్పీ బి.రాజ కుమారి కార్డెన్‌ సెర్చ్‌ పేరుతో ఆకస్మిక తనిఖీలు చేసి వీరిలో కొంత మందిని అరెస్ట్‌ చేశారు. అయితే మరలా వీరిపై దృష్టి సారించకపోవడంతో మరోసారి వీరు రెచ్చిపోయి నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా బ్లేడ్‌ బ్యాచ్‌పై దృష్టి సారించి వారి కదలికల పై దృష్టిసారించకపోతే నగరంలో మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రజలు హడలిపోతున్నారు.

మరిన్ని వార్తలు