పనిపైనే పని.. ఇదేం పని..?

31 Jan, 2018 11:42 IST|Sakshi
ఈ నెల 24వ తేదీన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన సందర్భంగా నేతలు ఆవిష్కరించిన శిలాఫలకం

15 రోజుల క్రితం రూ.30 లక్షలతో ప్యాచ్‌ వర్కు

తాజాగా అదే ప్రాంతంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు

వైభవంగా శంకుస్థాపన చేసిన మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు

రాజమహేంద్రవరం నగరపాలక మండలి ‘చిత్ర’మైన నిర్ణయం

ప్రజాధనం వృథాపై విస్తుపోతున్న నగర వాసులు

మేయర్‌... కమిషనర్‌... భారీ యంత్రాంగం... ఇంజినీరింగ్‌ బృందం. వీరికితోడు 50 మంది కార్పొరేటర్లతో పాలకవర్గం. వీరితోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములై సమావేశాల మీద సమావేశాలు పెట్టి... మేధో మధనం చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పదిహేను రోజుల కిందటే ప్యాచ్‌ వర్క్‌లు చేసిన రహదారికే మళ్లీ సుమారు అరకోటి కేటాయించి సీసీ రోడ్డేమిటీ అని విస్తుపోతున్నారా... అది వారి సొంతపనైతే ఆలోచించేవారు...కానీ ఇది ప్రజల సొమ్ముతో చేస్తున్న పనులు కదా.. అందుకే ఈ ‘కథ’ంతా... అసలు కథేమిటో తెలుసుకోవాలని ఉందా...

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల డబ్బును రూపాయి కూడా వృథాగా పోనివ్వమంటూ నెల రోజుల కిందట రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీశేష సాయి విలేకర్ల సమావేశంలో చెప్పిన మాటలు. పాలక మండలి మాటలకు చేతలకు ఎక్కడ పాంతనలేకుండా పాలన సాగుతోందని తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మనది కాదు.. పోయేది ప్రజల డబ్బే’ కదా అన్నట్లు నగరపాల సంస్థ లక్షల రూపాయలు వృథా చేస్తోంది. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డును పుష్కరాల సమయంలో వేశారు. ఏడాది తిరగకుండానే రోడ్డు ధ్వంసమైంది. ప్యాచ్‌ వర్కులు చేశారు. తిరిగి మూడు నెలల కిందట కురిసిన కొద్దిపాటి వర్షాలకు రోడ్డులోని పల్లపు ప్రాంతంలో గుంతలు పడ్డాయి. ఈ విషయంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్చించారు.

నగరంలో అవసరమైన చోట ఇకపై సీసీ రోడ్లు వేయాలని పాలక మండలి, యంత్రాంగం నిర్ణయించింది. నిర్ణయం బాగానే ఉన్నా అమలులో ఇందుకు భిన్నంగా జరిగింది. ఏవీ అప్పారావు రోడ్డులో ప్యాచ్‌ వర్కులంటూ రూ.30 లక్షలతో రూపాందించిన అంచనాలను స్థాయీ సంఘం ఆమోదించింది. ఏవీ అప్పారావు రోడ్డు ఉత్తరం వైపున పల్లపు ప్రాంతంలో ప్యాచ్‌ వర్కులు చేశారు. ఈ పనులు జరిగి 15 రోజులు కూడా కాకుండానే తిరిగి అదే ప్రాంతంలో రూ.49.90 లక్షలతో సిమెంట్‌ రోడ్డు వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీశేష సాయి, ఎంపీ మాగంటి మురళీ మోహన్, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఇదేమి చోద్యం...
15 రోజులపాటు గుంతలు లేకుండా చేయడానికి రూ.30 లక్షల ఖర్చు పెట్టిన నగరపాలక సంస్థ పాలక మండలి తీరు తీస్తున్న నగరప్రజలు విస్తుబోతున్నారు. రెండు నెలలపాటు గుంతల రోడ్డులోనే ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించారు. హడావుడిగా అంచనాలు రూపాందించి స్థాయీ సంఘంలో ఆమోదింపజేసి రూ.30 లక్షల రోడ్డుపాలు చేశారని నగర ప్రజలు మండిపడుతున్నారు. తిరిగి 15 రోజుల్లోనే రూ.49.90 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో పదిహేను రోజుల కిందట ప్యాచ్‌ వర్కుల కోసం ఖర్చు పెట్టిన రూ.30 లక్షలు రోడ్డుపాలయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు.

గుంతలు పడుతున్నందుకే...
వర్షం వచ్చిన ప్రతిసారీ ఏవీ అప్పారావు రోడ్డులోని పల్లపు ప్రాంతంలో నీరు నిలుస్తుండడంతో గుంతలు పడుతోంది. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు సిమెంట్‌ రోడ్డు వేస్తున్నాం. 15 రోజుల కిత్రం వేసిన  బీటీ రోడ్డుపైనే సీసీ రోడ్డు వేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. పూర్వాపరాలు అధికారులను అడిగి తెలుసుకుంటాం. – పంతం రజనీశేషసాయి, మేయర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

మరిన్ని వార్తలు