చలికాలం.. వ్యాధుల గాలం

12 Jan, 2018 11:53 IST|Sakshi

రాయవరం (మండపేట): కోళ్లకు చలికాలంలో ఎక్కువగా వ్యాధులు సోకుతాయి. జిల్లాలో సుమారుగా రూ.కోటికి పైగా లేయర్‌ కోళ్లు ఉన్నాయి. కోళ్లకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు సంభవిస్తాయని రాయవరం ఏరియా పశువైద్యశాల ఏడీ డాక్టర్‌ ఎం.రామకోటేశ్వరరావు అంటున్నారు.

కొక్కెర తెగులు (రానికెట్‌ రోగం)..
ఈ వ్యాధి వల్ల కోళ్లు చనిపోతాయి. ఏ వయసు కోళ్లకైనా ఈ వ్యాధి రావచ్చు. రోగానికి గురైన కోళ్లు ముడుచుకుని ఉండి రెక్కలు వేలాడదీసుకుంటాయి. పక్షవాతపు లక్షణాలు కన్పిస్తాయి. మెడ వెనక్కి వాలుతుంది. విరేచనాలు తెలుపు, ఆకుపచ్చ రంగులో అవుతుంటాయి. శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. నివారణకు మొదటి, నాలుగో వారం, ఆ తర్వాత 6–8 వారాల మధ్య మరొకసారి, చివరగా 20వ వారం టీకాలు వేయాలి.

మశూచి
ఈ వ్యాధి వల్ల గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గి కోళ్లు చనిపోతాయి. జుట్టు మీద, తమ్మెలకు కనురెప్పల చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. అప్పుడప్పుడూ కళ్లలో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్లు కనబడవు. నివారణకు ఇవి 6–7 వారాల వయసులోను, మళ్లీ 16–17 వారాల మధ్య టీకాలు వేయాలి.

కొరైజా...
కోడిపిల్లలు సరిగా నీటిని తాగక, మేతను తినక బరువును కోల్పోతాయి. ఫారం కోళ్ల షెడ్డులోకి ఈ వ్యాధి వచ్చినప్పుడు కొద్దిరోజులు షెడ్డు ఖాళీగా పెట్టి, బ్లోలాంప్‌తో నేల, గోడలను కాల్చాలి. సున్నం, గమాక్సిన్, పినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి గోడలకు పూయాలి. హూస్టసైక్లిన్‌ లేదా ఇతర యాంటి బయాటిక్‌ మందులు విటమిన్‌తో కలిపి వారం రోజులు వాడాలి.

పుల్లోరం..
ఈ వ్యాధి తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికూడడం, భారంగా శ్వాస తీసుకోవడం, మెడ వాల్చడం గమనించవచ్చు. తెల్లని పెంట మలద్వారం వద్ద అంటుకుని ఉంటుంది. యాంటి బయాటిక్‌ మందులు వాడాలి.

ఎస్సరీషియా కొలై..
ఈ వ్యాధి బ్రాయిలర్‌ కోళ్లలో వస్తుంది. యాంటి బయాటిక్స్‌ మందులు మేతలో, నీటితో పాటు సేనిటైజర్‌ మందును కోళ్లకు ఇవ్వడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

కాక్సీడియోసిస్‌
ప్రోటోజోవా వల్ల సోకే ఈ వ్యాధితో తరచు కోళ్ల పరిశ్రమ నష్టానికి గురవుతుంది. బ్రాయిలర్‌ కోళ్లు అధిక సంఖ్యలో మరణిస్తాయి. మేతలో, నీటిలో కాక్సిడియోస్టాట్‌ మందులు వాడితే రోగాన్ని నివారించవచ్చు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
కోళ్లకు వేసే టీకా మందులు ఐస్‌ లేదా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇతర రోగాలున్నప్పుడు టీకాలు వేయరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లోనే టీకాలు వేయాలి. టీకా మందు సీసా నుంచి తీసి కలిపిన తర్వాత రెండు గంటల లోపే వాడాలి.

మరిన్ని వార్తలు