లీటర్ ఆయిల్ పై 70 శాతం పన్నులు

24 Jun, 2020 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్స్ మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి. కొనేది కారైనా, బైకైనా మనోళ్లు చూసేది మాత్రం వాల్యూ ఫర్ మనీ! అందుకే కార్ల కోసం మారుతి సుజుకీ వైపు, బైకుల కోసం హీరో కంపెనీ వైపు చూస్తారు. హీరో ఇండియాలో అతి పెద్ద బైకుల తయారీ కంపెనీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బైకులు, కార్లు కొనే ముందు ఓ సారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు.

గడచిన పదేళ్లలో వాహనాల ఇంధన రేట్లు పెరగడం ఒక ఎత్తైతే, ఈ పదిహేను రోజుల్లో పెరిగిన తీరు మరో ఎత్తు. పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం వినియోగదారుల్లో గుబులుపుట్టిస్తోంది. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలను తాకాయి. ఇలా వాహనదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం నిజంగా ఆయిల్ కంపెనీలకే వెళ్తుందా అంటే సమాధానం లేదు అనే చెప్పాలి. (అప్లికేషన్‌లో దగ్గు మందు.. తెచ్చింది కరోనా మందు)

ప్రతి లీటరుకు చెల్లిస్తున్న మొత్తంలో 60 శాతానికిపైగా పన్ను కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. మే ఆరో తేదీన ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు 71.26 రూపాయలు కాగా, లీటరు డీజిల్ ధర 69.39. వీటి నుంచి పన్నుతీసేస్తే లీటరు పెట్రోల్ అసలు ధర 18.28 రూపాయలుగా, లీటరు డీజిల్ ధర 18.78 రూపాయలుగా తేలింది.

కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 32.98 రూపాయలు, లీటరు డీజిల్ పై 31.83 రూపాయల ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై 16.44 రూపాయల వ్యాట్ విధిస్తోండగా, లీటరు డీజిల్ పై 16.26 రూపాయల పన్ను వడ్డిస్తోంది. అతి కొద్ది మొత్తం డీలర్ మార్జిన్ కింద పోతోంది. వీటన్నింటినీ కలిపితే లీటరు ఆయిల్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా పన్ను వేస్తున్నాయి.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు)

కరోనా వైరస్ వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ఆయిల్ పై పన్ను శాతం 75ని తాకింది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 55 శాతం పైగా సుంకాలను చమురుపై వడ్డిస్తున్నాయి.

2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ సెక్టార్ నుంచి భారత ప్రభుత్వానికి 2.14 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.50 లక్షల కోట్లను చమురు రంగం ఆర్జించిపెట్టింది.

మరిన్ని వార్తలు