మహిళ.. మనీ.. మేనేజ్‌మెంట్‌!

15 Jan, 2018 00:52 IST|Sakshi

ముందు నుంచీ అవగాహన ప్రధానం

పరిస్థితులు ఎదురు తిరిగితే ఇబ్బందే

పూర్తి అవగాహన వచ్చాకే పెట్టుబడులు

అంతవరకూ బ్యాంకు డిపాజిట్లే బెటర్‌

ఆర్థిక నిపుణులు, ప్లానర్ల సూచనలు  

(సాక్షి, బిజినెస్‌ విభాగం) : మగవారితో పోలిస్తే దేశంలో ఆర్థిక విషయాల గురించి పట్టించుకునే మహిళలు తక్కువ. ముఖ్యంగా వివాహం తరవాత కుటుంబంలో ఆర్థిక అంశాలు, ప్రణాళికలన్నీ పురుషులే చూస్తుంటారు. తక్కువ శాతం ఇళ్లలోనే మహిళలు ఆ పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి కుటుంబానికి ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ఏంటన్నదానిపై మహిళలకు మంచి అవగాహనే ఉంటుంది. కాకపోతే ఆర్థిక అంశాలు, పెట్టుబడుల విషయం మనకెందుకులే అని దూరంగా ఉండిపోతారు. ఈ ధోరణే భవిష్యత్తులో వారు ఒంటరిగా, తమ కాళ్లపై తాము జీవించాల్సి వస్తే ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కారణాలేవైనప్పటికీ తాము ఒంటరిగా పిల్లలతో కలసి జీవించాల్సి వస్తే తమ అవసరాలకు, లక్ష్యాలకు, ఆర్థిక భద్రతకు ఏం చేయాలన్న అంశాల గురించి తెలియకపోవటం సమస్యలకు దారితీస్తుందంటున్నారు ఫైనాన్షియల్‌ ప్లానర్లు. 

తమకెందుకులేనన్న ధోరణి తప్పు!
‘‘ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కొనే మహిళల్లో అధిక శాతం భారీ నగదు నిర్వహణ తెలియని వారే ఉంటారు. నగదు నిర్వహణ వ్యవహారం తమ ఉద్యోగం కాదులేనన్న ధోరణి చాలా మంది మహిళల్లో, కుటుంబాల్లో ఉండటమే దీనికి కారణం. కనీసం సాధారణ బ్యాంకింగ్‌ లావాదేవీలు తెలియని వివాహిత మహిళలు కూడా చాలా మందే ఉంటారు. ఈ విధమైన సందర్భాలు ఎదురైనప్పుడు వారు అచేతనంగా కొన్నాళ్ల పాటు ఏమీ చేయకుండా అలానే ఉండిపోతారు. లేదంటే ఆ నిధుల్ని తప్పుగా ఇన్వెస్ట్‌ చేస్తారు. పైపెచ్చు ఇలాంటి సందర్భాల్లో వారు విశ్వసనీయత లేని సన్నిహితులు, స్నేహితులపై ఆధారపడతారే గానీ ఫైనాన్షియల్‌ ప్లానర్ల సాయం తీసుకునేందుకు ముందుకు రారు. ఫైనాన్షియల్‌ ప్లానర్ల గురించి తెలియకపోవడం కూడా ఓ కారణం’’ అని హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్‌ సీఈవో సంజీవ్‌ గోవిల చెప్పారు.

సమాన బాధ్యత ఉండాలి...
ఒంటరి మహిళలు ముఖ్యమైన అన్ని ఆర్థిక లక్ష్యాల పట్ల సమాన బాధ్యత వహించాలని ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు మ్రిణ్‌ అగర్వాల్‌ సూచించారు. ఎక్కువగా పిల్లల విద్యకే ప్రాధాన్యమిస్తుంటారని, అదే సమయంలో తమ రిటైర్మెంట్‌ అవసరాల గురించి నిర్లక్ష్యం వహించడం లేదా పూర్తిగా మర్చిపోతారని ఆమె చెప్పారు. వ్యక్తిగత బీమా రక్షణకు టర్మ్‌ ప్లాన్, కుటుంబం కోసం ఆరోగ్య బీమా అన్నవి ఒంటరి మహిళలకు అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యాలని ఆమె సూచించారు.

పలు సమస్యలుంటాయి...
భర్తకు దూరమైన ప్రతి మహిళకు సాధారణంగా పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. జీవనం ఎలా, తన భర్త ఏవిధంగా సంపాదించేవారు, తను ఏ విధంగా ఇన్వెస్ట్‌ చేసేవారు అనేవి ఎక్కువగా ఎదురయ్యేవని జైపూర్‌కు చెందిన ఫైనాన్షియల్‌ ప్లానర్‌ వినితా బరయా తెలియజేశారు. ‘‘ఒకవేళ తన భర్త మరణంతో బీమా పరిహారం అందితే గనుక దాన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. అప్పుడు పెట్టుబడులు, ఆర్థిక అంశాల గురించి నేర్చుకోవాలి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, మదుపు, బాధ్యతల గురించి స్పష్టత వచ్చిన తర్వాత  ఇన్వెస్ట్‌ చేయడం ఆరంభించాలి’’ అని సూచించారు.  

పెట్టుబడులు ప్రారంభించాలి
► ఒంటరి మహిళలు భర్తకు దూరమైనప్పుడు తమ నిధుల నిర్వహణను బంధువులకు ఇవ్వకూడదు.

► ఆర్థికాంశాల గురించి పెట్టుబడుల గురించి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్న నిధుల్ని బ్యాంకులో ఎఫ్‌డీ చేయడమే బెటర్‌.

► ఆ తర్వాత పెట్టుబడులు, రాబడుల గురించి కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలి. 

► ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. అవసరం అనుకుంటే ఫైనాన్షియల్‌ ప్లానర్లను ఆశ్రయించాలి.

► ఒకసారి ఆర్థికాంశాలు, పెట్టుబడుల గురించి అవగాహన వచ్చాక క్రమంగా దాన్ని ఆచరణలో పెట్టాలి. బ్యాంకు ఎఫ్‌డీలో నుంచి కొంత మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించాలి. మరింత అవగాహన, విషయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ప్రణాళికను అమల్లో పెట్టాలి.

ఫైనాన్షియల్‌ ప్లానర్‌ ఎంపికలో..
► సంబంధిత వృత్తిలో కొన్నేళ్లయినా అనుభవం కలిగి ఉండాలి. 

► ఫీజులు, చార్జీల గురించి ముందే విచారించాలి. కమిషన్‌పై సలహాలిస్తారా లేక వార్షిక ఫీజు తీసుకుంటారా? లేక ప్రతీసారి నిర్ణీత ఫీజు తీసుకుని సూచనలిస్తారా అన్నది తెలుసుకోవాలి.

► కేవలం ఏం చేయాలన్నది సూచిస్తారా లేక మన తరఫున వారే లావాదేవీలు నిర్వహిస్తారా?

► ఆర్థిక అంశాల గురించి సంపూర్ణంగా తెలియజేస్తారా... లేదా అన్నది కనుక్కోవాలి.
– మ్రిణ్‌ అగర్వాల్, ఉమంత్ర సహ వ్యవస్థాపకురాలు

దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు కావాల్సినవి...

► పొదుపు, మదుపులకు క్రమశిక్షణ తప్పనిసరి.

► ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత అవసరం. ఉదాహరణకు పిల్ల ఉన్నత విద్య, పదవీ విరమణ అనంతరం అవసరాలు ఈ విధమైన లక్ష్యాలకు సంబంధించి చేయాల్సిన పెట్టుబడుల్లో స్పష్టత ఉండాలి. 

► మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నేళ్ల సమయం ఉందన్నది కీలకం. 

► పెట్టుబడుల్లో మార్కెట్‌ స్వల్పకాల ఆటుపోట్లను పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. 

► మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిప్‌పై విశ్వాసం ఉంచాలి. దీనివల్ల కొనుగోలు వ్యయాలు సగటుగా మారి, ప్రతికూల రిస్క్‌లు పరిమితం అవుతాయి.
– వినితా బరాయా, వెల్త్‌ మేనేజర్‌

వ్యవధిని బట్టి పెట్టుబడి..
పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. మీరు భరించే రిస్క్‌కు అనువైన సాధనంలో ఆర్థిక లక్ష్యాలకు అవసరమైన మేర ఇన్వెస్ట్‌ చేయాలి. 

► వచ్చే రెండు, మూడేళ్ల కాల అవసరాల కోసం అయితే సురక్షితమైన డెట్‌ సాధనాల్లో పెట్టాలి.

► చాలా ఏళ్ల తర్వాతే అవసరం అనుకుంటే ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. 

► కేవలం సురక్షిత సాధనాలనే ఆశ్రయిస్తే భవిష్యత్తు అవసరాలకు గండిపడినట్టే.

► బంగారం అయినా, రియల్‌ ఎస్టేట్‌ అయినా మీకు అవసరం అయితేనే కొనుగోలు చేయాలి. 

► బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. జరగరానిది జరిగితే రక్షణ కల్పించేది. 
సంజీవ్‌గోవిల, హమ్‌ఫౌజి ఇనీషియేటివ్స్‌ సీఈవో 

Read latest Economy News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా