మరో సంక్షోభంలో ఆప్‌ 

20 Jan, 2018 02:05 IST|Sakshi

వివాదాలూ, ఘర్షణలు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కొత్త కాదు. కానీ ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం రూపంలో వచ్చిన సంక్షోభం వాటన్నిటినీ మించిపోయింది. ఆయన ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సు తోనే షాక్‌ తిన్న ఆయన ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభిం చకపోవడం మరో షాక్‌. 70మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో 65మంది బలం ఉన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ఈ చర్యవల్ల వెనువెంటనే ఏర్పడగల ముప్పేమీ లేకపోవచ్చు.

కానీ ఎన్నికల సంఘం సిఫార్సును రాష్ట్రపతి ఆమోదిస్తే, దాన్ని న్యాయస్థానాలు సబ బేనని తేల్చి చెబితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఆ ఇరవైచోట్లా మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తే, అందులో  మెజారిటీ సీట్లు తిరిగి సాధించలేకపోతే ఏమైనా జర గొచ్చు. ఆ సంగతలా ఉంచి ఎన్నికల సంఘం సిఫార్సులోని సహేతుకతపై కూడా విమర్శలు రాక తప్పదు. ఆప్‌ ప్రభుత్వం 2015 మార్చి 13న చేసిన ఈ నియామకా లను ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు చెల్లుబాటు కావంటూ కొట్టేసింది. కోర్టు కొట్టేశాక ఇక  ఫిర్యాదు స్వీకరించడమేమిటని ఆప్‌ అభ్యంతరపె ట్టినా ఎన్నికల సంఘం ఖాతరు చేయలేదు. ఆ కొన్నాళ్లపాటూ ‘లాభదాయక పద వుల్లో’ ఉన్నారు గనుక విచారణ జరుపుతామని చెప్పింది.

వాస్తవానికి ‘లాభదాయక పదవులు’ అనే మాటను ఏ చట్టమూ నిర్వచించడం లేదు. అయితే చట్టసభల సభ్యుల అనర్హతను నిరోధించే చట్టం ఉంది. అందులో అన ర్హత పరిధిలోనికి రాని ప్రభుత్వ పదవులేమిటన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యాంగంలోని 102వ అధికరణ పార్లమెంటు సభ్యుల అనర్హత గురించీ, 191వ అధికరణ అసెంబ్లీ సభ్యుల అనర్హత గురించీ మాట్లాడుతున్నాయి. 103(2) అధికరణ ప్రకారం చట్టసభల సభ్యులపై అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదే. అయితే ఆయన ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని దాని ఆధా రంగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆ అధికరణ నిర్దేశిస్తోంది. 1982లో అన్నా డీఎంకే ఎంపీ ఆర్‌. మోహనరంగంను అప్పటి ఎంజీఆర్‌ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వం పోయింది.

ప్రముఖ నటి జయాబచ్చన్‌ రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ఉత్తరప్రదేశ్‌ చలనచిత్ర అభివృద్ధి మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడం చెల్లదని 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ నిర్ణయం సబబేనని 2006లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో సోనియాగాంధీ జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్‌గా వ్యవహరించడంపై అభ్యంతరాలొచ్చినప్పుడు ఆమె అటు మండలి పద వికి, ఇటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. 

నిర్దిష్టమైన చట్టం లేదు గనుక... ఏది లాభదాయక పదవి, ఏది కాదు అని నిర్వ చించడానికి సర్వోన్నత న్యాయస్థానం వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులే ఆధారం. ప్రభుత్వం నుంచి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు పొందితేనే ‘లాభదాయక పదవి’గా పరిగణించాలన్నది ఆ తీర్పుల సారాంశం. మొత్తానికి న్యాయస్థానాల నుంచి సమస్యలెదురవుతున్నా, ఎదురవుతాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులు ఆశించేవారు ఎక్కువ కావడం, రాజ్యాంగం అందుకు పరిమితి విధించడంతో ఎటూ పాలుబోని ప్రభు త్వాలు పార్లమెంటరీ సెక్రటరీ పదవులివ్వడాన్ని పరిష్కారంగా భావిస్తున్నాయి. వాటిపై విమర్శలు వెల్లువెత్తి, ఫిర్యాదులు వెళ్లి ఎన్నికల సంఘం కదలడానికి... న్యాయస్థానాల్లో ఎవరైనా సవాలు చేసినా దానిపై తీర్పు వెలువడటానికి సమయం పడుతుంది గనుక ఈ పదవుల పందేరాన్ని ఆపనవసరం లేదని ప్రభుత్వాలు భావి స్తున్నాయి.

రాజ్యాంగంలోని 164(1ఏ) అధికరణ ప్రకారం మొత్తం అసెంబ్లీ సంఖ్యా బలంలో 15 శాతానికి మించి మంత్రి పదవులు ఇవ్వడానికి వీల్లేదు. ఢిల్లీ అసెంబ్లీ విషయానికొచ్చేసరికి ఇది 10 శాతం మాత్రమే. 2015లో తెలంగాణకు, పశ్చిమ బెంగాల్‌కు పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నియామకాల విషయంలో న్యాయ స్థానాల్లో చుక్కెదురైంది. ఇప్పుడు ఆప్‌ ఎమ్మెల్యేల విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు పాలించే రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు సైతం ఇలాంటి నియామకాలు చేశాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌లతోసహా 11 రాష్ట్రాల్లో పార్లమెంటరీ సెక్ర టరీలున్నారు. ఈ విషయంలో వివిధ న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అస్సాం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటికి ఆ రాష్ట్రంతోపాటు ఈశాన్యంలోని మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో మొత్తం 93మంది పార్లమెంటరీ సెక్రటరీలున్నారు. ఆ తీర్పుతో వారందరి పదవులూ ఊడాయి. 

ఢిల్లీకి సంబంధించినంతవరకూ 1997నాటి ఎమ్మెల్యేల అనర్హత నిరోధక చట్టంలో మినహాయింపు పొందిన పదవుల జాబితాలో పార్లమెంటరీ సెక్రటరీ పదవి లేదు. అలా లేనంతమాత్రాన ఆ పదవి ‘అనర్హత’కు దారితీయదని ఆప్‌ వాదిస్తోంది. తాము పార్లమెంటరీ సెక్రటరీకి ఎలాంటి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించ లేదంటున్నది. పనిలో పనిగా నిరుడు ఎందుకైనా మంచిదని 1997నాటి అనర్హత నిరోధక చట్టానికి సవరణలు తెస్తూ బిల్లు తీసుకొచ్చింది. అయితే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ దాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆప్‌ ఎన్నికల సంఘానికి ఉద్దేశాలు ఆపాదిస్తోంది. అది పెనువేగంతో ఈ కేసును తేల్చిన తీరును ప్రశ్నిస్తోంది. వేరే పార్టీల ప్రభుత్వాలున్నచోట ఇలాగే వ్యవహరించారా అంటున్నది. ఇవన్నీ అడ గాల్సిన ప్రశ్నలే. కానీ విలువలతో కూడిన పాలన అందిస్తానని, ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని చెప్పిన ఆప్‌ కూడా సగటు రాజకీయ పక్షాల దారిలో అసంతృప్త ఎమ్మె ల్యేలను బుజ్జగించడానికి దొడ్డిదోవన పదవుల పందేరానికి ఎందుకు దిగినట్టు? ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు