ఆర్ధిక వ్యవస్థకు షాక్!

26 Sep, 2014 02:05 IST|Sakshi

ఏళ్లతరబడి అడ్డూ ఆపూ లేకుండా సాగిన ఒక అరాచకం ఎలాంటి సమస్యలు సృష్టించగలదో, ఏ పర్యవసానాలకు దారితీయగలదో బొగ్గు కుంభకోణంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు తేటతెల్లం చేస్తున్నది. 1993 మొదలుకొని 2012 వరకూ వివిధ ప్రైవేటు సంస్థలకు బొగ్గు క్షేత్రాలు ధారాదత్తం చేసిన తీరు చట్టవిరుద్ధమైనదని, ఈ కాలమంతా కట్టబెట్టిన 218 బొగ్గు క్షేత్రాల్లో నాలుగు మినహా మిగిలినవాటిని రద్దు చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

రెండేళ్లక్రితం కాగ్ ఆరా తీయడంతో వెల్లడై ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కుంభకోణంవల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లింది. అవసరమైన సంస్థలకు కావలసిన బొగ్గు అందుబాటులో లేకపోగా తమ పలుకుబడితో బొగ్గు క్షేత్రాలు పొందినవారు వాటిని వేరేవారికి అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఆఖరికి ప్రభుత్వరంగ సంస్థలతో కొందరు జాయింట్ వెంచర్లకు దిగి వాటి బొగ్గు క్షేత్రాల్లో కూడా లాభాల పంట పండించుకున్నారు. చేష్టలుడిగిన యూపీఏ సర్కారు ఈ స్కాం విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కి బొగ్గు క్షేత్రాలన్నిటా ఈ రెండేళ్లనుంచీ పనులన్నీ స్తంభించిపోయాయి. ఫలితంగా సిమెంటు, ఉక్కు వగైరా పరిశ్రమల్లో ఉత్పత్తి మందగించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులదీ అదే పరిస్థితి.

తాజా తీర్పు వల్ల ఈ అనిశ్చితి తొలగిందనీ, సహజవనరుల కేటాయింపులో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో స్పష్టత వచ్చిందనీ కొందరు సంతోషిస్తుంటే...అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బతినడం ఖాయమని మరికొందరు వాపోతున్నారు. ఈ రెండు అభిప్రాయాల్లోనూ నిజముంది. ఈ బొగ్గు క్షేత్రాల చుట్టూ ఎన్నో సంస్థలూ, వాటిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, ఆ సంస్థలకు భారీయెత్తున రుణాలు మంజూరుచేసిన బ్యాంకులున్నాయి. బొగ్గు క్షేత్రాలను హామీగా చూపి రుణాలు తీసుకున్నవారెందరో ఉన్నారు. చాలా సంస్థలు అనిశ్చితిలో పడి ఇప్పటికే వడ్డీ కూడా కట్టలేకపోతున్నాయి.

ఆయా సంస్థలకిచ్చిన బొగ్గు క్షేత్రాలన్నీ సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కిపోయాయి గనుక ఈ బాపతు రుణాలు లక్ష కోట్ల రూపాయలూ ఎలా రాబట్టుకోవాలో అర్థంకాని అయోమయంలో బ్యాంకులు పడ్డాయి. ఇక రద్దయినవాటిలో 42 బొగ్గు క్షేత్రాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ క్షేత్రాలనుంచి వచ్చే బొగ్గుపై ఆధారపడి ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయి. వీటిలో కొన్నింట ఉత్పత్తి నిలిచిపోవడం లేదా అవి విదేశాల నుంచి బొగ్గు దిగుమతికి సిద్ధపడటం తప్పనిసరవుతుంది. తీర్పువల్ల ఏతావాతా లాభపడింది ప్రభుత్వమే. బొగ్గు క్షేత్రాలు పొంది వాటిల్లో పనులు ప్రారంభించని సంస్థలకు ఆ క్షేత్రాల్లో ఎన్ని టన్నుల బొగ్గు ఉండగలదో లెక్కేసి టన్నుకు రూ. 295 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రకంగా సర్కారుకు రూ. 10,000 కోట్ల వరకూ రావొచ్చని అంచనా.

సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చింది గనుక ఆరునెలల్లో అంతా సరిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. చురుగ్గా వ్యవహరించి పారదర్శకమైన విధానాలు రూపొందించి బొగ్గు క్షేత్రాల వేలానికి చర్యలు తీసుకుంటామంటున్నది. కానీ అదంత సులభంకాదు. ఇప్పుడు రద్దయిన సంస్థల్లో ఎన్నింటికి తాజా వేలంలో మళ్లీ బొగ్గు క్షేత్రాలు లభిస్తాయో చెప్పడం కష్టమే. అలా లభించకపోతే అధిక ధర చెల్లించి అవి బయటినుంచి కొనుగోలు చేసుకోవాలి. అందువల్ల వాటిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. ఆ భారం చివరకు  జనంపైనే పడుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందించాల్సిన ప్రభుత్వాలు బాధ్యత మరచి వ్యవహరించిన పర్యవసానమిది. స్కాం బయటపడినప్పుడు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్డీయే హయాంలో పాటించిన విధానాన్నే తామూ కొనసాగిస్తున్నామని యూపీఏ ప్రభుత్వం దబాయించింది.

అవసరాలను తీర్చే స్థాయిలో బొగ్గు క్షేత్రాలు లేనప్పుడు వాటి కోసం తీవ్ర పోటీ ఏర్పడుతుందని...కేటాయింపులకు పారదర్శకమైన విధానాన్ని అనుసరించకపోతే అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నదని ఆనాటి వాజపేయి ప్రభుత్వం అనుకోలేదు. ఆర్థికవేత్తగా పేరున్న మన్మోహన్ కూడా భావించలేదు. సరిగదా పోటీ వేలం విధానాన్ని అనుసరించాలని సీనియర్ అధికారి పీసీ పరేఖ్ చేసిన సూచనను బుట్టదాఖలా చేశారు. పర్యవసానంగా ఏం జరిగిందో కాగ్ లెక్కలుగట్టి చెప్పినప్పుడైనా సరిచేసుకుని ఉంటే నష్ట తీవ్రత తగ్గేది. ఇక్కడి ప్రభుత్వాలు న్యాయ సమీక్షకు నిలబడగల విధానాలను రూపొందించలేవని, ఇక్కడ పెట్టే పెట్టుబడులు గాలిలో దీపమవుతాయని విదేశీ ఇన్వెస్టర్లు భావించడానికి తాజా పరిణామాలు ఆస్కారమిచ్చాయి.

ఒకపక్క ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండగా ఇలాంటి స్థితి ఏర్పడటం ఏ సంకేతాలనిస్తుందో సులభంగానే అంచనావేయొచ్చు. బొగ్గు క్షేత్రాలు పొంది నిర్వహిస్తున్న సంస్థలన్నీ ఆరు నెలల్లోగా వాటిని కోల్ ఇండియాకు అప్పజెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. కొత్త విధానం రూపొందేవరకూ వాటిని ఆ సంస్థే నిర్వహిస్తుందని తెలిపింది. అయితే, కోల్ ఇండియాకు అంతటి శక్తిసామర్థ్యాలే ఉంటే, అది సజావుగా బొగ్గు సరఫరా చేయగలిగివుంటే పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపే అవసరం ఉండేది కాదు. మొత్తానికి ఒక అనిశ్చితిని అంతమొందించే క్రమంలో మరో సంక్షోభానికి బీజం పడింది. ఇది బాధ్యత మరచిన పాలకులు చేసిన పాపం. విధాన రూపకల్పనలో ఎంత జాగ్రత్తగా మెలగాలో ఇప్పటికైనా మన నేతలు అర్థం చేసుకుంటే మంచిదే.

మరిన్ని వార్తలు