నిర్లక్ష్యానికి మూల్యం

23 Apr, 2019 00:27 IST|Sakshi

ఉగ్రవాద దాడులు, విధ్వంసం ఉదంతాలను దాదాపు మరిచిపోయిన శ్రీలంక ఈస్టర్‌ పర్వదినాన నెత్తురోడిన తీరు ఉగ్రవాదంపై ఉపేక్ష ఎంతటి ముప్పు తెచ్చిపెడుతుందో తేటతెల్లం చేసింది. ఆది వారంనాడు శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు.. అటు ఉత్తరప్రాంత నగరమైన బట్టికలోవలోని చర్చిలో కూడా ఉగ్రవాదులు కేవలం నిమిషాల వ్యవధిలో దారుణ మారణహోమాన్ని సృష్టించడం.. వాటికి 300మంది అమాయకులు బలికావడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంతవరకూ ఎంతో సందడిగా కనబడిన ప్రాంతాలన్నీ వల్లకాళ్లుగా మారడం, ఎటుచూసిన మాంసపు ముద్దలే దర్శనమీయడం, తమను కాపాడమంటూ గాయపడినవారు ఆర్తనాదాలు చేయడం ఎంతటివారినైనా కలచివేస్తుంది. దాడులకు ఎంచుకున్న సందర్భాన్ని, ప్రాంతాలను గమనిస్తే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా అర్ధమ వుతుంది. విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, స్థానిక సంపన్నులు సందర్శించే విలాసవంతమైన హోటళ్లపై ఉగ్రవాదులు గురిపెట్టారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పర్యాటకం దెబ్బతింటుందని వారు భావించినట్టు కనబడుతుంది. ఘటనలు జరిగిన 24 గంటల తర్వాత కూడా ఏ సంస్థా తామే ఈ పని చేశామని ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ ఆత్మాహుతి దాడులేనా కాదా అన్నది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

ఈ దాడులు సరిగ్గా పదకొండేళ్లక్రితం మన ముంబై నగరంపై ఉగ్రవాదులు సాగించిన యుద్ధాన్ని గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఉగ్రవాదులు రెండు విలాసవంతమైన హోటళ్లు, ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, యూదుల సామాజిక కేంద్రం వంటివి ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా మరణాల సంఖ్య అధికంగా ఉండేలా క్రైస్తవ పర్వదినాన్ని ఎంచుకుని, చర్చిలను లక్ష్యంగా చేసుకు న్నారు. విలాసవంతమైన హోటళ్లలో బాంబులు పేల్చారు. కొలంబోలోని కొచికడేలో ఉన్న సెయింట్‌ ఆంథోనీ కాథలిక్‌ చర్చి పర్యాటకపరంగా ఎంతో సుప్రసిద్ధమైనది. విదేశీ యాత్రికులు తప్పనిసరిగా సందర్శించే స్థలం. ఆత్మాహుతి దాడులు, విధ్వంస ఘటనలు శ్రీలంక గతంలోనూ చవిచూసింది.  దాదాపు మూడు దశాబ్దాలపాటు తమిళ టైగర్ల కార్యకలాపాలతో అట్టుడికిన దేశ మది. ఆ సంస్థను నామరూపాల్లేకుండా చేసి పదేళ్లవుతోంది. సుదీర్ఘకాలం ఇటువంటి ఘటనలతో తలపడి, ఎంతో అనుభవాన్ని సంపాదించిన దేశం ఇంత ఏమరుపాటుగా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంది? చూడటానికి అన్నిచోట్లా భద్రత కట్టుదిట్టంగానే ఉన్నట్టు కనబడుతుంది.

పైగా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని పక్షంరోజులక్రితమే ప్రభుత్వానికి ఉప్పందింది. కానీ ప్రజలను అప్రమత్తం చేయడంలో, ముష్కరులను నిలువరించడంలో అది ఘోరంగా విఫలమైంది. ఈ ఉన్మాదం వెనక స్థానికంగా పనిచేసే నేషనల్‌ తోహబుత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది పుట్టి అయిదేళ్లు కాలేదు. ఆ సంస్థ నిరుడు సాగించిన బుద్ధ విగ్రహాల విధ్వంసంతో తొలిసారి వార్తల్లోకెక్కింది. అలాంటి సంస్థ ఇంత పకడ్బందీగా, ఇంత భారీయెత్తున దాడులు చేయగలిగిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఈ స్థాయి దాడులు చేయా లంటే పటిష్టమైన పథకం రచించుకోవాలి. దాన్ని అమలు చేయడానికి భారీయెత్తున నిధులు సమ కూర్చుకోవాల్సి ఉంటుంది. బాంబులను అవసరమైన ప్రాంతాలకు చేరేయడానికి కావలసిన మను షులు అందుబాటులో ఉండాలి. ఇదంతా స్థానికంగా, అదికూడా పరిమితమైన ప్రాంతంలో కార్య కలాపాలు సాగించే సంస్థకు సాధ్యం కాదు. ఆ దేశంలో అధిక సంఖ్యాకులైన బౌద్ధ మతానికి చెందిన సింహళ జాతీయులతో గతంలో తమిళులకు తరచు ఘర్షణలు తలెత్తేవి.  నిరుడు బౌద్ధు లకూ, ముస్లింలకూ మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ దేశంలో ఎప్పుడూ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు లేవు. తమిళ టైగర్ల ఆధిపత్యం ఉన్న ఉత్తర తూర్పు ప్రాంతంలో సైతం క్రైస్తవులపై ఎప్పుడూ దాడులు జరగలేదు. దేశ జనాభాలో వారు మైనారిటీలు. వేరే జాతులతో వైరం లేదు. కనుకనే దాడులు జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  

ఏదైనా జరిగాక ఆదరా బాదరాగా చర్యలు తీసుకోవడం రివాజే. లంక ప్రభుత్వం కూడా ఆ పనే చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఆపేసింది. ఇటీవల న్యూజి లాండ్‌లోని క్రైస్ట్‌ చర్చిలో ఉగ్రవాది తాను సాగించిన మారణకాండను ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు ఫేస్‌బుక్‌ దాన్ని సకాలంలో గమనించి అరికట్టలేకపోయింది గనుక  ఈ చర్య తీసుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. వెనువెంటనే కర్ఫ్యూ విధించి నిందితుల గాలింపు ప్రారంభించి దాదాపు 30మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ముందస్తు సమాచారాన్ని భద్రతా వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదో అంతుబట్టదు. నిర్దిష్టంగా చర్చిలపై దాడులు జర గొచ్చునని కూడా ఆ సమాచారం తెలిపింది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. జాతుల ఘర్షణలు సర్వసాధారణమైన దేశంలో తాజా దాడులు ఎలాంటి పరిణామాలను తీసు కొస్తాయో ఊహించడం అసాధ్యం కాదు.

నాలుగేళ్లక్రితం వరకూ రహదారులు దిగ్బంధించి ముమ్మరంగా తనిఖీలు చేసే విధానం అమల్లో ఉండేది. అంతా సవ్యంగా ఉన్నదని భావించి ఆ సంప్రదాయానికి దేశంలో పూర్తిగా స్వస్తి పలికారు. తమిళ టైగర్లు అంతరించాక దేశం ప్రశాంతంగా ఉన్నదని భావించి విదేశీ పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి కూడా అవే భ్రమలున్నట్టున్నాయి. అందుకే నిఘాను అటకెక్కించింది. దాడులపై వచ్చిన ముందస్తు సమా చారాన్ని సైతం నిర్లక్ష్యం చేసే స్థితికి చేరుకుంది. ఈ తప్పిదానికి దాదాపు 300 మంది తమ ప్రాణా లను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తరచు పంజా విసు రుతున్న వర్తమానంలో ప్రతి దేశమూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసు కోవాలని లంక పేలుళ్లు హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు