భవిష్యత్తు తేల్చే ఫలితాలు!

5 Dec, 2013 04:49 IST|Sakshi

సంపాదకీయం: ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం జరిగిన పోలింగ్‌తో రెండు నెలలుగా హోరెత్తిన ఎన్నికల జాతర పూర్తయింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్‌గఢ్‌తోసహా రాష్ట్రాలన్నిటా పోలింగ్ ముమ్మరంగానే సాగింది. ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు పరస్పర నిందారోపణల్లో, విమర్శల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. బీజేపీ ప్రధాన ప్రచార సారథి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రతి చర్యనూ, పలుకునూ నిశితంగా గమనించి ఎప్పటికప్పుడు ఎద్దేవా చేస్తూ పిడుగులు కురిపిస్తే... కాంగ్రెస్‌కు సంజాయిషీలు ఇవ్వడానికే సరిపోయింది. ఎదురుదాడికి ఇక సమయమెక్కడిది? మోడీ చేసే విమర్శలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా... కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఏం మాట్లాడి పీకలమీదికి తెస్తారోనని కాంగ్రెస్ శ్రేణులు వణికిపోయాయి. నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో ఒక యువతి కదలికలపై మోడీ ప్రభుత్వం నిఘా ఉంచింద న్న కథనం వెల్లడయ్యేవరకూ కాంగ్రెస్‌ది అదే పరిస్థితి. సర్దార్ పటేల్ మొదలుకొని 370 అధికరణం వరకూ చరిత్రలోని వ్యక్తులనూ, ఉదంతాలనూ ఉదహరించడంలో తప్పులు చేస్తూ పోయిన నరేంద్రమోడీ ఆ బాణీని చివరివరకూ కొనసాగిం చారు. ఎవ రెన్నివిధాల చెప్పిచూసినా, ఎత్తి చూపినా ఆయన మారింది లేదు.
 
 విషాదమేమంటే, ఏ రాష్ట్రంలోనూ ఆయా పాలకపక్షాల అయిదేళ్లపాలనలోని లోటుపాట్లుగానీ, ఆ పార్టీల విధానాలుగానీ సరిగా చర్చకు రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యేముందు మావోయిస్టుల జరిపిన దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మావోయిస్టులతో కుమ్మక్కయింది మీరంటే మీరని ఆరోపించుకోవడం తప్ప అక్కడ నెలకొన్న పరిస్థితులపై లోతైన చర్చ జరగలేదు. దాదాపు తొమ్మిదిన్నరేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటున్న యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్... ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ భరోసాతో లేదు. పాలించే రాష్ట్రంలో దాన్ని నిలుపుకోగలమనిగానీ, విపక్షంగా ఉన్నచోట్ల అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలమనిగానీ ఆ పార్టీకే నమ్మకం లేదు. ఏ సర్వేలు గమనించినా, ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగానే ఉన్నదని వెల్లడవుతున్నది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆదరాబాదరాగా ఆహారభద్రతా చట్టం మొదలుకొని మహిళా బ్యాంకు వరకూ ఎన్నిటినో అమల్లోకి తెచ్చినా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయిందన్నది అర్ధమవుతోంది. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు... మరీ ముఖ్యంగా సామాన్యుడికి అందకుండాపోయిన ఉల్లిగడ్డలు కాంగ్రెస్ విజయావ కాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీని మట్టికరిపించలేని కాంగ్రెస్... రాజస్థాన్ లోనూ, ఢిల్లీలోనూ అధికారాన్ని కోల్పోనున్నదని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. రాజస్థాన్ బీజేపీ వైపు మొగ్గుచూపుతుండగా, ఢిల్లీలో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడ గలదనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటున్నారు.
 
 ఎన్నికలనేసరికి ప్రభుత్వాల పనితీరు, వాటి విధానాలు... వివిధ అంశాలపై పార్టీల వైఖరులు చర్చకు రావడం రివాజు. కానీ, ఈమధ్యకాలంలో అదంతాపోయి విమర్శలు, పరస్పర దూషణలే మిగులుతున్నాయి. కేవలం ఎవరు గద్దెనెక్కాలన్న అంశంలో తప్ప... దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పాలక, ప్రతిపక్షాలు రెండూ దాదాపు ఒకే వైఖరితో ఉండటమే ఇందుకు కారణం. విధానాలు, ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య ఘర్షణగా ఉండాల్సిన ఎన్నికలు వ్యక్తుల నిందారోపణలకూ, ధనబలానికీ ప్రతీకలవుతున్నాయి. అవతలి పక్షంతో పోలిస్తే తమది సమూల మార్పును కోరుకుంటున్న పార్టీ అని చెప్పడానికి అవసరమైన విధానాలు ఏ పార్టీకీ లేవు.
 
 ఇప్పుడు ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఒక్క ఢిల్లీ మాత్రం ఈ మూసనుంచి బయటపడింది. అక్కడ తొలిసారి బరిలోకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ప్రత్యామ్నాయ విధానాలనూ, ఆలోచనలనూ ఓటర్ల ముందుంచగలిగింది. ఎన్నికల ప్రణాళిక మొదలుకొని అభ్యర్థుల ఎంపికవరకూ విలక్షణమైన మార్గాన్ని ఎంచుకుంది. గంభీరమైన మాటలతో, ఆదర్శాలతో, అలవిమాలిన హామీలతో నిండివుండే ఎన్నికల ప్రణాళికకు భిన్నంగా నియోజకవర్గాలవారీ ప్రణాళికలను ప్రకటించింది. సాధారణంగా ఎన్నికల సమయంలో చర్చకు రాని మహిళల భద్రత వంటి అంశాన్ని ప్రధానాంశంగా మార్చింది. రాజకీయ అందలాలగురించి ఎలాంటి ఆశా లేని వేలాదిమంది యువ వలంటీర్లను సమీకరించగలిగింది. పాత ఓటర్లలో ఆలోచనలు రేకెత్తించడంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించగలిగింది.
 
 అయితే తాము లేదా అవతలి పార్టీ తప్ప మూడో పక్షానికి అవకాశమే ఉండరాదన్న కాంగ్రెస్, బీజేపీలకు ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాకే ఇవ్వగలిగింది. కేజ్రీవాల్ లేవనెత్తిన అంశాలపై మౌనంగా ఉండటం ద్వారా ఆయన పార్టీ ప్రాధాన్యతను తగ్గించవచ్చనుకున్న రెండు పార్టీలూ అందులో విజయం సాధించలేకపోయాయి. పోలింగ్ నాలుగైదు రోజులుందనగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై సాగిన స్టింగ్ ఆపరేషన్ల ప్రహసనమే దాని ప్రాధాన్యతను తెలియజెప్పింది. మొదట్లో గట్టి పోటీ మాత్రమే ఇవ్వగలదని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించగలదన్న అంచనాలు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం సందర్భంగా ఉవ్వెత్తున చెలరేగిన ఆందోళనల తర్వాత యువతరం ఆలోచనల్లో వచ్చిన మార్పు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్లూనుకోవ డానికి దోహదపడింది. నాలుగురోజుల్లో వెల్లడయ్యే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశం ఎటు మొగ్గుచూపబోతున్నదో తెలియజెబుతాయి. అందుకే ఈ ఫలితాలపై అందరికీ అంత ఆసక్తి.

మరిన్ని వార్తలు