ఇంత ఘోరమా!

26 Sep, 2017 00:49 IST|Sakshi

నిర్భయ చట్టంలాంటి కఠినమైన చట్టం తీసుకొచ్చినా దేశంలో మహిళలపై అఘా యిత్యాలు ఎందుకు ఆగటం లేదో తెలియాలంటే బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఉదంతాన్ని చూడాలి. ఆ విశ్వవిద్యాలయం గత మూడు నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ ఆందోళనకు దారితీసిన ఉదంతాన్ని, దానిపై యూనివర్సిటీ స్పందననూ గమనిస్తే దిగ్భ్రమ కలుగుతుంది. ఆ ప్రాంగణంలో ఒక విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన దుండగులను అరెస్టు చేయాలని, భద్రత కట్టుదిట్టం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఇందులో అసహజమైనదీ, విపరీతమైనదీ ఏం లేదు. కానీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జీసీ త్రిపాఠీకి ఇదంతా సహించలేని అంశమైంది.

ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ అదే సమయంలో నగరంలో పర్యటిస్తున్నారు. అందుకే విద్యార్థులపై ఆయనగారు కన్నెర్రజేశారు. ఆందోళన చేస్తున్న పిల్లలపై లాఠీలు విరిగాయి. బాష్పవాయుగో ళాలు ప్రయోగించారు. దుర్భాషలాడారు. మగపోలీసులే విద్యార్థినులను ఈడ్చిపారే శారు. యూనివర్సిటీ పరిస్థితులు సరిగా లేవని, ఇక్కడ ఆడపిల్లలకు భద్రత లేదని చెప్పడానికి వెళ్తే ‘అంతే...అలాగే ఉంటుంది. ఏం చేసుకుంటారో చేసుకోండ’న్నట్టు యూనివర్సిటీ అధికారులు వ్యవహరించారు. వైస్‌ చాన్సలర్‌ త్రిపాఠీ తీరు తిన్నగా ఉంటే ఇంత ఉద్రిక్తత ఏర్పడేది కాదు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొందరు దుండగులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేయడానికొచ్చిన విద్యార్థినికి... జరిగింది మర్చిపోవడం మంచిదని హితబోధ చేయడమే కాదు, సాయంత్రం 6 తర్వాత ఆడపిల్లలు బయటికి ఎందుకొస్తారని ఆయన ప్రశ్నించారు. ‘ఎంతైనా మగపిల్లలు మగపిల్లలే, మీరు వారిని అనుకరించే ప్రయత్నం ఎందుకు చేస్తార’ని కూడా అడిగారట.

బయటి సమాజంతో పోలిస్తే విశ్వవిద్యాలయం ఎన్నో రెట్లు ఉన్నత స్థితిలో ఉండాలి. అది కేవలం పిల్లలకు చదువు చెప్పే పాఠశాలనో, కళాశాలనో కాదు. అక్కడుండే విద్యార్థినీవిద్యార్థుల మేధకు పదునుబెట్టి, కొత్త ఆలోచనలకు స్ఫూర్తి నిచ్చి, వారి సృజనాత్మకతను వెలికితీయాల్సిన అద్భుత కేంద్రం. కానీ బెనారస్‌ హిందూ యూనివర్సిటీ స్థితిగతులు బయటి సమాజంతో పోలిస్తే మరింత అధ్వా న్నంగా ఉన్నాయని అక్కడ వరసబెట్టి జరగుతున్న ఉదంతాలను గమనిస్తే అర్ధమ వుతోంది. మహిళల విషయంలో ఏదైనా జరిగిందంటే బయటి సమాజంలో కనీసం నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛయినా ఉంటుంది. మహిళలు ఫలానావిధంగా ఉంటే ఇవి జరగబోవని ఏ నాయకుడైనా నోరు పారేసుకుంటే  అలాంటివారికి వెనువెంటనే చీవాట్లు పడతాయి. ‘నా ఉద్దేశం అది కాదం’టూ ఆ నాయకులు పలాయనం చిత్త గించక తప్పదు. కానీ బాధిత విద్యార్థినికి హితబోధ చేసిన వైస్‌ చాన్సలర్‌ తన తప్పు సరిదిద్దుకోలేదు సరిగదా ప్రశ్నించిన విద్యార్థినీవిద్యార్థుల సంగతి చూడమని పోలీసులకు అప్పగించారు. అంతేకాదు... ఆందోళనలో పాల్గొన్నారని ఆరోపిస్తూ వేయిమందికిపైగా విద్యార్థినీవిద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రాంగణంలోని విద్యార్థులను బయటికి రాకుండా చూసి వెలుపల జైలు బోర్డు తగి లిస్తే అక్కడ నెలకొన్న దుస్థితికి చక్కగా అతుకుతుంది. బీహెచ్‌యూ దేశంలోనే మూడో అతి పెద్ద యూనివర్సిటీ. ఎంతో చరిత్రగలది. అలాంటి యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారిని శాంతింపజేయాలన్న స్పృహే వైస్‌ చాన్సలర్‌కు లేకపోయింది. బీహెచ్‌యూలో ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలియనంత అయోమ యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అక్కడి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో వెల్లువెత్తిన నిరసన యాదృచ్ఛికంగా ఇప్పటికిప్పుడు పెల్లుబి కింది కాదు. అక్కడ లైంగిక వేధింపులు ఎన్నెళ్లుగానో రివాజుగా మారాయి. విద్యార్థి నుల ఫిర్యాదులను స్వీకరించి చర్య తీసుకోవాల్సిన విభాగం ఎక్కడుందో, అసలు ఉందో లేదో ఎవరికీ తెలియదు. చీకటి పడితే బయటికెళ్లొద్దని ఆడపిల్లలకు చెప్పడం తప్ప వారి హాస్టళ్ల వద్ద చక్కర్లు కొడుతూ అసభ్యంగా ప్రవర్తించే రౌడీ మూకలపై చర్యలుండవు. కనీసం సీసీ కెమెరాలనైనా ఏర్పాటు చేయమని కోరుతుంటే అలా ఉన్నంత మాత్రాన వేధింపులుండవన్న గ్యారెంటీ ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రాంగణంలో క్రమశిక్షణ  వ్యవహారాలు చూసే మహిళా ప్రొఫెసర్‌ ఒకరు విద్యార్థినుల సంగతలా ఉంచి, తమపైనే పోకిరీ మూకలు రెచ్చిపోతుంటాయని చెప్పా రంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు.

యూనివర్సిటీలు చాన్నాళ్లుగా దీనస్థితిలో ఉంటున్నాయి. బయటి సమా జంలాగే అక్కడకూడా ఆడ, మగ వివక్ష ఉంటున్నది. అక్కడ కులజాడ్యం రాజ్యమే లుతున్నది. ప్రశ్నించడాన్ని అసలే సహించని తత్వం పెరుగుతున్నది. మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో విశ్వవిద్యాలయ భావన అంకురించింది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ప్లేటో, అరిస్టాటిల్‌ నడిపిన విశ్వవిద్యాలయాలు, అయిదో శతాబ్దంనాటి మన నలందా విశ్వవిద్యాలయం ఆధునిక విశ్వవిద్యాలయా లకు మాతృకలు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించి, వారిని ఉన్న తులుగా తీర్చిదిద్ది వివిధ రంగాల్లో  సమాజ ఉన్నతికి తోడ్పడగల మెరికలను తయారు చేయడం వాటి మౌలిక ఉద్దేశం. కానీ ఇప్పుడంతా తలకిందులైంది.

పాల కపక్షాల దయతో వైస్‌చాన్సలర్‌ పదవులకు ఎగబాకడం, అక్కడ కర్రపెత్తనం చేస్తూ సమర్థులన్న పేరు తెచ్చుకోవాలని తహతహలాడటం ఎక్కువైంది. పాలకుల మన సెరిగి మసులుకుంటే చాలు... తమకు తిరుగుండదని భావించేవారు పెరిగారు. అందుకే విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పడిపోతున్నాయి. అవి సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులతో, కాంట్రాక్టు అధ్యాపకులతో, పనికిరాని పరిశోధనలతో కొరగాకుండా పోతున్నాయి. ఈ స్థితి మారాలి. ప్రధాని ప్రాతినిధ్యంవహించే నియోజకవర్గంలోని విశ్వవిద్యాలయమే ఇన్ని అరాచకాలతో, ఇంత అశాంతితో కొనసాగుతున్నదంటే సిగ్గుచేటు. బీహెచ్‌యూను ప్రక్షాళన చేసి దాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి అవ సరమైన చర్యలు తీసుకోవడం తక్షణావసరమని గుర్తించాలి.

>
మరిన్ని వార్తలు