ఆరుషి కేసు చెప్పే గుణపాఠం!

27 Nov, 2013 00:35 IST|Sakshi

అయిదున్నరేళ్లపాటు ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు చివరకు ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లకు యావజ్జీవ శిక్ష పడటంతో విషాదకరమైన ముగింపునకు చేరింది. దంపతులిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో పేరుపొందిన దంత వైద్యులు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు.  వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి అప్పటికి 13 ఏళ్ల బాలికైన ఆరుషి, హేమరాజ్ అనే నౌకరు హత్యకు గురయ్యారు. ఆ మర్నాడు ఉదయంనుంచి ఆ జంట హత్యల చుట్టూ రకరకాల కథనాలు అల్లుకున్నాయి. మొదట దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు, అటు తర్వాత దాన్ని స్వీకరించిన సీబీఐ...ఆ క్రమంలో తమకు వినబడిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు మీడియాకు లీక్ లివ్వడం, వాటి ఆధారంగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడటం సాగిపోయింది. దర్యాప్తు ఎలా చేయకూడదో తెలుసుకోవడానికి ఆరుషి హత్య కేసు బలమైన ఉదాహరణ.

యూపీ పోలీసులుగానీ, అటు తర్వాత దర్యాప్తును స్వీకరించిన సీబీఐగానీ దర్యాప్తును సక్రమంగా సాగించడంలో విఫలమయ్యారు. సాధారణ పోలీసులకు హత్య కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు గానీ అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐ వ్యవహరణ తీరు కూడా అలాగే ఉంది. ఇద్దరూ మీడియాకు లీకులివ్వడంలో చూపించిన ఉత్సాహంలో కాస్తయినా దర్యాప్తు విషయంలో ప్రదర్శించలేదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించనందున కేవలం ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులిద్దరినీ దోషులుగా నిర్ధారిస్తున్నట్టు సోమవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ ప్రకటించాల్సివచ్చింది.  వైద్య పరమైన నైపుణ్యం ఉన్నవారే చేయగలిగే రీతిలో ఆరుషి గొంతు నరం కోసివున్నదన్న ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దంపతులిద్దరూ సాక్ష్యాలను నాశనం చేసిన కేసులో కూడా దోషులని తేల్చారు.
 
   ఈ కేసును ఆద్యంతం పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతాయి. సాధారణంగా నేరం చేసినవారు అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఏదో ఒక మేరకు వదిలివెళ్తారంటారు. ఈ కేసులో అలాంటివన్నీ లేకుండాపోయాయి. అందుకు మొదటగా తప్పుబట్టాల్సింది యూపీ పోలీసులనే. జంట హత్యల విషయం వెల్లడైన వెంటనే వచ్చిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేదు. చుట్టుపక్కలవారంతా అక్కడ యధేచ్ఛగా తిరిగారు ఈ క్రమంలో నేరస్తుల వేలిముద్రలవంటి విలువైన సాక్ష్యాధారాలన్నీ చెదిరిపోయాయి. తొలుత కేవలం ఆరుషి మృతదేహం ఒక్కటే లభించింది. మరో మృతుడు హేమరాజ్ ఏమయ్యాడన్నది అప్పటికి తెలియలేదు. ఆ ఇంటిపైనే ఉన్న ఒక గదిలో అతను ఉంటున్నాడని తల్వార్ దంపతులు చెప్పినా ఆ గదికి దారితీసే మెట్ల వద్ద ఉన్న తలుపు తాళం వేసివున్నదని వారు ఊరుకున్నారు. ఆ తాళం బద్దలుకొట్టి వెళ్తే హేమరాజ్‌కు సంబంధించిన సాక్ష్యాలు దొరుకుతాయని వారి ఊహకు అందలేదు. చివరకు మర్నాడొచ్చి తాళం బద్దలుకొట్టారు. తీరా చూస్తే హేమరాజ్ శవం అక్కడపడివుంది.

ఇవన్నీ ఇలాపోగా తల్వార్ దంపతులపైనా, వారి కుమార్తెపైనా ఎన్నో కథలు ప్రచారంలోకొచ్చాయి. అందులో రాజేష్ తల్వార్ ప్రవర్తన మంచిది కాదని, ఆయనకు ఇంకెవరితోనో సంబంధాలున్నాయన్న కథనం ఒకటి. ఆరుషినీ, హేమరాజ్‌నూ ‘అభ్యంతరకరమైన’ పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక పోయారని, అందుకే ఆరుషిని ‘పరువు హత్య’చేశారని మరో కథనం. ఇద్దరినీ ‘అభ్యంతరకర పరిస్థితుల్లో’ చూసినప్పుడు వచ్చిన ఆవేశంలో హత్యకు పూనుకుంటే ‘వైద్యపరమైన నైపుణ్యం’ ఉన్నవారు మాత్రమే చేయగలిగినంత ఒడుపుగా ఆరుషిని తల్లిదండ్రులు ఎలా చంపగలిగారు? అసలు ఆ గదిలోనే ఉండాల్సిన హేమరాజ్ శవం...పైనున్న అతని గది ముందు ఎలా పడివున్నట్టు?
 
  మీడియాలో వచ్చిన కథనాల సంగతలా ఉంచి ఈ కేసు దర్యాప్తు ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. మొదట ముద్దాయిలుగా తేలినవారు ఆ తర్వాత కేసు నుంచి విముక్తులయ్యారు. మొదట దర్యాప్తుచేసిన సీబీఐ బృందానికీ, తర్వాత దర్యాప్తు చేసిన బృందానికీ లభించిన ఆధారాల్లో వైరుధ్యాలున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా తల్వార్ దంపతులపైనా, ఇతర నిందితులపైనా ఎన్నో పరీక్షలు జరిగాయి. ఇందులో పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, లైడిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షలున్నాయి. అన్నిటిలోనూ దంపతులిద్దరికీ నేరం గురించి తెలియదన్న నిర్ధారణ జరిగింది. ఇవే పరీక్షల్లో అనుమానితుడిగా తేలిన రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ తర్వాత కాలంలో సీబీఐ దర్యాప్తులో నిర్దోషిగా తేలితే, ఆ పరీక్షల్లో అనుమానితులు కాని తల్వార్ దంపతులు ముద్దాయిలయ్యారు.

చిత్రమేమంటే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించలేదు గనుక దీన్ని మూసేయడానికి అనుమతించమని కోర్టును సీబీఐ 2010 డిసెంబర్‌లో అభ్యర్థించినప్పుడు దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది తల్వార్ దంపతులే. 2010లో కేసు మూసివేత కోరిన సంస్థే మూడేళ్లు గడిచేసరికల్లా ‘మరణశిక్ష విధించదగిన’ నేరమని న్యాయస్థానం ముందు ఎలా వాదించగలిగిందో అనూహ్యం. మొత్తానికి దర్యాప్తు క్రమంలో పోలీసులు, సీబీఐ వ్యవహరించిన తీరువల్ల ఈ కేసులో నిర్ధారణ అయిన అంశాలకంటే అనుమానాలే ఎక్కువున్నాయి. కీలకమైన అంశాలు కొన్నిటిని కోర్టునుంచి సీబీఐ దాచిపెట్టిందని, అందువల్లే తల్వార్ దంపతులకు అన్యాయం జరిగిందని వారి న్యాయవాదులు అంటున్నారు. అప్పీల్‌కు వెళ్తే న్యాయం లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇది మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ కేసు నేర్పిన గుణపాఠంతోనైనా దర్యాప్తు సంస్థలు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలి.

మరిన్ని వార్తలు