ఆంటోనీ...ఆత్మావలోకనం!

2 Jul, 2014 01:21 IST|Sakshi

మన దేశంలో లౌకికవాదం భావన వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదు. దాని అసలు అర్ధం, అంతరార్ధం ఏమిటో అయోమయపడేంతగా ఇది ముదిరిపోయింది. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని మిగిలినచోట్ల అనుకున్నా... అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం మన దేశంలో స్థిరపడిపోయింది. ఈ గడ్డపై సెక్యులరిజానికి తానే సిసలైన వారసురాలినని కాంగ్రెస్ నమ్ముతుంది. తన తపనంతా దానికోసమేనని అందరినీ నమ్మమంటుంది. మైనారిటీ వర్గాల భద్రతకు భరోసా తమవల్ల మాత్రమే సాధ్యమని ఆ క్రమంలో చెబుతుంది. చివరకు అలాంటి భద్రత కల్పించడమే లౌకికవాదం అనుకునేంతగా దాన్ని ఊదరగొడుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ‘లౌకికవాదాన్ని కాపాడుకుందాం రండ’ని జాతీయస్థాయిలో పిలుపునిచ్చింది. కానీ ఏ పార్టీనుంచీ స్పందన లేదు సరిగదా...ప్రజలు సైతం దాన్ని తోసిపుచ్చారు. బీజేపీవైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ ఆచరిస్తున్న లౌకికవాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ విధానమైనా ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించలేకపోయారని చెప్పారు. మైనారిటీలతో పార్టీకి ఉన్నదనుకుంటున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంటోనీ స్థానం కీలకమైనది. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వెళ్లిపోయాక పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని ముఖ్యమైన అంశాల్లోనూ ఆయన సలహాలు తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి కారణాలేమిటని ఆరా తీసే బాధ్యతను తాజాగా ఆయనకు అప్పగించారు. కనుక ఆంటోనీ వ్యాఖ్యలకు ఎనలేని ప్రాముఖ్యమున్నది. అయితే, ఆంటోనీ వ్యాఖ్యలను కేరళ రాజకీయాల నేపథ్యంలో కూడా అర్ధంచేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో కేరళ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) ముఖ్యమైనవి.  కేరళ కాంగ్రెస్‌కు క్రైస్తవుల మద్దతు ఉంటే ఐయూఎంఎల్ కు ముస్లింలు అండగా ఉంటారు. ఈ రెండు పార్టీలూ తెస్తున్న ఒత్తిళ్ల కారణంగానే యూడీఎఫ్ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతున్నదని, దానివల్ల పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ఆంటోనీ ఆందోళన.

అయితే, అలా వ్యాఖ్యానించడంలో ఆంటోనీ ఉద్దేశాలు ఏమైనా మొత్తంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న లౌకికవాద విధానాలు ఆ వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి వచ్చాయి. దేశంలోని మిగిలిన వర్గాల ప్రజలు ఎన్నికలప్పుడు ఎలాంటి వైవిధ్యతతో ఓటేస్తారో, ఏ ఏ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారో, ఏ సమస్యలు ముఖ్యమైనవనుకుంటారో ముస్లింలు కూడా అలాగే అనుకుంటారు. ఆ పద్ధతిలోనే ఓటేస్తారు. అది దాదాపు అన్ని ఎన్నికల్లోనూ రుజువవుతున్న సత్యం. కాంగ్రెస్ అందరి మనసుల్లోనూ నాటిన ‘ముస్లిం ఓటరు’ వేరు. అతడు/ఆమె తమ స్థితిగతుల మెరుగుదలకు...తాము సాధించాల్సిన లక్ష్యాలకూ, తాము కైవసం చేసుకోవాల్సిన అవకాశాలకూ ప్రాధాన్యమివ్వరు. ఎంతసేపూ భద్రత గురించే ఆలోచిస్తారు. ఇలాంటి భావనను కల్పించడంలో కాంగ్రెస్‌కు ఒక సౌలభ్యం ఉన్నది. వారిని అభద్రతా భావనలో ఉంచుతూ, తమ పార్టీతోనే వారి భద్రత ముడిపడి ఉన్నదన్న అభిప్రాయం కలగజేస్తే చాలు... ఇతరత్రా అంశాలను వారు పట్టించుకోరని ఆ పార్టీ అనుకుంటుంది. ముస్లింల అభ్యున్నతే నిజంగా తన ధ్యేయమైతే వారు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగడానికి ఆసరా కల్పించడంలో తన పాలనా కాలంలో యూపీఏ సర్కారు ఎందుకు విఫలమైంది? 2004లో అధికారంలోకొచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ జీవో జారీచేశారు. ఆ జీవోపై న్యాయస్థానాలు స్టే ఇచ్చినప్పుడు చివరివరకూ పోరాడారు. పర్యవసానంగా కొన్ని మినహాయింపులతో ఆ రిజర్వేషన్లు కొనసాగించవచ్చునని 2010లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమ పార్టీ ముఖ్యమంత్రి ముస్లింల కోసం ఇంతగా తపన పడటాన్ని గమనించినా కాంగ్రెస్ పార్టీ దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ఏనాడూ కృషి చేయలేదు.  ముస్లింల స్థితిగతులపై జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పరిచినా అది ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ముస్లింలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆ కమిటీ తేల్చిచెప్పింది. వారికి చదువుల్లోనూ, కొలువుల్లోనూ కోటా అమలు చేయాలని సూచించింది. ఆ సిఫార్సులను అమలు చేయడానికైనా యూపీఏకు చేతులు రాలేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చిన తర్వాత మాత్రమే కాస్త కదలిక వచ్చింది. మరోపక్క ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రవంటి చోట్ల ముస్లిం యువకులకు పోలీసుల వేధింపులు, కేసులు తప్పలేదు.

సెక్యులరిజం పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న ప్రచారంతో మైనారిటీలకు ఏదో ఉపకారం జరిగిపోతున్నదని, వారు బాగుపడిపోతున్నారని మిగిలిన వర్గాల్లో అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే అది మైనారిటీలకు మేలు చేసే పరిణామం కాదు. తన చేతలు, మాటలు ఆచరణలో ఎలాంటి ఫలితాలనిస్తున్నాయో ఇప్పటికైనా గ్రహించుకుని తాను వల్లెవేస్తున్న లౌకికవాదాన్ని కాంగ్రెస్ పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆంటోనీ చెప్పిన మాటలు కేరళ స్థితిగతుల నేపథ్యంలోనివే కావొచ్చుగానీ... జాతీయస్థాయిలో ఆత్మావలోకనానికి వాటిని అవకాశంగా తీసుకోవాలి. దాని ఆధారంగా సరికొత్త దృక్ఫథాన్ని ఏర్పరుచుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు...మొత్తంగా దేశానికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మైనారిటీలకు!   

మరిన్ని వార్తలు