అమరావతికి అంకురార్పణ

22 Oct, 2015 00:36 IST|Sakshi
అమరావతికి అంకురార్పణ

అది తథాగతుడు నడయాడిన నేల. ధర్మ వర్తననూ, సామాజిక ఆచరణనూ ఆయనే స్వయంగా బోధిస్తున్న వేళ చెవులారా విని తరించిన గడ్డ. అనంతర కాలంలో అశోక చక్రవర్తి ఆదేశాలతో బుద్ధుడి దంతావశేషాన్ని నిక్షేపించుకుని వినువీధికెగసిన అతి పెద్ద స్థూపమూ ఇక్కడిదే. పొత్తిళ్ల దశనుంచి బౌద్ధం ఎదిగిన క్రమానికీ... దాని అత్యున్నత దశకూ...అందులో సాగిన అంతర్మథనానికీ... పర్యవసానంగా సంభవించిన అనేక మార్పులకూ...చివరకు దాని అవసాన దశకూ అమరావతి ప్రత్యక్ష సాక్షి. అమరావతి జైన మతం అభివృద్ధినీ చూసింది... అది అప్రాధాన్యంగా మారడాన్నీ గమనించింది.
 
 శైవం వీర శైవమై తాండవమాడటాన్నీ తిలకించింది. బహుశా తనను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న కృష్ణమ్మలో కొత్త నీరొచ్చి పాత నీరును సాగనంపుతున్న తీరులో ఈ ఘట్టాలన్నిటికీ అది సాదృశ్యాన్ని వెతుక్కుని ఉంటుంది. ఇంతటి మహత్తరమైన, ఉత్తేజపూరితమైన సన్నివేశాలను పొదువుకొని పునీతమైంది గనుకనే అది అమరావతి అయి ఉంటుంది. అమరావతి అంటే మృత్యువు దరి చేరలేని ప్రదేశం. సహస్రాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్రుల జీవనంతో అనేక శతాబ్దాలపాటు పెనవేసుకుపోయిన ప్రదేశం అమరావతి.
 
 ఇంతటి ఘన చరిత్ర గల ప్రాంతాన్ని తనలో కలుపుకొని అదే పేరిట ఆవిర్భవించబోతున్న నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి విజయ దశమి పర్వదినాన గురువారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రాజధాని ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఆయన ఏ అర్ధంలో ప్రజా రాజధాని అన్నారోగానీ...మన దగ్గరున్న అత్యున్నత శ్రేణి ఇంజనీరింగ్ నిపుణులను విస్మరించి సింగపూర్ ప్రభుత్వ సౌజన్యంతో, వారి ఆలోచనాధోరణులతో రూపొందించిన బ్లూప్రింట్‌లో అందుకు సంబంధించిన అంశాలు ఛాయామాత్రంగానైనా లేవు.
 
 ఇక రాజధాని నగరం కోసం భూములు తీసుకునే ప్రక్రియ అంతకు చాలా ముందే మొదలై...రైతులు, కౌలు రైతులు, రైతుకూలీల జీవితాల్లో ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో అందరూ చూశారు. పంట భూముల్లో ఉన్నట్టుండి మంటలంటుకున్నాయి. సెక్షన్ 144, సెక్షన్ 30లతో భయానక వాతావరణం సృష్టించారు. సామాజిక ప్రభావ మదింపు (ఎస్‌ఐఏ) అనేదే లేదు. స్వచ్ఛందంగా ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా లాక్కొంటామన్న బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. విభజన జరిగాక ఏర్పడ్డ నవ్యాంధ్ర ప్రదేశ్‌కు రాజధానిగా ఉండగల సౌకర్యవంతమైన నగరమంటూ లేకపోవడం వాస్తవం. దీన్నేవరూ కాదనరు. కాకపోతే ముక్కారు పంటలు పండే చోట...కూరగాయల సాగులో దేశానికే తలమానికమైనచోట... పూల పరిమళాలు గుప్పున పలకరించేచోట దీనికి పూనుకోవడమెందుకని అందరూ అడిగారు. మీరనుకున్నచోటే రాజధాని నిర్మించండి...అందుకు మెట్ట ప్రాంతముంది, ఎకరాలకొద్దీ ప్రభుత్వ  భూములున్నాయన్నారు.
 
 ప్రపంచ ప్రఖ్యాత రాజధానులేవీ 2,000 ఎకరాలకు మించి లేవని గుర్తు చేశారు. సమాచార సాంకేతికత అపారంగా విస్తరించిన వర్తమాన పరిస్థితుల్లో ఆ మాత్రం కూడా అవసరం ఉండదని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ముఖ్యమైన పరిపాలనా కార్యాలయాలు ఉండే సీడ్ క్యాపిటల్‌ను ఒక పరిమిత ప్రాంతంలో నిర్మిస్తే దానికి అనుబంధంగా క్రమేపీ అన్నీ విస్తరిస్తాయని... తమ భూములకు భవిష్యత్తులో మంచి ధర పలికితే వాటిని అమ్ముకోవాలా, లేదో రైతులే నిర్ణయించుకుంటారని అన్నారు.
 
 అభివృద్ధిని కేంద్రీకరించడం పర్యవసానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో జిల్లాలు వెనకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయాయని గణాంకాలతో సహా వివరించారు. కనుక కీలకమైనవాటన్నిటినీ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. ఇలా చెప్పినవారిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే కాదు...మేథా పాట్కర్, ఈఏఎస్ శర్మ, జయప్రకాశ్ నారాయణ్ వంటి మేథావులు, పౌర సమాజ కార్యకర్తలు ఉన్నారు. బాబు ప్రభుత్వం వీటన్నిటినీ పెడచెవిన పెట్టింది. అసలు ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడానికే ఇష్టపడలేదు.
 
 ఒకపక్క రాజధాని నగరానికి అమరావతిగా నామకరణం చేసి... దాని స్ఫూర్తినీ, సారాన్ని విస్మరించి ఇంత అప్రజాస్వామికంగా, ఇంత ఏకపక్షంగా వ్యవహరించడం, దాన్నొక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా చూడటం, రైతుల భూముల్ని వ్యాపారులకు కట్టబెట్టే పనికి పూనుకోవడం బాబుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. ఒక కొత్త రాజధానిని నిర్మించే అవకాశం వచ్చినప్పుడు రాశిలోగాక వాసిలో...స్థాయిలోగాక సారంలో అది సమున్నతంగా ఉండేలా చూడటం...దాన్ని సాధారణ పౌరులకు సైతం నివాసయోగ్యంగా చేయడం పాలకులుగా ఉండేవారి బాధ్యత.
 
 ఆ బాధ్యతను విస్మరిస్తే...రాష్ట్రం నలుమూలలా ఉండే పౌరులందరూ తమ జీవిక కోసం రాజధాని నగరానికి వలస రాక తప్పని స్థితి కల్పిస్తే...ఎలాంటి నగరానికైనా అనుబంధంగా ఏర్పడేవి మురికి వాడలే! అప్పుడు అక్కడి రోడ్లు నరకానికి నకళ్లవుతాయి. చిన్న చిన్న సదుపాయాలు కూడా అందని ద్రాక్షలవుతాయి. పౌరులంతా నానా యాతనలూ పడతారు. ఇందుకు బెంగళూరు, ముంబై నగరాలు మాత్రమే కాదు... స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకున్న చండీగఢ్, గాంధీనగర్ వంటివి కూడా ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క రాయ్‌పూర్ మాత్రం ఇందుకు మినహాయింపు అది పూర్తిగా స్వదేశీ నమూనా. దురదృష్టవశాత్తూ బాబుకు రాయ్‌పూర్ కాక సింగపూర్ నగరం ఆదర్శంగా మారింది. ఇక ప్రపంచ దేశాల మాటేమోగానీ... నదీ తీరాల్లో నగర నిర్మాణాలున్నచోట్ల ఆ నదులు కాలుష్య కాసారాలవుతుండటం ఇక్కడి వాస్తవం. గంగా, యమున నదులకే ఇది తప్ప లేదు. అమరావతి నిర్మాణంలో పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు కనబడదు.
 
 ఒకపక్క కొత్త రాష్ట్రానికి అన్నీ సమస్యేలేనని చెబుతూనే, దేనికీ డబ్బుల్లేవంటూనే రూ. 400 కోట్ల ప్రజాధనంతో అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడంవల్ల కేంద్రానికి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి?  ప్రత్యేక హోదా హామీ అమలుపై కేంద్రీకరించి దాన్ని సాకారం చేసుకోవాల్సిన తరుణంలో ఈ హడావుడేమిటి? ఈ ఆర్భాటాలేమిటి?  కనీసం ఈ క్షణంనుంచి అయినా పాలకులకు వివేచన కలగాలని... తాము చేయాల్సిందేమిటో, చేస్తున్నదేమిటో గ్రహింపునకు రావాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు