అమెరికా వింత వైఖరి

30 Jun, 2018 02:56 IST|Sakshi
నిక్కీ హేలీ

ఏ దేశాధినేత అయినా, వారి దూత అయినా తాను అడుగుపెట్టిన దేశం గురించి, అక్కడి నేతల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. ఆ దేశాన్ని ప్రసన్నం చేసుకుని వాణిజ్యం పెంపొందించుకుంటే స్వదేశంలో ఆర్థికస్థితి మెరుగుపడటంతోపాటు ఉత్పత్తి ఊపందుకుని, అందరికీ ఉద్యోగకల్పన సాధ్యమవుతుందని భావిస్తారు. మన దేశంలో రెండురోజులు పర్యటించిన అమెరికా దూత, ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ ఇందుకు భిన్నం. మన దగ్గర పాకిస్తాన్‌ను తూర్పారబడితే, అది ఉగ్ర దేశంగా మారుతున్నదని ఆరోపిస్తే చాలు...భారత్‌కు అది వీనులవిందు అవుతుందని, ఆ తర్వాత తాము కోరుకున్న రీతిలో ఆ దేశం వ్యవహరిస్తుందని ఆమెకు దృఢ విశ్వాసం ఉన్నట్టుంది. అందుకే పాకిస్తాన్‌ ఉగ్ర స్వర్గధామంగా మారిందని, ‘ఇప్పటి కైనా’ అది తన వైఖరి మార్చుకుంటుందని ఆశిస్తున్నామని నిక్కీ హేలీ చెప్పారు. పాకిస్తాన్‌– ఉగ్రవాదం విషయంలో ‘ఇప్పటికైనా...’ అనే మాట బిల్‌ క్లింటన్‌ కాలం నుంచి అమెరికా వల్లె వేస్తూనే ఉంది. దశాబ్దాలుగా అది పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖలు గీస్తూనే ఉంది. కానీ క్రియకొచ్చేసరికి ఆ దేశానికి ఎప్పుడూ ఆర్థిక సాయం ఆగదు...ఆయుధాల అమ్మకం ఆగదు. 

ఇప్పుడు నిక్కీ హేలీ మరోసారి పాకిస్తాన్‌ గురించి మాట్లాడటానికి కారణం లేకపోలేదు. ఇరాన్‌నుంచి మనం చమురు కొనరాదని ఆదేశించడమే ఆమె పర్యటన వెనకున్న ప్రధాన ఉద్దేశం. ఇరాన్‌తో సంబంధాలపై భారత్‌ పునరాలోచన చేసుకోవాలని కూడా ఆమె సలహా ఇచ్చారు. అన్ని దేశాలూ నవంబర్‌ 4 కల్లా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఆశిస్తోంది!  ఒక దేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను వదులుకోవాలని లేదా ఆ దేశం నుంచి ఫలానా సరుకులు కొనవద్దని హుకుం జారీ చేయడం మొరటుతనానికి పరాకాష్ట. అది అమెరికాకు పుష్కలంగా ఉన్నదని ఈ ప్రకటన చెబుతోంది. తమ సరిహద్దుల్లో ఉన్న దేశంతో దానికి సమస్యలుంటే, అలాంటి దేశానికి మనం ఆయుధాలు అమ్ముతుంటే వద్దని కోరడంలో తప్పేం లేదు. కానీ ఇరాన్‌ అమెరికాకు సరిహద్దు దేశం కాదు. పశ్చిమాసియాలో ప్రాబల్యం కోసం ఇరాన్‌తో సౌదీ అరేబియా పోటీ పడుతోంది. ఇరాన్‌ తిరుగులేని శక్తిగా ఎదిగితే తనకు ముప్పు కలుగు తుందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. సౌదీ, ఇజ్రాయెల్‌ తనకు అత్యంత సన్నిహిత దేశాలు గనుక వాటి ప్రయోజనాలు కాపాడటం కోసం ఇరాన్‌పై అమెరికా కత్తిగట్టింది.

ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌తో మరో అయిదు దేశాలను కలుపుకొని కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని విపక్షంలో ఉండగా రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారంలోకొస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టు గానే ఆ ఒప్పందం నుంచి వైదొలిగారు. అప్పటినుంచీ ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని, అవసర  మైతే దానితో యుద్ధానికి దిగాలని అమెరికా కత్తులు నూరుతోంది. అణు ఒప్పందంలో ఇతర భాగస్వామ్య దేశాలైన రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్‌ యూనియన్‌లు అమెరికా తీరును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ఒప్పందాన్ని గౌరవించి ఇరాన్‌తో కలిసి నడుస్తామని ప్రకటించాయి. అయినా అమెరికా ధోరణి మారలేదు. ఇరాన్‌ను దారికితెచ్చేందుకు తాను ఆర్థిక ఆంక్షలు విధించ డంతోపాటు మిగిలిన దేశాలు కూడా తనను అనుసరించాలని భావిస్తోంది. కానీ మన అవసరాలు, ప్రయోజనాలు పూర్తిగా వేరు. మన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత స్థానం ఇరాన్‌ది. మనం దిగుమతి చేసుకునే చమురులో పదిన్నర శాతం ఇరాన్‌ సరఫరా చేస్తుంది.

దీన్ని 25 శాతానికి పెంచుతామని మొన్న ఫిబ్రవరిలో ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ భారత్‌ పర్యటించినప్పుడు మన దేశం హామీ ఇచ్చింది. ఆ తర్వాత మే నెలలో ట్రంప్‌ ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇరాన్‌తో అమెరికా తనంత తాను గిల్లికజ్జాలు తెచ్చుకోవటమేగాక...అందరూ గుడ్డిగా తనను అనుసరించాలని కోరడం తెంపరితనం కాకపోతే మరేమిటి? మనకు సరసమైన ధరకు చమురు అందిస్తున్నప్పుడు, ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీర్చేందుకు వెసులుబాటు కల్పించినప్పుడు మనం ఇరాన్‌తో వ్యాపారబంధాన్ని ఎందుకు తెగతెంపులు చేసుకోవాలి? అందుకు బదులుగా ఆ దేశం ఇస్తున్న వెసులుబాట్లనే మీరూ కల్పించాలని ఇతర దేశాలపై ఒత్తిళ్లు తీసుకురావాలి. అమెరికా ఈ విషయంలో చూపుతున్న ప్రత్యామ్నాయం వింతగా ఉంది. ఇరాన్‌ నుంచి కొనే చమురును ఇకపై తనవద్ద కొనవచ్చునని ప్రతిపాదిస్తోంది. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే అమలు చేస్తాం తప్ప వేరే దేశాలు విధించే ఆంక్షలను అనుసరించబోమని గత నెలలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు నిక్కీ హేలీ ప్రత్యేకించి మన దేశం వచ్చారు. 

ఇరాన్‌ విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్ల మన దేశం మాత్రమే కాదు... మొత్తంగా ప్రపంచమే సంక్షోభంలో పడే స్థితి ఏర్పడింది. అసలే చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ దేశాలకు ఇరాన్‌ రోజుకు 24 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షల పర్యవసానంగా ఇందులో సగం ఎగుమతులు నిలిచిపోయినా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. ఇది చాలదన్నట్టు ట్రంప్‌ విదేశీ సరుకులపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ భారీ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. వీసాల జారీపై రకరకాల ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. అక్కడ విదేశీయులకు ఉపాధి దొరక్కుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం స్వతంత్రంగా ఆలోచించి, స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి. అమెరికా అయినా, మరొకరైనా మనల్ని ప్రభావితం చేయలే రని స్పష్టం చేయాలి. ఇరాన్‌పై అమెరికా సాగించదల్చుకున్న అధర్మ పోరాటాన్ని వ్యతిరేకించాలి. 

మరిన్ని వార్తలు