అమెరికా ఉదారత!

6 Jan, 2015 00:17 IST|Sakshi
అమెరికా ఉదారత!

సంపాదకీయం

 పాకిస్థాన్-అమెరికాల మధ్య సంబంధాలు విలక్షణమైనవనీ, వాస్తవ పరిస్థితుల ప్రభావం సోకనంతటి బలీయమైనవనీ మరోసారి రుజువైంది. ఉగ్రవాద సంస్థలు అల్ కాయిదా, తాలిబన్, లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం)లను కట్టడి చేయడంలో పాక్ పాత్ర అమోఘమైనదని కీర్తిస్తూ ఆ దేశానికి 150 కోట్ల డాలర్ల సాయాన్ని ఇవ్వబోతున్నట్టు అమెరికా ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్, భారత్‌లలో అస్థిరత్వాన్ని సృష్టించడానికీ... ప్రత్యేకించి భారత్‌పై ఆధిక్యత సాధించడానికీ కొన్ని ఉగ్రవాద సంస్థలను పాక్ ప్రోత్సహిస్తున్నదని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించి నిండా రెండు నెలలు కాలేదు. ఎల్‌ఈటీ, జేఈఎం సంస్థల అధినేతలు పాకిస్థాన్‌లో ర్యాలీలు నిర్వహించి భారత్‌ను బెదిరిస్తూ మాట్లాడి ఇంకా ఆర్నెల్లయినా కాలేదు. ముంబై ఉగ్రవాద దాడికి సారథ్యం వహించిన లఖ్వీకి కేవలం పాక్ ప్రభుత్వ చేతగానితనంవల్ల, నిర్లక్ష్యంవల్ల బెయిల్ లభించి ఇంకా వారం రోజులైనా గడవలేదు.  భారత్ తీవ్ర నిరసనల తర్వాత మరో కేసులో అతన్ని అదుపులోకి తీసుకుని ఉండొచ్చుగానీ అదెంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి.  అయినా అమెరికా మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ ప్రదర్శిస్తున్న ‘శక్తిసామర్థ్యాలను’ చూసి మూర్ఛపోయి సాయాన్ని అందించడానికి సిద్ధపడింది. ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకొనాలో, తన ఖజానాలో పడి మూలుగుతున్న కోట్లాది డాలర్లను ఎవరెవరికి పంచిపెట్టుకోవాలో నిర్ణయిం చుకునే హక్కు అమెరికాకు ఉంటుంది. కానీ ఆ డాలర్లు ఎలాంటి ఉద్రిక్తతలకు పరోక్షంగా కారణమవుతున్నాయో... ఎంత మందికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఆలోచించవలసిన కనీస బాధ్యత ఆ దేశానికి ఉంది. ఉగ్రవాదాన్ని అంతమొందించే పోరాటానికి తనకు తానే నాయకత్వ పాత్రను కట్టబెట్టుకున్న దేశం ఇలా కబోదిలా వ్యవహరించడం, వాస్తవాలను చూడ నిరాకరించడం సరికాదు.

 పాకిస్థాన్ విషయంలో ఇలా ఉదారంగా ఉండటం అమెరికాకు ఇది మొదటిసారి కాదు. రెండేళ్లక్రితం కూడా అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్‌కు అందించాల్సిన ఆర్థిక సాయంపై చడీ చప్పుడూ లేకుండా షరతులను ఎత్తేసింది. ‘అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలరీత్యా’ ఇది తప్పనిసరంటూ ఆనాటి విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ సమర్థించుకున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ తీసుకుంటున్న చర్యలు చాలినంతగా లేకపోయినా, అవి సక్రమంగా ఉన్నాయని తాము భావించకపోయినా అక్కడి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఆర్థిక సాయం కొనసాగించవలసి వస్తున్నదని ఆనాడు అమెరికా చెప్పుకుంది. అయితే, సాయం దారి సాయానిదీ...తన తోవ తనదీ అన్నట్టుగానే పాక్ మొదటినుంచీ ఉంటున్నది. అది సైనిక సాయమైనా, ఆర్థిక సాయమైనా చివరకు చేరేది ఉగ్రవాదుల స్థావరాలకేనని ప్రతిసారీ రుజువవుతున్నది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలో స్థావరాన్ని ఏర్పర్చుకున్న అల్ కాయిదా నేత బిన్ లాడెన్ ఆచూకీని కనుక్కొని మట్టుబెట్టింది అమెరికాయే. పాక్ సైన్యం అండదండలు లేకుండా లాడెన్ అలాంటిచోట స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. ఆ ఉదంతంలో లాడెన్ ఆచూకీ ఇచ్చిన డాక్టర్‌పై దేశ ద్రోహ నేరాన్ని మోపి అతన్ని ఖైదు చేసిన పాక్ ఆ డాక్టర్ ప్రాణాలకు ముప్పున్నదని అమెరికా అభ్యర్థిస్తున్నా విడుదల చేయడంలేదు. పాక్ సైన్యం చెప్పుచేతల్లో పనిచేసే ఐఎస్‌ఐకీ, ఉగ్రవాద సంస్థ హక్కానీకి మధ్య ఉన్న సంబంధాల గురించి అమెరికా సైనిక ఉన్నతాధికారులు పలుమార్లు పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా దిక్కూ మొక్కూ లేదు. భారత్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో పాక్ సైన్యం ఉగ్రవాదుల ద్వారా చేయిస్తున్న ఆగడాలను పెంటగాన్ నివేదిక ఈమధ్యే ఎండగట్టింది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు అఫ్ఘాన్‌లోని హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు జరిపిన భారీ దాడిని కూడా ఆ నివేదిక ప్రత్యేకించి ప్రస్తావించింది.

 పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కృషిచేస్తున్నదని ఇప్పుడు అదే నోటితో అమెరికా ఎలా అనగలిగిందో అనూహ్యం. ఒకపక్క వచ్చే రిపబ్లిక్ దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతకు ముందు ఈ నెల 11న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగబోయే ఒక సదస్సులో జాన్ కెర్రీ పాల్గొనబోతున్నారు. అయినా పాకిస్థాన్‌కు ఇవ్వదల్చుకున్న కితాబుపై, ఆర్థిక సాయంపై అమెరికా ఎలాంటి మొహమాటాన్నీ ప్రదర్శించలేకపోయింది. వాస్తవానికి పాకిస్థాన్‌కిచ్చే సాయంపై అమెరికా తనకు తానే కొన్ని నిబంధనలు విధించుకుంది. 2009నాటి చట్టం ప్రకారం ‘పౌరసాయం’ పొందడానికి పాకిస్థాన్ నెరవేర్చవలసిన కర్తవ్యాలున్నాయి. ఉగ్రవాద ముఠాలకు మద్దతునీయకపోవడం,  తమ భూభాగంనుంచి మరే ఇతర దేశంపైన అయినా దాడిచేయడానికి ప్రయత్నించే అలాంటి ముఠాలను నిరోధించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను, అక్రమ నగదు లావాదేవీలను నిరోధించే చట్టాలను పటిష్టంచేయడం వగైరా చర్యలు తీసుకోవాలి. వీటన్నిటా పాకిస్థాన్ విఫలమైందని సాక్షాత్తూ పెంటగాన్ నివేదికే చెబుతున్నది. అయినా సాయం అందించడానికి నిర్ణయించుకుని, అందుకోసం పాకిస్థాన్‌కు లేనిపోని భుజకీర్తులను తగిలిస్తున్న అమెరికా తీరు వంచన తప్ప మరేమీ కాదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను ఇకనైనా ఆ దేశం మానుకోవాలి. ఒకపక్క అఫ్ఘాని స్థాన్ నుంచి తన సైన్యాన్ని క్రమేపీ తగ్గించుకుంటున్న అమెరికా...వచ్చే ఏడాదికల్లా అది పూర్తవుతుందని చెబుతున్నది. తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పాక్‌పై అఫ్ఘాన్ ఆరోపిస్తున్నది. మరోపక్క ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల బెడద విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో తన ప్రతి అడుగూ, చర్యా ఉగ్రవాదాన్ని అంతమొం దించడానికి ఉపయోగపడాలి తప్ప వాటికి దోహదపడేందుకు కాదని అమెరికా గుర్తించాలి.

మరిన్ని వార్తలు