అమెరికా ‘అస్పష్ట’ వ్యూహం!

21 Dec, 2017 01:01 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తుండగా కీలకమైన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన నివేదికను డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళ వారం విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అమెరికా వ్యూహం ఎలా ఉండబోతున్నదో, ప్రభుత్వ ప్రాధమ్యాలేమిటో అమెరికన్‌ కాంగ్రెస్‌కు వివరించడంతోపాటు... వివిధ సమస్యలపై, సవాళ్లపై అమెరికా వైఖరేమిటో ప్రపంచ దేశా లకు తెలియజెప్పడం కూడా ఈ నివేదిక ఉద్దేశం. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, అధికారానికొచ్చాక ట్రంప్‌ చెబుతున్నవీ, చేస్తున్నవీ సహజంగానే ఇందులోనూ ఉన్నాయి. ‘అమెరికా ఫస్ట్‌’తో మొదలుపెట్టి ఉత్తర కొరియా వరకూ ట్రంప్‌ ఆలో చనల్నే ఈ నివేదిక కూడా ప్రతిబింబించింది. అక్కడక్కడ ఆయనకు భిన్నమైన ప్రతిపాదనలు కూడా చేసింది. కొన్ని అంశాల్లో పాత విధానాలే కొనసాగుతాయన్న సూచనలున్నాయి. తమకు రష్యా, చైనాలే ప్రధాన పోటీదారులని నివేదిక చెబు తోంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని ఓడించడానికీ... ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరచడానికీ వివిధ దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యతనిస్తామని కూడా తెలిపింది. మన దేశంతోసహా అన్ని దేశాలూ వ్యూహాలను రూపొందించు కుంటాయి. అయితే అమెరికా మాదిరి అవి బాహాటంగా వెల్లడించవు. 

భారత్‌ను ఈ నివేదిక ‘ప్రధానమైన ప్రపంచ శక్తి’గా గుర్తించింది. ఇండో– పసిఫిక్‌ ప్రాంత భద్రతకు సంబంధించి దాని నాయకత్వాన్ని సమర్ధిస్తామని, ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. గతంలో విడుదలైన జాతీయ భద్రతా వ్యూహం నివేదికలతో పోలిస్తే భారత్‌పై అమెరికా అంచనాలు పెరిగినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే 2002 నాటి నివేదిక మన దేశాన్ని ‘21వ శతాబ్దిలోని శక్తివంతమైన ప్రజాస్వామ్య శక్తి’గా అభివర్ణించింది. 2006 నివేదిక భారత్‌ను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న వృద్ధి చోదక శక్తుల్లో ఒకటిగా పేర్కొంది. 2010నాటి జాతీయ భద్రతా వ్యూహం నివేదిక మన దేశాన్ని  ‘21వ శతాబ్ది ప్రభావిత కేంద్రాల్లో ఒకటి’గా భావించింది. 2015 నివేదిక భారత్‌ ‘ప్రాంతీయ భద్రత ప్రదాత’ అని అభివర్ణించింది. కాబట్టి తాజా నివేదిక మన దేశానికి ‘పదోన్నతి’నిచ్చినట్టే భావించాలి.  

మన విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా నివేదికను స్వాగతించారు. బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక దేశాలుగా భారత్, అమెరికాలు రెండింటికీ ఉమ్మడి లక్ష్యాలున్నాయన్నారు. అయితే మనకు తాజా నివేదిక ఇచ్చిన నాయకత్వ స్థానం ‘ఇండో–పసిఫిక్‌ ప్రాంతం’ వరకే అని గుర్తుంచుకోవాలి. చాన్నాళ్లుగా వాడుకలో ఉన్న ఆసియా–పసిఫిక్‌ పదబంధానికి బదులు ఈమధ్య కాలంలో ‘ఇండో–పసిఫిక్‌’ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ట్రంప్‌ తెలిసీ తెలియక మాట్లాడే అనేక మాటల్లో ఇదొకటని మొదట్లో చాలామంది అనుకున్నా ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఆయన ఉపయోగిస్తున్నారని త్వరలోనే అవగాహన చేసుకున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య విస్తృత సహకారాన్ని నెలకొల్పి ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే దీని లక్ష్యం. 

చైనాతో మనకు సరిహద్దుతోసహా వివిధ అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న సంగతి నిజమే. అయితే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవ హరిస్తే, చర్చించుకుంటే అలాంటి సమస్యలు పరిష్కారమవుతాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాకు మలేసియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం లతో వివాదాలున్నాయి. ఈ వివాదాల్లో అమెరికా సహజంగానే  చైనా వ్యతిరేక వైఖరినే తీసుకుంటున్నది. అలాగే తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనా– జపాన్‌ల మధ్య ఏర్పడ్డ వివాదంలో జపాన్‌ను సమర్ధిస్తున్నది. ఇప్పుడు ఇండో– పసిఫిక్‌ ప్రాంత వివాదాల్లో భారత్‌ పాత్ర ఎలాంటి పాత్ర పోషించాలని అమెరికా అనుకుంటున్నదో తెలియదు. అసలు తమ విషయంలోనైనా ట్రంప్‌కు స్పష్టత వచ్చిందో లేదో అనుమానమే. ఎందుకంటే ఆయన రోజువారీ ట్వీట్లలోనే ఎన్నో వైరుధ్యాలు కనబడుతుంటాయి.
 
‘ఇండో–పసిఫిక్‌ ప్రాంతం’లో మనకిస్తున్న ప్రాధాన్యతను నిరాకరించాల్సిన అవసరం లేదనుకున్నా పశ్చిమాసియా విషయంలో మనల్ని ఎందుకు పరి గణనలోకి తీసుకోలేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజానికి పశ్చిమాసియాతో, ప్రత్యే కించి ఇరాన్‌తో మన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటే అది మన ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం కలిగిస్తుంది. అమెరికా ప్రాపకంతో ఇరాన్‌పై గత కొన్ని దశాబ్దాలుగా అమలైన ఆంక్షలు మనల్ని తీవ్రంగా నష్టపరిచాయి. మన దేశాన్ని బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా అమెరికా గుర్తిస్తున్నది కనుక ఇరాన్‌తో తనకున్న విభేదాల విషయంలోనూ, పశ్చిమాసియా దేశాల మధ్య సామరస్యతను సాధించడంలోనూ మన సాయం అవసరమని ఎందుకనుకోలేదో అనూహ్యం. 

అఫ్ఘానిస్తాన్‌లో భారత్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉంటుందని లోగడ చెప్పిన అమెరికా ఈ నివేదికలో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం అణు యుద్ధానికి దారి తీయొచ్చునని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం విషయంలోనూ, అణ్వాయుధాల పరిరక్షణ విషయంలోనూ పాకిస్తాన్‌ బాధ్యతాయుతంగా మెలగాలన్న హితబోధ మాత్రం ఉంది. ఇక ‘అమెరికా ఫస్ట్‌’ పేరిట వీసాల జారీ మొదలుకొని ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు, ఆంక్షలు మన ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఒకపక్క ఇలాంటి చర్యలు తీసుకుంటూనే మనను ‘ప్రధానమైన ప్రపంచ శక్తి’గా కీర్తించడం వల్ల ఒరిగేదేమిటి?  పర్యావరణానికి తాజా నివేదికలో చోటు దొరకలేదు. వాతావరణ మార్పులు జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని 2015 నాటి నివేదిక చెప్పింది. పైగా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ భూతాపం వల్ల సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని 128 సైనిక స్థావరాలకు ముప్పు వాటిల్లిందని చెప్పింది. మొత్తానికి అమెరికా జాతీయ భద్రతా నివేదిక అనేక ప్రశ్నలు మిగిల్చింది. కొన్ని విషయాల్లో ట్రంప్‌తో ఆ దేశ పాలనా వ్యవస్థ ఏకీభవించడం లేదన్న సంకేతాలిచ్చింది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా