విభజన హామీలపై మళ్లీ ‘తెల్ల’మొహం

26 Dec, 2018 10:57 IST|Sakshi

శ్వేతపత్రం–1: రాష్ట్ర పునర్విభజన చట్టంపై విశ్లేషణ

చంద్రబాబునాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ప్రత్యేక ప్యాకేజీనుంచి మొదలుపెట్టి పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్భాలు పలకడం వరకు అడుగడుగునా తన అసమర్థతను నిరూపించుకుంటూ, కేంద్రానికి దాసోహమంటూ సాగిలబడినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను అణుమాత్రం కూడా నెరవేర్చలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు శ్వేతపత్రం పేరిట రివర్స్‌ గేమ్‌ ఆడటం మొదలుపెట్టేసింది. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా విభజన హామీలపై ఒత్తిడి తేకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయడం లేదు. దురదృష్టమేమిటంటే ఈ శ్వేతపత్రాల బాగోతాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం నమ్ముతున్నట్లు లేదు.

కేంద్రంలో బీజేపీతో పొత్తు కలిపి నాలుగున్నరేళ్లు అధికారం అనుభవించి, సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగడమే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీని ప్రభుత్వంలో చేర్చుకుని పబ్బం గడిపిన చంద్రబాబునాయుడు గత ఏడునెలలుగా చేస్తున్న డ్రామా పరాకాష్టకు చేరుకుంది. అది శ్వేతపత్రాల డ్రామా. మొదటి శ్వేత పత్రంలో.. విభజన చట్టంలోని హామీల అమలు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టంపై శ్వేతపత్రం పేరుతో విడుదల చేసిన అంశాలను పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వ అసమర్థతవల్లే ఆ పనులేమీ జరగలేదని అర్థమవుతుంది. ప్రత్యేక హోదా అవసరమే లేదని వాదించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది. అలాగే పోలవరం నిర్మించే బాధ్యత కేంద్ర పరిధిలో ఉండగా తామే కడతామని పట్టుబట్టి మరీ తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడేమో పోలవరానికి కేంద్రం నిధులే ఇవ్వలేదని వీధులకెక్కుతోంది. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంలోని అసలు వాస్తవాలను పరిశీలిద్దాం.

విభజన హామీలు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమేనని అధికార యంత్రాంగం బాహాటంగానే వ్యాఖ్యానిస్తోంది. ఎందుకంటే కేంద్రంలో భాగస్వామిగా నాలుగేళ్లకు పైగా ఉన్నప్పటికీ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయకుండా వంగి వంగి దండాలు పెట్టడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన హామీల అమలు కోసం అడిగిన పాపాన పోలేదు. అంతే కాకుండా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల్లో అత్యుత్తమ ప్రధాన మంత్రి ఒక్క మోదీ మాత్రమేనని స్వయంగా చంద్రబాబు కీర్తించిన విషయంకూడా తెలిసిందే. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా విభజన హామీలపై ఒత్తిడి తేకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో రాజకీయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయడం లేదు.

ప్రత్యేకహోదాను అడ్డుకున్నదెవరు?
ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబునాయుడే కారణమని రాష్ట్ర ప్రజానీకంతో పాటు దేశం అంతటికీ తెలుసు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పకముందే చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.. ప్రత్యేక హోదా కన్నా మేలైన ప్యాకేజీని కేంద్రం ఇస్తానందంటూ చంద్రబాబు బాహాటంగా ప్రకటనలు చేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏమీ రావంటూ కేంద్రానికి అవకాశం ముందుగానే బాబు ఇచ్చేశారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పేర్కొం టున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరుతున్న సమయంలో.. ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రంతో బేరసారాలు నడిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో ప్రత్యేక సహాయానికి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో సెప్టెంబరు 7, 2016న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించారు. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

అదే రోజున అర్ధరాత్రి విలేకరుల సమావేశాన్ని పెట్టి చంద్రబాబు స్వాగతించారు. ఆ మరుసటి రోజే శాసనసభలో కేంద్రానికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు.. ఆ తరువాత విదేశీ ఆర్థిక సాయంతో ప్రాజెక్టుల ద్వారా వద్దని హడ్కో, నాబార్డు  ద్వారా ఆర్థిక సాయం అందించాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. అంతెందుకు పది నెలల క్రితం అంటే.. ఈ ఏడాది íఫిబ్రవరి 27వ తేదీన ఉండవల్లిలో ప్రజావేదికలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ హోదా వల్ల ఏమి వస్తుందని, పోలవరానికి 40 వేల కోట్లు రావని, 16 వేల కోట్లు రెవెన్యూ లోటు రాదని, పరిశ్రమలకు రాయితీలు వస్తాయంటూ మభ్యపెడుతున్నారంటూ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కంటే మేలైన ప్యాకేజీ కేంద్రం ఇస్తానందని, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని బాబు ప్రత్యేక హోదాపై తన వ్యతిరేకతను మరోసారి దేశానికి చాటి చెప్పారు. అంతే కాకుండా ప్రతిపక్ష నేత నేతృత్వంలో ప్రత్యేక హోదా పోరును తారస్థాయి తీసుకువెళ్తున్న సమయంలో పోరాటంలో పాల్గొనే వారిని జైళ్లకు పంపిస్తామనడమే కాకుండా పీడీ కేసులు పెడతామంటూ బాబు హెచ్చరికలు చేశారు.

నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు వైఖరి రాష్ట్రానికి నష్టం తెస్తుందనే భావనతో ప్రతిపక్ష నేత హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే కాకుండా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించడంతో రాష్ట్ర ప్రజానీకం అంతా వైఎస్‌ఆర్‌సీపీకి బాసటగా నిలుస్తోందని, ప్రత్యేక హోదాపై ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉన్నట్లు గ్రహించిన చంద్రబాబు ఇక దిక్కు లేక ఒక పక్క కేంద్రంలోని పెద్దలతో లోపాయికారిగా కుమ్మకై బయటకు మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చనందుకు కేంద్రంలోని బీజెపీతో తెగతెంపులంటూ ప్రకటించారనే విషయం తేటతెల్లమైంది. ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని ప్రతిపక్ష నేత అసెంబ్లీలోనూ, బయట పలుసార్లు చెప్పినప్పటికీ బాబు పట్టించుకోలేదు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌ వై.వి.రెడ్డి, సభ్యుడు గోవిందరావుల లిఖిత పూర్వక ప్రతులను ప్రతిపక్ష నేత చూపించినా బాబు పట్టించుకోలేదు. ప్రతిపక్షనేత గతంలో ఏమి చెప్పారో ఇప్పుడు అదే విషయాన్ని ప్రత్యేక హోదా విషయంలో బాబు చెప్పడమే విడ్డూరం. ప్రత్యేకహోదా వల్ల అన్నీ వస్తాయని ఏ జీవోలో ఉందో చూపెట్టాలంటూ హేళన చేస్తూ చంద్రబాబు గతంలో మాట్లాడిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం ఎన్నటికీ మరవలేరు.

పోలవరం.. ఆమడదూరం!
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసి.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. కానీ.. పీపీఏతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోకుండా, నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ వచ్చింది. దాంతో సెప్టెంబరు 7, 2016న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. నాబార్డు ద్వారా నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.10,069.66 కోట్లను ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.6,727.26 కోట్లను విడుదల చేసింది. రూ.3,342.40 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. 2010–11 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే రూ.7,158.53 కోట్లను విడుదల చేస్తామని సెప్టెంబరు 7, 2016న కేంద్రం ప్రకటించింది. అందులో ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులు పోనూ మరో రూ.431.27 కోట్లను కేంద్రం విడుదల చేయాలి. ఇందులో రూ.399 కోట్లను విడుదల చేస్తూ సెప్టెంబరు 5న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపింది.

ఇప్పటివరకూ విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువపత్రాలను పంపాలని కోరింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ యూసీలను పంపలేదు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను నెల రోజుల్లోగా పంపాలని మార్చి 12, 2015న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ.. ఆగస్టు 16, 2017 వరకూ అంటే 28 నెలలు జాప్యం చేసి రూ.57,940.86 కోట్లతో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది..వాటిలో భారీ ఎత్తున తప్పులు ఉన్నట్లు సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) తేల్చింది. అంచనా వ్యయం భారీగా పెరగడానికి సహేతుకమైన కారణాలు చెబితే.. ఆమోదించి, నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం సహేతుకమైన సమాధానాలు చెప్పడం లేదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. సీఎం బాబు కమీషన్‌ల కోసం కక్కుర్తి పడకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించి ఉంటే.. ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉండేది.

జిల్లాల నిధుల్లో గోల్‌మాల్‌
వెనుకబడిన ఉత్తరాంద్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది. ఆ విభజన చట్టం ప్రకారం ఐదేళ్ల కాలంలో 24,350 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ ప్రతిపాదనలు అసమగ్రంగా ఉండటంతో తిప్పి పంపడమే కాకుండా అన్ని నిధులు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఒత్తిడి తేకుండా కేంద్రం కోరినట్లు ఏడాదికి జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశారు. ఎక్కడ 24,350 కోట్లు ఎక్కడ ఐదేళ్లలో 3,500 కోట్లు. ముఖ్యమంత్రే స్వయంగా జిల్లాకు ఏడాదికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇస్తే సరిపోతుందని లేఖ రాయడంతో కేంద్రం జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని పేర్కొంది. వెనకబడిన జిల్లాలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నిబంధనల మేరకు ఆ జిల్లాల్లో వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో తొలుతే కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తామని హెచ్చరించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన వినియోగ పత్రాలను కేంద్రం తప్పుపట్టింది. దీంతో వెనుకబడిన జిల్లాలకు 1,050 కోట్ల రూపాయలను విడుదల చేసిన తరువాత మిగతా నిధులను విడుదల చేయలేదు. దీనిపై ఇప్పటికీ కూడా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు.

పీఆర్పీ బకాయిల ఎగవేతపై కేంద్ర నజర్‌
రెవెన్యూ లోటు రూ. 16,000 కోట్లలో ఏకంగా రూ. 3,920 కోట్లు కేంద్రం నుంచి రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంకృతాపరాధమే. 2014 నుంచి 2015 మార్చి వరకు పీఆర్సీ బకాయిలను ఉద్యోగులకు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. బకాయిలు పెట్టడంతో వ్యయం చేయకుండా ఆ మొత్తాన్ని రెవెన్యూ లోటుగా ఎలాగ పరిగణిస్తామని కేంద్రం నిలదీయడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ బకాయిలను రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదిలోనే ఉద్యోగులకు చెల్లించేసి ఉంటే రెవన్యూ లోటు కింద 3,920 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేవి.

మరో పక్క దుగరాజపట్నం పోర్టు ఫీజబిలిటీ కాదని, మరో ప్రత్యామ్నాయ పోర్టును ప్రతిపాదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెద్ద పోర్టుగా కేంద్రం అంగీకరించిన దుగరాజపట్నం పోర్టును ప్రతిపాదించకుండా ఏకంగా రామాయపట్నం పోర్టును మేజర్‌ పోర్టు నుంచి మైనర్‌ పోర్టుగా మార్చేసి రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని జీవో జారీ చేసేసింది. ఇక విశాఖకు రైల్వే జోన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు ఏకాభిప్రాయం లేదు. అధికార టీడీపీకి చెందిన ఎంపీల్లోనే రైల్వే జోన్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కేంద్రం రైల్వే జోన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరో పక్క వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ఇనుప ఖనిజం ఎక్కడ నుంచి సరఫరా చేస్తారని కేంద్రం అడుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు ఎత్తడం లేదు.

రాజధాని నిర్మాణానికి సమగ్ర నివేదిక ఏది?
ఇక రాజధాని నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇటీవల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించలేదు. తొలుత రాజధానికి  నాలుగు లక్షల కోట్ల రూపాయల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరమని, కనీసం 1.35 లక్షల కోట్ల రూపాయలు అవసరమని పేర్కొన్న చంద్రబాబు ప్రతీ ఏడాది బడ్జెట్‌లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. అయితే ఇటీవల రాజధాని నిర్మాణానికి 1,09,623 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటూ 39,937 కోట్ల రూపాయల సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం తొలుత ఇచ్చిన 1,500 కోట్ల రూపాయలను తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి వినియోగించేసింది. కేంద్రం దీనిపై విస్మయం వ్యక్తం చేసింది. పక్కా భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే తాత్కాలిక సచివాలయానికి ఎలాగ వినియోగిస్తారంటూ నిలదీసింది. ఈ నిర్వాకంతో రాజధాని నిర్మాణానికి మొత్తం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ తరువాత కేంద్రానికి డీపీఆర్‌ పంపినప్పటికీ ఆ డీపీఆర్‌ను ఆమోదింపచేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా కేవలం ధర్మపోరాట దీక్షల పేరుతో కేంద్రం అన్యాయం చేసిం దంటూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల వరకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి ధర్మపోరాట దీక్షలపై ఇతర అధికారుల దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడైనా ప్రభుత్వం దీక్షలు చేస్తుందా అంటూ ఆ అధికారి ప్రశ్నించడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రంపై ఒత్తిడి చేసి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా ధర్మపోరాట దీక్షలు చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాష్ట్రం నష్టపోయినా పరవాలేదు.. మనకు రాజకీయం ముఖ్యం అనే రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కూడా ఆ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

జాతీయ విద్యాసంస్థలపై కల్లబొల్లి కబుర్లు
విభజన చట్టం కింద రాష్ట్రంలో ఏర్పాటుచేయాల్సిన జాతీయ విద్యాసంస్థలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రంలో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయితేనే వాటిలో వివిధ విభాగాలు, ల్యాబ్లు, ఇతర పరిశోధనశాలల ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. ఒక్కో విద్యాసంస్థకు అనేక భవనాలు నిర్మించాల్సి ఉంటుందని, నిర్మాణాలు ఒక్కరోజులోనో, నెలలోనో పూర్తయ్యేది కాదని చెబుతున్నారు. ఏదైనా నిర్మాణానికి సంబంధించి అవసరమైన మేరకు నిధులు వెచ్చించి ఆ పనులు పూర్తయ్యాక తదుపరి పనులకు నిధులు వినియోగిస్తుంటారు. అంతే తప్ప ఒకేసారి భవనానికి అయ్యే మొత్తాన్ని ఎవరూ విడుదల చేయరు, ఖర్చుచేయరు. విడతల వారీగానే ఆనిర్మాణాల బడ్జెట్‌ నిధులు విడుదల అవుతుంటాయి. అలాగే నియామకాల విషయంలోనూ ప్రవేశపెట్టే కోర్సుల వారీగా నియామకాలు చేపడుతుంటారు.  కానీ చంద్రబాబునాయుడు ఈ వాస్తవాలను కప్పిపుచ్చి జాతీయ విద్యాసంస్థల అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికి శ్వేతపత్రంలో నిధులు ఇవ్వలేదని, నియామకాలు చేయలేదని పొందుపరిచారని పేర్కొంటున్నారు. విభజన చట్టం ప్రకారం 11 జాతీయ విద్యాసంస్థల్లో 5 (ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీడీఎం)లు ప్రారంభమయ్యాయి.

ఐఐపీఈ, ఎన్‌ఐడీఎంలు కూడా తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్నాయి. సెంట్రల్‌ వర్సిటీ, ఏఐఐఎంఎస్‌లు కూడా తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ట్రైబల్‌ వర్సిటీ ప్రారంభం కావలసి ఉంది. విచిత్రమేమంటే రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే ఈ సంస్థలకు భూములను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలి. అలా సమకూర్చిన భూమికి కూడా చంద్రబాబునాయుడు విలువ గట్టి తాను 131.33 కోట్లు ఇచ్చానని చెబుతుండటం విశేషం. ఈ సంస్థలకు ఇప్పటివరకు కేంద్రం 845.42 కోట్లు ఇచ్చింది. అయితే వీటికి 12746 కోట్లు కావాలని కేంద్రం ఇచ్చింది చాలా తక్కువని బాబు వాదిస్తున్నారు. దశలవారీగా పూర్తయ్యే ఈ సంస్థలకు విడతల వారీగా నిధులు విడుదల అవుతుంటాయని, దాన్నీ చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటుండటం విచిత్రంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో తన మంత్రులను కొనసాగించిన బాబు విద్యాసంస్థలకు నిధుల గురించి ఏనాడూ అడిగిన పాపాన పోలేదు. కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏటా అరకొర నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టంగా తెలిసినా దానిపై ఏనాడూ నోరెత్తిన పాపాన పోలేదు.

- సీహెచ్‌ మాణిక్యాలరావు, సాక్షి ప్రతినిధి

మరిన్ని వార్తలు