జయ విజయం

12 May, 2015 00:26 IST|Sakshi

రాజకీయాల్లో ప్రవేశించిన క్షణం నుంచి ఎన్నో యుద్ధాలనూ, అవి ముందుకు తీసుకొచ్చే సవాళ్లనూ...ఎన్నెన్నో ఆటుపోట్లనూ ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న అన్నా డీఎంకే అధినేత జయలలిత మరో సుదీర్ఘ పోరాటంలో ఎన్నదగిన విజయం సాధించారు. పందొమ్మిది సంవత్సరాలనాటి అక్రమార్జన కేసులో ఆమె, ఆమెతోపాటు మరో నలుగురూ నిర్దోషులని కర్ణాటక హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిరుడు సెప్టెంబర్‌లో ఇదే కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షనూ, వంద కోట్ల రూపాయల జరిమానాను విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చినప్పుడు జయలలిత రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనని అందరూ భావించారు. నాలుగేళ్ల జైలు శిక్ష, అనంతరం ఆరేళ్ల అనర్హతవల్ల మొత్తం పదేళ్లు ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాల్సివస్తుందని లెక్కలు వేశారు. అయితే మిన్ను విరిగి మీదపడినా, సర్వమూ అయిపోయినట్టేననిపించిన సందర్భాలు వచ్చిపడినా ఏమాత్రం చలించకుండా... స్థిరంగా, దృఢంగా నిలబడి పోరాడటం జయలలిత స్వభావం.

నిజానికి ఆ స్వభావమే ఆమెను తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఫీనిక్స్‌లా మళ్లీ మళ్లీ ఆమెను పెకైగసేలా చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పు తర్వాత శాసనసభ సభ్యత్వం రద్దయినందువల్ల నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఎటూ వచ్చే ఏడాదితో ముగిసిపోతుంది గనుక ఆర్నెల్లలోగా ఎమ్మెల్యేగా పోటీచేసే బదులు అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని ఆమె నిర్ణయించుకున్నా ఆశ్చర్యంలేదు.

జయలలితపై వచ్చిన అవినీతి ఆరోపణలూ, అందుకు సంబంధించిన కేసులూ, విచారణలూ, వాయిదాలూ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెపై ఇంతవరకూ డజను కేసులు నడిచాయి. వాటన్నిటిలోనూ జయలలిత నిర్దోషిగా బయటికొచ్చారు. టాన్సీ భూములు కుంభకోణంలో కింది కోర్టు 2001లో ఆమెను దోషిగా తేల్చి అయిదేళ్లు శిక్ష విధించగా, అప్పీల్‌లో ఆ కేసు సైతం వీగిపోయింది. ఇప్పుడు తీర్పు వెలువడిన అక్రమార్జన కేసు 1996 నాటిది. ఒక కేసులో వచ్చిన నేరారోపణలు నిజమా, కాదా అని తేలడానికి ఇన్నేళ్లు పట్టడం...ఆ కేసు ఇన్ని మలుపులు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జయలలితపై వచ్చిన  ఈ కేసులన్నిటి వెనకా రాజకీయ స్పర్శ ఉంది. 1991లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన జయలలిత 1996 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆ సమయంలో ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని అపరిమితంగా ఆస్తులు కూడబెట్టారని ప్రస్తుత బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదైంది.

కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక ఎన్నెన్నో మలుపులు తిరిగింది. ఈలోగా జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందువల్ల కేసులో న్యాయం జరిగే అవకాశం లేదని డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ అనంతరం దీన్ని బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీచేస్తూ 2003లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదలా కొనసాగుతుండ గానే జయలలిత మళ్లీ అధికారం కోల్పోయారు. నిరుడు సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి శిక్ష విధించేనాటికి జయలలిత అధికారంలో ఉన్నారు. ఆ తీర్పు పర్యవసానంగా ఆమె పదవినుంచి తప్పుకున్నారు. కొత్తగా పన్నీరుసెల్వం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భవానీసింగ్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదమైంది. ఆ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఆ పదవిలో మరొకరిని నియమించమని క ర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా వరసబెట్టి ప్రతికూల నిర్ణయాలు వెలువడతున్న తరుణంలో జయలలితకు ఊరటనిస్తూ వెలువడిన కర్ణాటక హైకోర్టు తీర్పు సహజంగానే ఆమెకూ, ఆమె మద్దతుదార్లకూ ఎనలేని సంతోషాన్నిచ్చింది.

 తమిళనాడు అవినీతి వ్యతిరేక డెరైక్టరేట్ చేసిన దర్యాప్తు తప్పుల తడకగా ఉన్నదని, రాజకీయ కక్ష సాధింపుతో తన ఆస్తుల విలువను తప్పుగా మదింపు వేశారని జయలలిత చేసిన వాదనను సింగిల్ జడ్జి బెంచ్ అంగీకరించింది. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ. 66.45 కోట్లుగా ప్రాసిక్యూషన్ నిర్ధారించగా వాటి విలువ రూ. 37.59 కోట్లని హైకోర్టు  తేల్చింది. ఈ కాలంలో ఆమె సంపాదనను 34.76 కోట్లుగా లెక్కేసి వ్యత్యాసం రూ. 2.82 కోట్లు మాత్రమేనని నిర్ధారణకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కెళ్తే భవిష్యత్తులో ఏమవుతుందన్నది పక్కనబెడితే అసలు ఒక కేసులో న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి మన న్యాయస్థానాలు ఇంత సుదీర్ఘకాలాన్ని ఎందుకు తీసుకుంటున్నాయన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు సాగదీయాలనుకోవడంవల్ల కావొచ్చు... అధికారంలో ఉన్నవారి ప్రాపకంతో దర్యాప్తు సంస్థలు కావాలని చేసే జాప్యంవల్ల కావొచ్చు విచారణ ప్రక్రియ హద్దూ ఆపూ లేకుండా ఏళ్లకేళ్లు నడుస్తున్నది. ఇందువల్ల తప్పుచేసినవారు శిక్ష పడకుండా దీర్ఘకాలం తప్పించున్నట్టే నిజంగా ఏ తప్పూ చేయనివారు ‘అవినీతి’ ముద్రతో, క్షోభపడుతూ కాలం వెళ్లబుచ్చవలసి వస్తున్నది.

ఇప్పుడు జయలలిత కేసే తీసుకుంటే ఈ పందొమ్మిదేళ్ల పొడవునా ఆమెపై విమర్శలు చేయాల్సివచ్చినప్పుడల్లా ప్రత్యర్థులకు ఈ అవినీతి కేసులే ఆయుధం. అది ఆమె రాజకీయ జీవితంపై అంతో ఇంతో ప్రభావం చూపింది. తీరా ఇన్నేళ్ల తర్వాత ఆమె నిర్దోషిగా బయటపడ్డారు. ఆలస్యం అయినా కేసులను నిష్పాక్షికంగా విచారించి, తీర్పులివ్వడంలో మన న్యాయవ్యవస్థ సమర్థవంతమైనది. అయితే, ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవడం అవసరం ఉన్నదని ప్రస్తుత కేసు తెలియజెబుతోంది.  
 

>
మరిన్ని వార్తలు