మరో అధికారి బలిదానం

19 Mar, 2015 00:40 IST|Sakshi
డీకే రవి

సంపాదకీయం

తమలో ఉన్న నిజాయితీ, ముక్కుసూటిదనమూ, సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యమూ ఈ వ్యవస్థ ప్రక్షాళనకు తోడ్పడగలవని త్రికరణశుద్ధిగా నమ్మి సివిల్ సర్వీసును ఎంచుకునే యువతను దిగ్భ్రాంతి పరిచే ఉదంతమిది. కర్ణాటక రాష్ట్రంలో 36 ఏళ్ల ఐఏఎస్ అధికారి డీకే రవి ఆదివారం అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆయన కేవలం ఆరేళ్ల సర్వీసును మాత్రమే పూర్తి చేసుకున్న యువ అధికారి. ఇది ఆత్మహత్యేనని, కుటుంబ సమస్యలే అందుకు కారణమని వెనువెంటనే పోలీసులు ప్రకటించగా, దానికి అనుగుణంగా చట్టసభలో ప్రభుత్వం ప్రకటన వెలువడింది. ఇంత హడావుడి ప్రకటనలే ఈ మరణాన్ని మరింత మిస్టరీగా మార్చాయి. ప్రజలను ఆగ్రహోదగ్రులను చేశాయి. ఆయన పనిచేసి వచ్చిన కోలార్ ప్రాంతంలోనూ, ఆయన స్వస్థలంలోనూ ప్రజలు ఆందోళనకు దిగారు. రవి ఎంతో నిజాయితీగల అధికారని... ప్రభుత్వానికి ఏటా రావలసిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టడమేకాక, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుని వారి ఆగ్రహానికి గురయ్యాడని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నిజాయితీ ఆయనకు అయిదు నెలల క్రితమే బదిలీని బహుమతిగా ఇచ్చింది. గత అక్టోబర్‌లో కోలార్ నుంచి ఆయన బెంగళూరు మారాల్సివచ్చింది. ఈసారి ఆయనకు వాణిజ్య పన్నుల విభాగం బాధ్యతలు అప్పగించారు. అక్కడ సైతం ఆయన తనదైన ముద్రవేశారు. ప్రభుత్వానికి పన్నుల రూపేణా రావలసిన కోట్లాది రూపాయలను ఎగేస్తున్న బడా బాబులపై ఒత్తిళ్లు తెచ్చారు. ముఖ్యంగా బిల్డర్లపై కఠిన చర్యలకు సమాయత్తమయ్యారు. వారి నుంచి స్వల్పవ్యవధిలో వంద కోట్ల రూపాయలకుపైగా సొమ్ము వసూలు చేశారు. ఇలాంటి చర్యలన్నీ సామాన్య పౌరుల్లో ఆయనను హీరోను చేయడమే కాదు... చట్టబద్ధ పాలనపై విశ్వాసాన్ని పెంచాయి. చట్టాన్ని ధిక్కరించే వారు పర్యవసానాలను అనుభవించక తప్పదన్న సందేశాన్ని పంపాయి. మరో పక్క నిజాయితీగల అధికారికి అండగా నిలబడలేని పాలనా యంత్రాంగం అశక్తత ఆ అధికారిని ప్రమాదంలోకి నెట్టింది.

 నీతి నిజాయితీగల అధికారులు అడుగడుగునా గండాలను ఎదుర్కోవాల్సి రావడం ఈ దేశంలో కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. మంజునాథ్‌ను దుండగులు కాల్చి చంపారు. పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోవడమే ఆయన చేసిన నేరం. సుదీర్ఘకాలం నడిచిన ఆ కేసులో ఆరుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ వారం క్రితమే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇంతలోనే యువ ఐఏఎస్ అధికారి రవి ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది. మంజునాథ్‌కన్నా ముందు 2003లో సత్యేంద్ర దూబే అనే మరో యువ ఇంజనీరింగ్ అధికారి స్వర్ణ చతుర్భుజి నిర్మాణంలో చోటు చేసుకుంటున్న అక్రమాల గురించి ఆనాటి ప్రధాని వాజపేయికి లేఖ రాసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. దేశంలో పేరు ప్రఖ్యాతులున్న ఒక నిర్మాణ రంగ సంస్థ ఈ రహదార్ల నిర్మాణం కోసం తనకొచ్చిన కాంట్రాక్టును మాఫియాల కనుసన్నల్లో నడిచే కొన్ని సంస్థలకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిందని, ఇందువల్ల నిర్మాణం పనులు నాసిరకంగా ఉంటున్నాయని సోదాహరణంగా వివరించాడు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న వైనాన్ని విశదీకరించాడు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికార గణం ఈ అవినీతిలో పాలు పంచుకుంటున్నది గనుక నేరుగా లేఖ రాయవలసివస్తున్నదని కూడా చెప్పాడు. తన వివరాలు బయటపెట్టకుండా దర్యాప్తు చేయించమని కోరాడు. ఏదీ చక్కబడలేదు కానీ... రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు చీవాట్లొచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దుండగులు ఆయనను కాల్చిచంపారు. ఆ సమయానికి ఆ యువ అధికారి వయసు 31 ఏళ్లు. ఏడేళ్ల విచారణ అనంతరం 2010లో ముగ్గురు దుండగులకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధిస్తే దానిపై అప్పీల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇటీవలి కాలంలో హర్యానా ఐఏఎస్ అధికారి ఖేమ్కా, యూపీ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్ నిజాయితీగా పని చేసినందుకు, ఉన్నత స్థాయి వ్యక్తుల బండారం బయటపెట్టినందుకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలంతా గమనించారు.

 తమ మాట శాసనం కావాలని, తమ చర్య నిరాటంకంగా సాగిపోవాలని వాంఛించే ఫ్యూడల్ భావజాలం ఉన్న పాలకులకు నీతినిజాయితీలతో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కంటగింపవుతున్నారు. అయిదేళ్లు పాలించమని జనం అధికారమిస్తే మధ్యలో ఈ అధికార్ల ‘న్యూసెన్స్’ ఏమిటని పాలకులకు ఆగ్రహం కలుగుతున్నది. నిర్మాణరంగం, మైనింగ్, మద్యం, విద్య వంటి రంగాలు మాఫియాల అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. దేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్న నిర్మాణరంగం వల్ల ఇసుకకు నానాటికీ డిమాండు పెరుగుతోంది. ఏటా కోట్ల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్న కారణంగా ఇసుకలో బంగారం పండుతోంది. పరిమితులకు మించి ఇసుక తవ్వడం ప్రమాదకరమని, అందువల్ల ఎన్నో విపత్తులకు ఆస్కారం ఉంటుందని పర్యావరణ వేత్తలు ఏనాటి నుంచో మొత్తుకుంటున్నారు. దానిపై ఒక సమగ్రమైన విధానం రూపొందించమని సుప్రీంకోర్టు ఈమధ్యే సూచించింది. అయినా ప్రభుత్వాలు మేల్కొనడం లేదు.  రవి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆయన ఆత్మహత్య చేసుకునేంత దుర్బలుడు కాడంటున్నారు. రవి ఎదుర్కొన్న బెదిరింపులు, ఒత్తిళ్ల నేపథ్యం వల్ల ఆయన మరణం చుట్టూ ఇప్పుడు ఎన్నో అనుమానాలు ముసురుకున్నాయి. కనుక ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు జరిపించడమే శ్రేయస్కరమని కర్ణాటక ప్రభుత్వం గుర్తించాలి. అంతకన్నా ముందు నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కవచంగా ఉండాలని తెలుసుకోవాలి.

>
మరిన్ని వార్తలు