బతకడం అంటే పునర్నిర్మాణం

29 Oct, 2018 00:24 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం 

సన్మార్గ నిర్దేశకులనైన మహోన్నతులు ఎక్కడెక్కడనో కాదు, మనసుతో చూస్తే మన చుట్టూనే అతి సామాన్యులుగా జీవిస్తూ కనబడుతుంటారు. ఆ విషయాన్ని అబ్దుల్‌ కలాం ‘నా జీవన గమనం కలల సాకారం’ స్పష్టంగా వివరించింది.రామసేతు నిర్మాణ ప్రదేశమైన ధనుష్కోడి దర్శనార్థం వెళ్లే హిందువులను రామేశ్వరం నుండి అక్కడికి పడవ ద్వారా చేరవేసేవాడు జైనులాబ్దిన్‌. అదే అతనికి జీవనాధారం. అయితే, 1964లో భారీ తుఫాను వచ్చి అతని పడవ ధ్వంసమైంది. అది అతనికి కొత్తేమీ కాదు. ఆ విధంగా జరిగినప్పుడల్లా మరో కొత్త పడవని నిర్మించుకునేవాడు. సాధారణంగా ఇటువంటి సమయంలో అతడి చేతికింద అబ్దుల్‌ కలాం ఉండేవాడు. ఆ తండ్రి కొత్త పడవలో కూర్చుని అలలకి ఎదురుగా తన ప్రయాణాన్ని యథావిధిగా మొదలుపెట్టేవాడు. ‘బ్రతకడం అంటే కష్టాలని ఎదుర్కొని జీవితాన్ని పునర్నిర్మించుకోవడమే’ అన్న గొప్ప సారాంశాన్ని కుమారునికి వారసత్వంగా అందించాడు.

సాధారణంగా భారతీయులు తమ మాటామంతిలో కులమతాల నుండి ఎంతటి ఆదర్శవంతునికైనా సరే మినహాయింపు ఇవ్వరు, ఒక్క కలాంకు తప్ప. ఈయనని కేవలం భారతీయుడిగా మాత్రమే గౌరవించడానికి ఇష్టపడతారు. అందుకు కారణం ఆయన ప్రతీ మతంలోని గొప్ప అంశాలని గుర్తించి గౌరవించడమే. కలాం తండ్రి జైనులాబ్దిన్‌ రామేశ్వరంలోని మసీదుకు ఇమామ్‌. పక్షి లక్ష్మణశాస్త్రి రామనాథ ఆలయ అర్చకులు. ఫాదర్‌ బోడల్‌ చర్చికి ప్రీస్ట్‌. ముగ్గురూ వర్తమాన స్థితిగతుల గురించి చర్చలు జరుపుతుండేవారట. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా రామేశ్వరం మాత్రం ప్రశాంతంగా ఉండేదట. దీని గురించి కలాం ఈ విధంగా చెప్పారు: ‘పట్టణంలో శాంతి భద్రతలు నిలిచి ఉండటానికి ముఖ్యమైనది ప్రజల మధ్య సరైన ప్రచార ప్రసారం’ అని. బహుశా ఆ ముగ్గురి మైత్రీ ప్రభావమేమో కలాం మహనీయత! స్క్వార్జ్‌ హైస్కూలు నుండి ఇస్రో వరకు సాగిన ప్రస్థానంలో ఎప్పటికప్పుడు వెంటే ఉండి ముందుకు తోసిన జ్ఞాపకాలని పొందుపరిచారు కలాం.

‘కలలు అనేవి నిద్రలో వచ్చి కరిగిపోయేవి కావు. అవి మనలని నిద్ర పోనివ్వకుండా చేయాలి’ అని చెప్పిన ఈ మిస్సైల్‌ మాన్‌ ఒక ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ‘ఈ సమాజం ప్రస్తుత పరిస్థితిని ప్రశ్నించకుండా ఉండటం నేర్చుకున్నది’ అని. రేపటి తరానికి అది అలవర్చటం కోసమే కావొచ్చు, తరచూ పిల్లల్ని కలిసి ఏదైనా ప్రశ్నించమని కోరేవారు. ‘నేను కూడ ఒక అన్వేషినే. మీతో జరిపే చర్చల ద్వారా నేనూ కొన్ని సమాధానాలు వెతుక్కుంటున్నాను’ అంటూ వికసించే మొగ్గలతో గడిపిన జ్ఞాపకాలని అక్షరీకరించారు. ఈ పుస్తకం కేవలం ఆలోచింపజేయడమే కాదు, ఆచరణ వైపు కదిలిస్తుంది కూడా.
కె.నందన్‌కుమార్‌ గౌడ్‌
 

మరిన్ని వార్తలు