ఆప్‌ హ్యాట్రిక్‌!

12 Feb, 2020 00:35 IST|Sakshi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి ఘన విజయం సాధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ‘హ్యాట్రిక్‌’ కొట్టింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆప్‌కు 62 స్థానాలు రాగా, బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. ఈ ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక కార్టూన్‌ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. చెల్లాచెదురుగా వున్న బుల్లెట్లను చీపురు ఊడ్చేయడాన్ని ఆ కార్టూన్‌లో చూపారు. చీపురు గుర్తు ఆప్‌ దని చెప్పనవసరం లేదు. కానీ ఆ కార్టూనిస్టు బుల్లెట్లను దేనికి ప్రతీకగా వాడాడో అక్కడ జరిగిన ప్రచార పర్వం తీరుతెన్నుల్ని గమనించినవారికి సులభంగానే బోధపడు తుంది. ఎన్నికలన్నాక గెలుపోటములు తప్పవు. అధికారంలో వున్నవారైతే మంచి పనులతో జనాన్ని మెప్పించడానికి ప్రయత్నించాలి. అధికారంలోకి రావాలనుకున్నవారు తాము వస్తే ఏమేం చేస్తామో చెప్పాలి. కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచారం హద్దు మీరింది. ఈ విషయంలో ఆప్‌ నుంచి కొత్తగా వచ్చి చేరిన కపిల్‌ మిశ్రా గురించి చెప్పుకోవాలి. బీజేపీలో ఆదినుంచీ వుంటున్న నేతల్ని మించి ఆయన రెచ్చిపోయారు.

ఈ ఎన్నికల్లో పోటీ భారత్, పాకిస్తాన్‌ల మధ్యేనంటూ శ్రుతి మించారు. ఇప్పటికే షహీన్‌బాగ్‌లోకి పాకిస్తాన్‌ ప్రవేశించిందని, మరికొన్ని చోట్ల అది వేళ్లూనుకోవ డానికి ప్రయత్నిస్తోందని భయపెట్టే యత్నం చేశారు. కొందరు నేతలు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అన్నారు.  దేశద్రోహుల్ని కాల్చిచంపాలంటూ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సభికులతో నినాదాలు చేయించారు. తుది దశలో బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో స్థానిక అంశాలతో నిండి వుండొచ్చుగానీ, ఆ పార్టీ ప్రచారం మొత్తం జాతీయ భద్రత చుట్టూ,  షహీన్‌బాగ్‌ చుట్టూ తిరిగింది.  మీరెటువైపో తేల్చుకోవాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చింది. జాతీయ భద్రత గురించి పౌరులను చైతన్యవంతం చేయాలనుకోవడాన్ని తప్పుబట్టలేంగానీ, తెల్లారితే కాలుష్యం మొదలుకొని అనేక స్థానిక సమస్యలతో సతమతమవుతున్న ఢిల్లీ పౌరులకు కేవలం జాతీయ భద్రత పాఠాలు చెబితే చాలనుకోవడం, ప్రత్యర్థులందరినీ జాతి వ్యతిరేకులుగా చిత్రిస్తే సరిపోతుందనుకోవడం బీజేపీ చేసిన తప్పిదం. అయిదేళ్ల పాలనలో తొలి మూడున్నరేళ్లు తమను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, సుప్రీంకోర్టు ఎవరి విధులేమిటో తేటతెల్లం చేసేవరకూ మెరుగైన పాలన అందించకుండా అడ్డు తగిలిందని కేజ్రీవాల్‌ ఆరోపించినా బీజేపీ సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయింది. తాము ఢిల్లీకి ఏంచేశామో చెప్పడంలోగానీ, తొలి మూడున్నరేళ్లకూ సంబం ధించి తమ వాదనేమిటో వివరించడంలోగానీ ఆ పార్టీ విఫలమైంది.

గత ఎన్నికలతో పోలిస్తే రాజకీయ నాయకుడిగా కేజ్రీవాల్‌ ఎంతో పరిణతి సాధించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అనుసరిస్తున్న నమూనాను నిశితంగా పరిశీలించి, దాంతో సాధ్యమైనంతవరకూ ఘర్షణ వైఖరికి దిగకుండా సంయమనం పాటించారు. తనను ఉగ్రవాది అన్నా, దేశద్రోహులతో సమానం చేసినా ఆయన మాట తూలలేదు. పైగా రాముడిపైనా, హనుమంతుడిపైనా బీజేపీకే పేటెంట్‌ ఉంటుందన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు. గతంలోవలె ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించే పనికి పూనుకోలేదు. షహీన్‌బాగ్‌ ఆందోళనపై మీ అభిప్రాయమేమిటో చెప్పాలని బీజేపీ సవాలు విసిరినా కేజ్రీవాల్‌  జవాబివ్వలేదు. అక్కడ సాగుతున్న ఉద్యమానికి మీ నిర్వాకమే కారణమని ఆరోపించారు. వారితో చర్చించి, ఒప్పించి దాన్ని విరమింపజేసే బాధ్యత మీదేనని, అందులో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని నిలదీశారు. ఆ అంశాలకు బదులు తాము మెరుగైన పనితీరు కనబర్చిన ఉన్న విద్య, వైద్య రంగాలకు ప్రచారంలో ప్రాధాన్యమిచ్చారు. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా నీరు అందజేయడం, మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి వీలు కల్పించడం, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు, కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు తదితరాలను తన విజయాలుగా ఆప్‌ బాగా ప్రచారం చేయగలిగింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మరో కారణం శాంతిభద్రతలు గాలికి కొట్టుకుపోయాయన్న అభిప్రాయం అందరిలో కలగడం. దేశ రాజధాని నగరంలో పట్టపగలు వేలాదిమంది మహిళలు గుమిగూడినచోట ఒక దుండగుడు పోలీ సుల సమక్షంలోనే నాటు తుపాకి పేల్చడం, ఒకరిని గాయపర్చడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి ఘటనలే మరో రెండు చోటుచేసుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది. ప్రతిష్టాత్మ కమైన జేఎన్‌యూలో పదుల సంఖ్యలో ముసుగులు ధరించిన గూండాలు మూడుగంటలపాటు చెలరేగినా, ఆడపిల్లల హాస్టల్‌పై దాడిచేసి కొందరి తలలు పగలగొట్టినా దోషులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు విఫలం కావడం అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కనుకనే బీజేపీకి బాగా పట్టువుండే సంపన్నుల కాలనీల్లో సైతం ఆ పార్టీకి ఓట్ల శాతం తగ్గింది. బహుశా స్థానిక ఓటరు నాడి పట్టగలిగిన మదన్‌లాల్‌ ఖురానా వంటి నేతలు ఉండివుంటే ఢిల్లీ బీజేపీ ఇంత అధ్వాన్నమైన ప్రచారం నడిపేది కాదు.

ఢిల్లీలో విజయం కోసం బీజేపీ 22 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈసారి అది దక్కుతుందని దృఢంగా విశ్వసించడానికి తొమ్మిదినెలలక్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలు కారణం. ఆ ఎన్నికల్లో బీజేపీకి 56.58 శాతం ఓట్లు లభించాయి. దాని ప్రకారం 65 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీదే ఆధిక్యత. దీనిలో ఎంతచెడ్డా 40 అయినా రాకపోతాయా అని బీజేపీ ఆశించింది. ఓట్ల లెక్కింపు తొలి దశలో ఆ ఆశ నెరవేరవచ్చునన్న అభిప్రాయం కూడా కలిగింది. అటు తర్వాత అంతా తిరగబడింది. పవర్‌ బ్రోకర్లతో నిండిన కాంగ్రెస్‌ను ఓటర్లు మరోసారి పరాభవించారు. 2013 వరకూ మూడు దఫాలు వరసగా పాలించిన ఆ పార్టీకి అంతకంతకు ఓట్ల శాతం పడిపోతోంది. ఈసారి 67 చోట్ల ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోవడమంటే మాటలు కాదు. మొత్తానికి దేశ రాజధాని నగరంలో విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోయింది. కానీ ఈ ఎన్నికలు మోసుకొచ్చిన విద్వేషభావనలు చల్లారడానికి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాన్నాళ్లు పడుతుంది.

మరిన్ని వార్తలు