ఉన్మాద దాడులు

3 Jul, 2018 00:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం విగ్రహాలు పాలు తాగుతున్నాయన్న వదంతులు వ్యాపించి దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రార్థనా మందిరాల ముందు వేలాదిమంది క్యూ కట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పటికింకా సెల్‌ఫోన్ల వాడకం లేదు. ఇంటర్నెట్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. రోజంతా వార్తలు ప్రసారం చేసే చానెళ్లు కూడా పుట్టలేదు. అరకొరగా, అస్తవ్యస్థంగా ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్లు మాత్రమే దిక్కు. ఇప్పుడు కాలం మారింది. ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ వగైరా సామాజిక మాధ్యమాలు ఆవిర్భవించాయి. వీటిద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో సెల్‌ఫోన్లకు దృశ్య సహితంగా వచ్చి వాలుతోంది. కానీ గుంపు మనస్తత్వంలో మార్పు రాలేదు. తమకందిన సమాచారం ఏదైనా, అందులోని నిజానిజాలేమిటో నిర్ధారణ చేసుకునే వీలు లేకపోయినా వెనకా ముందూ చూడకుండా వాటిని విశ్వసించడం, మరింతమందికి పంపడం అలవాటుగా మారింది. తమ నాయకుడికో, నాయకురాలికో ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో తప్పుడు వార్తల్ని, దృశ్యాల్ని ప్రచారంలో పెట్టేవారు... గిట్టని నేతలను కించపరచడానికి ప్రయ త్నించే వారు ఉంటున్నారు.

కానీ మరికొన్ని వదంతులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నాయి. మహారాష్ట్రలో తాజాగా అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న ఘటన ఇటువంటిదే. ఉన్మాదం ఆవహించిన గుంపులు వెనకా ముందూ చూడకుండా విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నాయి. పలు ఉదంతాల్లో వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఇటీవలికాలంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్మాదుల దురాగతానికి దాదాపు 20మంది బలయ్యారంటే పరిస్థితులు ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయో తెలుస్తుంది. ఉన్మాద గుంపులు తమ చేతచిక్కినవారిని కాళ్లూ, చేతులూ కట్టి నెత్తురోడేలా హింసిస్తున్న దృశ్యాలు మీడియాలో తరచుగా కనబడుతున్నాయి. అవి అత్యంత హృదయవిదారకంగా ఉంటున్నాయి. దేశంలో అసలు ప్రభుత్వాలున్నాయా, శాంతిభద్రతల పరిరక్షణపై వాటికి పట్టింపు ఉందా అనే అనుమానం కలిగిస్తున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో అత్యధికులు దళితులు, మైనారిటీలు. ఈ వదం తుల వ్యాప్తి తీరుతెన్నులను గమనిస్తే వీటిని వ్యాపింపజేయడం వెనక ఎవరికైనా ప్రత్యేక ప్రయోజనాలున్నాయేమోనన్న అనుమానాలు కలుగుతాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచార మయ్యే వదంతులు వింతగా ఉంటున్నాయి.

పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు బయల్దేరాయని... దోపిడీలు చేయడానికి హంతక ముఠాలు రంగంలోకి దిగాయని...గోవులను ఫలానా వాహనంలో తరలిస్తున్నారని...ఇంట్లో పశుమాంసం ఉంచుకున్నారని–ఇలా ఈ వదంతులకు అంతూ పొంతూ ఉండటం లేదు. ఇవి పదే పదే చోటు చేసుకుంటున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అడపా దడపా జరుగుతున్న ఇలాంటి ఘటనల్ని అదుపు  చేయడం కోసం ప్రత్యేకించి ఒక చట్టం తీసుకురావాలని డాక్టర్‌ ప్రకాష్‌ అంబేడ్కర్‌ గతంలో కోరారు. ఆయన ఆధ్వర్యంలో గుంపు దాడుల్లో బాధ్యుల్ని గుర్తించి శిక్షించడానికి వీలుగా కొందరు కార్యకర్తలు ఒక ముసాయిదా బిల్లును కూడా రూపొందించి ఏడాది కావస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయని చెప్పింది. మనకు జాతీయ భద్రతా చట్టం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో సంఘటిత నేరాల నియంత్రణ చట్టాల వంటి కఠిన చట్టాలున్నాయి. కానీ అవి రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించినట్టుగా ఈ దుండగాలకు పాల్పడుతున్నవారిపై ఉపయోగిం చడం లేదు. నిందితులు సులభంగా బెయిల్‌ తెచ్చుకోగలుగుతున్నారు. జార్ఖండ్‌లో నిరుడు జూన్‌లో వందమంది గుంపు అన్సారీ అనే యువకుణ్ణి పశు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో హింసించి చంపింది. ఆ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారించి ఒక బీజేపీ సభ్యుడితోసహా ఎని మిదిమందికి యావజ్జీవ శిక్ష విధించింది. అయితే వారందరికీ హైకోర్టులో బెయిల్‌ లభించింది. కఠినమైన చట్టాల కింద కేసులు పెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.ఘటన జరిగిన తర్వాత అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం మినహా ఈ వదంతుల విష యంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు లేవు. ఉన్నా అవి మొక్కుబడిగా సాగుతు న్నాయి. ఈ సందర్భంగా త్రిపుర ప్రభుత్వం చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవాలి.

వదంతులు నమ్మొద్దని ప్రచారం చేయడానికి రోజుకు రూ. 500 వేతనం ప్రాతిపదికన నియమించిన వ్యక్తి ఒక ఊరుకు పోయి ప్రచారం చేస్తుంటే అక్కడ కొంతమంది అతన్ని పిల్లల్ని అపహరించే ముఠాకు చెందినవాడిగా భావించి రాళ్లు, కర్రలు, గాజు సీసాలతో దాడి చేసి చంపేశారు. గ్రామంలో పలుకుబడిగలవారిని గుర్తించి ఈ ప్రచార కార్యక్రమం కోసం వెళ్లినవారిని పరిచయం చేయించినా, వారికి పోలీసు రక్షణ కల్పించినా ఇలాంటి సమస్య తలెత్తదు. ఆ మాదిరి చర్యలు తీసుకోకుండా బలికి మేకపోతును పంపినట్టు ఎవరో ఒకరిపై భారం వేసి వారిని ఒంటరిగా గ్రామాలకు పంపటం వల్ల ప్రయోజనమేమిటి? అసలు సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నవారి పైనా, ప్రాణం తీస్తామని, అత్యాచారాలకు ఒడిగడతామని హెచ్చరిస్తున్నవారిపైనా చర్యల మాటే మిటి? వీటి విషయంలో మౌనం పాటిస్తున్న తీరు మరికొందరు ఆకతాయిలకు ఎక్కడలేని ధైర్యా న్నిస్తోంది. దీంతో ఇష్టంలేనివారిపై లేనిపోని వదంతులు సృష్టించడంతో మొదలుపెట్టి ప్రజల్ని భయ భ్రాంతుల్ని చేసేలా సందేశాలు వ్యాప్తి చేయడం వరకూ ముదురుతోంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ మరణించినవారిలో ఎక్కువమంది మైనారిటీలు, అట్టడుగు వర్గాల వ్యక్తులు. బిచ్చమెత్తుకుని లేదా రోజుకూలీతో బతుకులు వెళ్లదీస్తున్నవారు. అందుకే ఘటన చోటుచేసుకున్నప్పుడు వీరి పక్షాన స్పందించే వారు, కనీసం అడ్డుకోవడానికి ప్రయత్నించేవారుండటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి, కఠినమైన శిక్షలతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇలాంటి దుండగాలను అదుపు చేసే ప్రయత్నం చేయాలి.

మరిన్ని వార్తలు