ఆత్మకథాస్త్రం!

1 Aug, 2014 00:33 IST|Sakshi

సంపాదకీయం

‘ఆత్మకథలు సాధారణంగా నిజాయితీగానే ఉంటాయి. కానీ, అందులో నిజాలు ఉంటాయని మాత్రం చెప్పలేం’ అంటాడు ఒక రచయిత. బాగా సన్నిహితులైన వ్యక్తులు రాసిన ఆత్మకథలు చదివి ఆయనకు ఆ అభిప్రాయం ఏర్పడివుండొచ్చు. మహాత్మా గాంధీ ఇందుకు భిన్నం.  జీవితంలో తనకు ఎదురైన సమస్యలు, వాటిపట్ల తాను అను సరించిన ధోరణులను దాచుకోకుండా వెల్లడించారు. తన కుటుంబం గురించి, తన సంతానం గురించి, వారి పోకడల గురించి కూడా నిర్మొ హమాటంగా, నిష్కల్మషంగా ఆయన రాశారు. వ్యక్తులకు ఇష్టాయిష్టా లుంటాయి.
 
అనుభవాలుంటాయి. అనుభూతులుంటాయి. అందులో చేదువీ, తీపివీ కూడా ఉంటాయి. అయితే, ఆ వ్యక్తి రాజకీయవేత్తగానీ, మరే రంగంలోనైనా మెరిసిపోయే సెలబ్రిటీగానీ అయితే అలాంటివారి అనుభవాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ గ్రంథాల్లో ఆయా ప్రము ఖులు ఎదుర్కొన్న కష్టాలు, ఎదురుదెబ్బలే కాదు... ఆ క్రమంలో వారికి తారసపడిన వ్యక్తుల గురించి వారికేర్పడివున్న అభిప్రాయాలు తెలుసు కోవాలన్న తహతహ ఉంటుంది. ఇదే సమయంలో ఆ ప్రముఖులతో పేచీ ఏర్పడినవారికి ఎంతో కొంత గుబులు కూడా ఉంటుంది.
 
తన గురించి వారికి గుర్తున్నవేమిటో, అందులో గ్రంథస్తం చేస్తున్నవేమిటో నన్న దిగులు ఏర్పడుతుంది. ఇదంతా సర్వసాధారణం. కనుకనే దౌత్య వేత్తగా, కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా, ప్రత్యేకించి రాజీవ్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నట్వర్‌సింగ్ వెలువరి స్తానన్న గ్రంథం గురించి ఎదురుచూస్తున్నవాళ్లు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటివారిలో సహజంగానే సోనియాగాంధీ కూడా ఉంటారు.
 
సోనియాగాంధీపై గత ఆరేళ్లుగా నట్వర్‌సింగ్‌కున్న ఆగ్రహావేశాలు గానీ, అందుకుగల కారణాలుగానీ రాజకీయాల్లో ఆసక్తిగలవారందరికీ తెలుసు. నట్వర్‌సింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ‘చమురుకు ఆహారం’ స్కాంలో ఇరుక్కుని రాజీనామాచేశారు. ఆ తర్వాత ఆయన 2008లో పార్టీనుంచి కూడా తప్పుకు న్నారు. నిజానికి తప్పుకున్నారనడం కంటే ఆయన్ను తప్పించారనడమే సరైంది. కాలం గాయాలు మాన్పుతుందంటారుగానీ... ఆరేళ్ల కాలం గడిచినా నట్వర్‌ను ఆనాటి అవమానాలు దహిస్తూనే ఉన్నాయని ఆయన ఆత్మ కథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ గ్రంథంనుంచి పరిమితంగా వెల్లడి చేసిన అంశాలు చదివితే అర్ధమవుతుంది. ఇవన్నీ తెలియబట్టే కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా సోనియాగాంధీ ఈ ‘బుక్ బాంబు’ గురించి బెరుకుగానే ఉన్నారు.
 
నట్వర్ చెబుతున్నదాన్నిబట్టి చాన్నాళ్ల తర్వాత మొన్నటి మే నెలలో సోనియా తన కుమార్తె ప్రియాంకా వాద్రా వెంట రాగా ఆయన ఇంటికెళ్లారు. తాను ప్రధాని పదవి స్వీకరించకపోవడా నికి సంబంధించిన ఉదంతాన్ని గ్రంథంలో ప్రస్తావించవద్దని సోనియా విజ్ఞప్తిచేశారని, అయితే ‘వాస్తవాలను ఉన్నవి ఉన్నట్టు’గా వెల్లడిం చాలన్న దృఢనిశ్చయంతో అన్ని వివరాలనూ పొందుపరిచానని నట్వర్ చెబుతున్నారు. కానీ, అందుకు ఇంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా 44 స్థానాలు మాత్రమే తెచ్చుకుని అట్టడుగుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి స్వల్పకాలంలోనే నట్వర్ రూపంలో ఎదురైన మరో చేదు అనుభవమిది.
 
దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవిని అధిష్టించడానికి అవకాశం వచ్చినప్పుడు సోనియాగాంధీ తన అంతరాత్మ చెప్పినట్టే నడుచుకున్నారని, ఆ పదవిని త్యాగం చేశారని ఇన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్ని నట్వర్ తన గ్రంథంలో తిప్పికొ ట్టారు. తన నానమ్మలా, తన తండ్రిలా తల్లి కూడా దూరమవుతుం దేమోనని రాహుల్‌గాంధీలో గూడుకట్టుకుని ఉన్న భయమే అందుకు కారణమని చెప్పారు. పార్టీ మొత్తం ఆమె వెనకున్నా, ఆమె స్వయంగా ప్రధాని పదవి చేపట్టడానికి సిద్ధపడినా రాహుల్ మాటే చివరకు నెగ్గిందని చెప్పడమంటే  కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆయన అప్పటినుంచే క్రియాశీలంగా వ్యవహరించారని తెలియజేయడమే.
 
అంతేకాదు... ఆయనది ఊగిసలాట ధోరణని, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ధైర్యసాహసాలు ఆయనలో లేవని చెప్పడమే. ఈ ఉదం తాన్ని విశ్లేషించుకుంటే రాహుల్ నాయకత్వంలో గుజరాత్, యూపీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఓటముల వెనకున్న కారణాలు సుల భంగానే అర్ధమవుతాయి. ఆత్మకథలో దీనిని ప్రస్తావించవొద్దని సోనియాగాంధీ నట్వర్‌ను ఎందుకు కోరివుంటారో కూడా అవగతమవుతుంది.
 
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఫైళ్లు సోనియా వద్దకు వెళ్లేవని గతంలో సంజయ బారు చెప్పినట్టుగానే ఇప్పుడు నట్వర్‌సింగ్ కూడా చెప్పారు. యూపీఏ పదేళ్ల పాలనాకాలంలో సోనియాగాంధీ ఎంత శక్తిమంతంగా వ్యవహరించారో తెలిసినవారికి ఇదేమంత ఆశ్చర్యమని పించదు. సామాన్యుడిని సమస్యలు చుట్టుముడుతున్నా యూపీఏ సర్కారు పట్టనట్టుగా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఇలా రెండు అధికార కేంద్రాలు పనిచేయడమేనని ఆ సమయంలోనే రాజకీయ నిపు ణులు చెప్పివున్నారు.
 
ఈ నిర్ణయరాహిత్యం ఎన్ని అనర్ధాలు తెచ్చిందో అందరికీ తెలుసు. అందువల్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఓటమిని చవిచూడాల్సివచ్చింది. ఇప్పుడు నట్వర్‌సింగ్ వెల్లడించిన విషయాల్లో చాలా భాగం ఆనోటా ఈనోటా పాకి దాదా పుగా అందరి ఎరుకలోనికీ వచ్చినవే. ఇక సోనియాగాంధీ రాస్తానని చెబుతున్న గ్రంథం వీటన్నిటినీ ఎలా పూర్వపక్షం చేస్తుందో చూడాలి. అంతకన్నా ముందు... నట్వర్ ఇప్పుడు వెల్లడించిన అంశాలకు అదనంగా ఆత్మకథలో ఇంకేమి ఉన్నాయో ఎదురుచూడాలి.

మరిన్ని వార్తలు