బెర్నీ నిశ్శబ్ద నిష్క్రమణ

11 Apr, 2020 00:41 IST|Sakshi

ఈసారైనా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన బెర్నీ సాండర్స్‌ వరస ఎదురు దెబ్బలతో రంగం నుంచి నిష్క్రమించారు. పర్యవసానంగా వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బిడెన్‌ తలపడటం ఖాయమైంది. మొదట్లో సాండర్స్‌కు మంచి ఆదరణ లభించినా క్రమేపీ అది కొడిగట్టింది. న్యూహాంప్‌షైర్‌లో ఆయనదే పైచేయి అయింది. నెవెడాలో ఆయనకు అద్భుతవిజయం దక్కింది. అయోవా సైతం ఆయనకే మొగ్గు చూపింది. అంతా బాగుందనుకుంటుండగా సూపర్‌ ట్యూస్‌డే పెద్ద దెబ్బ తీసింది. ఆ రోజు జరిగిన 14 రాష్ట్రాల ప్రైమరీల్లో పది బిడెన్‌ ఖాతాలో పడ్డాయి. ముఖ్యంగా నల్లజాతీయులు అధికంగా వున్న సౌత్‌ కరోలినాలో అత్యధికులు బిడెన్‌ వైపే మొగ్గడం సాండర్స్‌కు పెను విఘాతమైంది. వచ్చే జూలై లోపు మరికొన్ని ప్రైమరీలున్నా ఇక కొనసాగడం అనవసరమని సాండర్స్‌ భావించారు. ఆయన రంగం నుంచి తప్పుకున్నాడని తెలియగానే స్టాక్‌ మార్కెట్‌ హుషారెత్తి 700 పాయింట్లు పెరిగిం దంటే... సాండర్స్‌ విధానాలు, ఆయన ఆలోచనలు ఎలాంటివో అర్థమవుతుంది. ఆయనకు అధికారం దక్కితే తమ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయమని అమెరికన్‌ బహుళజాతి సంస్థలు భయపడ్డాయి. వారికి కరోనా వైరస్‌ సంక్షోభం కన్నా సాండర్స్‌ బెడదే ప్రమాదకరమనిపించింది. 

విచిత్రమేమంటే రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ మొదటినుంచీ ‘బయటి వ్యక్తి’లాగే వ్యవహరిస్తూ వచ్చి చివరకు 2016లో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా పోటీ చేస్తున్నారు. సాండర్స్‌ కథ కూడా ఇదే. ఆయన కూడా డెమొక్రటిక్‌ పార్టీలో ‘బయటి వ్యక్తే’. పార్టీలో అత్యధికులకు ఆయనంటే పొసగదు. అయితే ట్రంప్‌ మొదటినుంచీ దూకుడుగా వుంటూ, సంచ లనాత్మక ప్రకటనలు చేస్తూ, వివాదాలు రేకెత్తిస్తూ తన సొంత పార్టీలోని ప్రత్యర్థులపై అవలీలగా పైచేయి సాధించారు. తన ముగ్గురు ప్రత్యర్థులనూ ఆయన సునాయాసంగా ఓడించగలిగారు. కానీ సాండర్స్‌ తీరే వేరు. ఆయనకు హుందాతనం ఎక్కువ. విధానాలపై విమర్శలే తప్ప వ్యక్తులనుద్దేశించి మాట్లాడటం ఆయనకు అలవాటు లేదు. బిడెన్‌ విధానాలను ఆయన నిశితంగా విమర్శించారు. ఆ విధానాలకూ, ట్రంప్‌ ఆచరిస్తున్న విధానాలకూ తేడా లేదని దుయ్యబట్టారు. అంతేతప్ప ప్రత్యర్థి గురించి పరుషంగా మాట్లాడటం, ఆరోపణలు గుప్పించడం ఆయనకు చేతకాదు. ఈ విషయంలో సొంత టీంలోని వారు నచ్చజెప్పినా సాండర్స్‌ వినలేదు.

ఆ పని చేసివుంటే మొదట్లో దక్కిన విజయాలను కొనసాగించడం వీలయ్యేదని వారి నమ్మకం. సాండర్స్‌కు విద్యార్థులు, యువత గట్టి మద్దతుగా నిలిచారు. అయితే నల్లజాతీయుల్లో విశ్వాసం కలిగించలేకపోవడం సాండర్స్‌కు శాపౖ మెంది. ట్రంప్‌కు ఆయన దీటైన అభ్యర్థి అవుతాడన్న నమ్మకం వారికి కలగలేదు. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బిడెన్‌ అయితేనే తమ ప్రయోజనాలు నెరవేరతాయని, సాండర్స్‌ ఓడిపోతే మళ్లీ ట్రంప్‌ పాలనలో మగ్గాలని మెజారిటీ నల్లజాతీయులు భావించారు. వాస్తవానికి సాండర్స్‌ ప్రచారం ముందు బిడెన్‌ వెలవెలబోయారు. పేదలకు ఉచిత వైద్యం అందించే ‘ఒబామా కేర్‌’కు ఆయన వ్యతిరేకి. బిడెన్‌ కుటుంబాన్ని చుట్టుముట్టిన కుంభకోణాలు అనేకం. ఒక సెనేట్‌ ఉద్యోగినిపై ఆయన లైంగిక దాడి చేశాడన్న ఆరోపణ వుంది. వీటన్నిటికీ భిన్నంగా సాండర్స్‌ విధానాలు ప్రగతిశీలమైనవి. సంపన్నులపై పన్నుల పెంపు, ఆదాయ వ్యత్యాసాల తగ్గింపు, అల్పాదాయ వర్గాలకు ఉచిత వైద్యం, ఉచితంగా కళాశాల విద్య, కార్మికులకు కనీస వేతనం పెంపు వంటివి ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షించాయి.

అందుకనే మొదట్లో సాండర్స్‌కు 30 శాతం మొగ్గు కనబడింది. బహుశా పార్టీ ఓటర్లతో నేరుగా సంభాషించే అవకాశం వస్తే సాండర్స్‌ తన స్థితిని మరింత మెరుగుపరుచుకునేవారు. కానీ కరోనా వైరస్‌ స్వైర విహారంతో ప్రచార సభలకు వీలు లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. మొదటినుంచీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ, సోషల్‌ డెమొక్రాట్‌గా పేరుబడిన సాండర్స్‌కు అమెరికా వంటి పెట్టుబడిదారీ సమాజంలో అనుకూలత వ్యక్తం కావడం సులభం కాదు. ఆయన న్యూహాంప్‌షైర్, నెవెడాల్లో నెగ్గినప్పుడే అక్కడి బహుళజాతి సంస్థలు ఉలిక్కిపడ్డాయి. అప్పటినుంచి సాండర్స్‌కు వ్యతిరేకంగా మీడియాలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వెలువడ్డాయి. మూడు దశాబ్దాల క్రితం యూరప్‌ను నాశనం చేసిన సోషలిస్టు విధానాలను అమెరికాలో ఆయన ప్రవేశపెట్టాలనుకుంటున్నాడని దుమ్మెత్తిపోశాయి. సాండర్స్‌ కోసం రష్యా తహతహలాడుతున్నదని ప్రచారం చేశాయి. డెమొక్రటిక్‌ పార్టీలోని యువత, విద్యా ర్థులు సాండర్స్‌ వైపున్నా, వృద్ధ తరం ఓటర్లు మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికు న్నాయన్నదే గీటురాయిగా తీసుకున్నారు. బిడెన్‌ పార్టీని గట్టెక్కిస్తాడని వారు భావించారు. ఇదంతా సాండర్స్‌కు ప్రతికూలంగా మారింది.  

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటికే 16,000 మందికిపైగా మరణించగా, లాక్‌డౌన్‌తో లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారు. కనుకనే సాండర్స్‌ మద్దతుదార్లను కూడ గట్టుకునేందుకు బిడెన్‌ కూడా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఉచిత వైద్యం పరిధిలోకి మరింతమందిని తెచ్చేందుకు వయో పరిమితిని 60కి తగ్గిస్తానని, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల విద్యార్థులు తీసుకునే రుణాల్లో కొంత మేర మాఫీ చేస్తానని తాజాగా హామీ ఇస్తున్నారు. సాండర్స్‌ ఎన్నికల రంగం నుంచి తప్పుకున్నా, ఆయన విధానాలు అంత త్వరగా మరుగున పడిపోవు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్‌ ఏలుబడే కొనసాగినా, బిడెన్‌ అధ్యక్షుడైనా సాండర్స్‌ ప్రతిపాదించిన విధానాలపై చర్చ, వాటి అమలుకు ఉద్యమాలు కొనసాగుతాయి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు