పార్టీల్లో ‘కర్ణాటక’ గుబులు

25 Apr, 2018 00:42 IST|Sakshi

రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు జీవన్మరణ సమస్యగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పర్వంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. వచ్చే నెల 12న జరగబోయే ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ హోరాహోరీ తలపడ బోతున్నాయని, విజేతలెవరైనా స్వల్ప ఆధిక్యతలే ఉంటాయని... జేడీ(ఎస్‌) పార్టీ మద్దతు ఎవరికి లభిస్తుందన్నది కీలకంగా మారబోతున్నదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియాటుడే, టైమ్స్‌ నౌ, జైన్‌ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌లతోసహా మొత్తం 8 మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించగా అందులో జైన్‌ లోక్‌నీతి– సీఎస్‌డీఎస్‌ మాత్రమే బీజేపీకి అధిక స్థానాలు లభించగలవని అంచనా వేసింది. మిగిలినవన్నీ కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించగలదని చెబుతున్నాయి. ఈ సర్వేల మాటెలా ఉన్నా టిక్కెట్ల పంపిణీ విషయంలో ఈసారి కాంగ్రెస్‌కన్నా ఎక్కు వగా బీజేపీ బజారునపడింది.

టిక్కెట్లు ఆశించినవారి మద్దతుదార్లు చాలాచోట్ల ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ముఖ్యంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తన కుమారుడు విజయేంద్రకుగానీ, తన సన్నిహితురాలు శోభా కరాంద్లజేలకు గానీ టిక్కెట్లు ఇప్పించుకోలేకపోయారు. విజయేంద్రకు పార్టీ యువజన విభా గంలో చోటిచ్చి ఆగ్రహాన్ని చల్లార్చడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నించారు. పుండు మీద కారం జల్లినట్టు ఆయనకు పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న గాలి జనార్దనరెడ్డి సోదరులిద్దరికి బీజేపీ టిక్కెట్లు లభించడంతోపాటు ఆ కుటుంబానికి సన్నిహితు లైన మరో అయిదుగురికి సైతం జాబితాలో చోటు దక్కింది. తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి కుటుంబం అండదండలు లేకుండా విజయం సాధించడం కల్ల అని బీజేపీ భావిస్తోంది. ఊహించని ఈ పరిణామాలతో పార్టీలో ముందూ మునుపూ తన పరిస్థితేమిటన్నది యడ్యూరప్పకు బాగా అర్ధమై ఉండాలి. విజ యం తమదేనని బీజేపీ బింకంగా చెబుతున్నా ఆ పార్టీ లోలోపల ఎంత కలవర పడుతున్నదో అభ్యర్థుల జాబితాలే పట్టి చూపుతాయి. 

కర్ణాటక ఎన్నికలు అనేక విధాల కీలకమైనవి. నరేంద్రమోదీ నాయకత్వాన కేంద్రంలో అధికారంలోకొచ్చాక దక్షిణాదిన అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడం బీజేపీకి ఇదే ప్రథమం. ఇక్కడ గెలిస్తే దక్షిణాదిన సైతం కాషాయ పవనాలు వీస్తున్నాయని చెప్పుకోవడానికి ఆ పార్టీకి అవకాశముంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్ని కలను కొంచెం ముందుకు జరపడానికి అవసరమైన ధైర్యం లభిస్తుంది. అందుకు భిన్నమైన ఫలితాలొస్తే ముందస్తు ఎన్నికల మాటే ఉండదు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ తన విచిత్ర విన్యాసాలతో చాలా త్వరగానే ప్రజాభిమానాన్ని పోగొట్టుకుంది. తన కొచ్చిన అరకొర మెజారిటీని అధిగమించాలన్న ఆత్రుతతో వేర్వేరు పార్టీల నుంచి ఫిరా యింపుల్ని ప్రోత్సహించింది.

ఆ నాటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ ఫిరాయింపుదార్లతో  రాజీనామా చేయించి మళ్లీ బరిలో దింపారు. భూకుంభ కోణాల ఆరోపణలు రావడంతో చివరకు యడ్యూరప్ప తప్పుకుంటే ఆ తర్వాత సదానంద గౌడ, జగదీశ్‌ శెట్టార్‌లు సీఎంలయ్యారు. అంతర్గత విభేదాల పరంపరతో ఆ పార్టీ 2013నాటికి జనాభిమానాన్ని పోగొట్టుకుంది. జనం కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. అయితే అటు యడ్యూరప్ప, ఇటు గాలి జనార్దనరెడ్డి అనుచరుడు శ్రీరాములు సొంత కుంపట్లు పెట్టుకుని బీజేపీ ఓట్లు చీల్చడం వల్లనే ఇది సాధ్యమైంది. అనంతరకాలంలో యడ్యూరప్ప తిరిగి సొంత గూటికి చేరు కున్నారు. మోదీ ప్రభంజనం వీచిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 17 గెల్చుకుని అగ్రగామిగా నిల్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9 దక్కాయి.

అయితే గత సార్వత్రిక ఎన్నికల నాటి మోదీ ఆకర్షణ కర్ణాటకలో ఇప్పుడు లేదని సర్వేలు చెబుతున్నాయి. మున్ముందు బీజేపీ ప్రచార సరళినిబట్టి ఇది మారొచ్చు. నరేంద్ర మోదీ, అమిత్‌షాలతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఓటర్లను ఆకర్షించగలరని బీజేపీ మొదట్లో నమ్మకం పెట్టుకుంది. కానీ గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఉన్నావ్‌ అత్యాచార ఉదంతం ఆ ఆశను వమ్ము చేశాయి.  

కాంగ్రెస్‌ది చిత్రమైన పరిస్థితి. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలామందిపై వ్యతిరేకత ఉన్నా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు సర్వేల్లో మంచి మార్కులే పడ్డాయి. సీఎం అభ్యర్థుల్లో యడ్యూరప్ప, కుమారస్వామిల కన్నా సిద్ధరామయ్యే చాలా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ పాలనపైనా, దాని హయాంలో పెచ్చు పెరిగిన అవినీతిపైనా జనంలో అసంతృప్తి ఉన్నా ముఖ్యమంత్రిపై అది ప్రతిఫలిం చకపోవడం అసాధారణమే. ఎక్కువ సర్వేల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెల్చు కునే పార్టీగా అవతరించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీపై ఉన్న ఆదరణే కారణం.

కానీ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబడుతోంది. మొదటినుంచీ బీజేపీకి దగ్గరగా ఉండే లింగాయత్‌లను మైనారిటీ మతంగా గుర్తించినా ఆ వర్గం నుంచి కాంగ్రెస్‌కు పెద్దగా లాభించేదేమీ ఉండదని సర్వేలు జోస్యం చెబుతు న్నాయి. మరో బలమైన సామాజిక వర్గం ఒక్కళిగల్లో అత్యధికులు ఎటూ జేడీ (ఎస్‌)వైపే మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితుల్లో ఓబీసీలు, దళితులు, మైనారిటీల ఓట్లే కాంగ్రెస్‌కు కీలకం. సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాదరణ గమనించి ఎన్నికల పోరును పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకే విడిచిపెట్టినట్టు కనబడుతోంది.

అలాగని సిద్ధరామయ్య మరీ అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు లేరు. ఆయన మైసూర్‌ జిల్లాలోని చాముండేశ్వరి స్థానంతోపాటు బాగల్‌కోట్‌ జిల్లా బాదామి నుంచి కూడా పోటీ చేయడమే ఇందుకు నిదర్శనం. జేడీ(ఎస్‌)‘కింగ్‌మేకర్‌’ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. ప్రచారం జోరు పెరిగాక ఇప్పుడున్న అంచ నాలు మారే అవకాశం లేకపోలేదు. స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా పార్టీలను తిప్పలు పెట్టడంలో కర్ణాటక ఓటర్లు సిద్ధహస్తులు. ఈసారి కూడా ఆ బాటనే వెళ్తారా లేక అందుకు భిన్నంగా తీర్పునిస్తారా అన్నది వచ్చే నెల 15న వెలువడే ఫలి తాలు తేటతెల్లం చేస్తాయి.

మరిన్ని వార్తలు