బుద్ధగయపై నెత్తుటిచారిక!

10 Jul, 2013 16:12 IST|Sakshi
సంపాదకీయం
 
 దేవుణ్ణి కాదు... మానవుడిని కేంద్రంగా చేసుకుని 2,500 సంవత్సరాలక్రితం బౌద్ధమతం ప్రభవించినచోట నెత్తురొలికింది. ఉన్మాదం తప్ప మరేమీ తెలియని ఉగ్రవాదులు ఆదివారం పవిత్ర బుద్ధ గయలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. పేలుళ్లకు వారు ఎంచుకున్న సమయమూ, పేలుడు పదార్ధాలు అమర్చడంలో వారు పొందిన వైఫల్యమూ కారణంగా ఎవరి ప్రాణాలకూ ముప్పువాటిల్లలేదు. అయినా మహాబోధి ఆలయంలో నాలుగుచోట్ల... కర్మపా ఆరామంలో మూడు చోట్ల, 80 అడుగుల బుద్ధ విగ్రహం వద్ద, ఆ పట్టణంలోని బస్టాప్‌వద్ద బాంబులు పేలాయి. ఇద్దరు బౌద్ధ బిక్షువులకు గాయాలయ్యాయి. వేకువజామున 5.30 తర్వాత 28 నిమిషాలపాటు ఈ వరస పేలుళ్లు సంభవించాయి. మరికొన్ని బాంబులను పోలీసులు నిర్వీర్యం చేయగలిగారు. సిద్దార్ధ గౌతముడు శాక్యమునిగా రూపాంతరం చెందిన చారిత్రక బోధి వృక్షానికిగానీ, మహాబోధి ఆలయానికిగానీ ఎలాంటి నష్టమూ వాటిల్లకపోవడం ఎంతగానో ఊరట కలిగించే విషయం. ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన అనంతరం ప్రతిసారీ వినబడే కథనాలే ఇప్పుడూ వినిపిస్తున్నాయి.
 
 ఎప్పటిలాగే మన భద్రతా సంస్థల వైఫల్యాన్ని పట్టిచూపుతున్నాయి. పాత దాడులనుంచి ఆ సంస్థలు రాబట్టిన గుణపాఠాలేమీ లేవని చాటి చెబుతున్నాయి.  ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళతోసహా అయిదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని సమాచారం.
 
  బుద్ధ గయను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని మన పోలీసులకు తెలినిదేమీ కాదు. ఏడాదిక్రితం జరిగిన పూణే పేలుళ్లకు సంబంధించి అప్పట్లో ఢిల్లీలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులను ప్రశ్నించినప్పుడే వారి కుట్రలగురించి బయటపడింది. ఆరునెలలక్రితం మరింత ఖచ్చితమైన సమాచారం లభించింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ నెల 2న మహాబోధి ఆలయం భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించారు కూడా. 
 
 ఇన్ని జరిగినా ఉగ్రవాదులు తమ పనిని చాలా సులభంగా చేసుకుపోగలిగారు. ఉగ్రవాదుల కుట్రలను పసిగట్టి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉప్పందించినా బాంబు పేలుళ్లను నిరోధించలేకపోతే ఇక ప్రభుత్వాలుండి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు బీహార్ పోలీసులు చెబుతున్న జవాబు వింటుంటే అది దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల తర్వాత మన పోలీసు అధికారులు చెప్పిన సంజాయిషీనే గుర్తుకు తెస్తుంది. బుద్ధ గయలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోమని చెప్పారుగానీ... అక్కడ ఉగ్రవాదుల దాడి జరగవచ్చని చెప్పలేదని వారంటున్నారు. బుద్ధ గయ సాధారణ సందర్శనా స్థలంకాదు. దేశ, విదేశాల నుంచి ఎందరెందరో నిత్యం అక్కడికి వస్తుంటారు. అలాంటప్పుడు 24 గంటలూ రెప్పవాల్చని నిఘా ఉండి తీరాలి. కీలకమైన ప్రాంతాల్లో హై రిజల్యూషన్ ఉన్న సీసీ టీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు అమర్చి అనుమానాస్పద వ్యక్తుల కదలికలేమైనా ఉన్నాయేమో  క్షణక్షణమూ చూస్తుండాలి. 16 కెమెరాలైతే ఉన్నాయి గానీ, వాటిని సరిగా చూసే దిక్కులేదు. ఆ కెమెరాలు కూడా స్పష్టమైన దృశ్యాలను అందించలేకపోయాయని ఇప్పుడు వెల్లడవుతోంది. కెమెరాలు అమర్చి దాదాపు ఏడాదవుతోంది. ఈ కాలమంతా ఒక్కసారి కూడా పోలీసు అధికారులు వాటిని పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే సాంకేతికంగా మరింత మెరుగైన పరికరాలను ఉపయోగించే అంశాన్ని పరిశీలించేవారేమో. స్పష్టమైన హెచ్చరికలున్న సందర్భంలోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే అధికారులను ఏమనాలి? వారి నిర్వాకం ఇలా ఉన్నది కనుకే దుండగులు స్వేచ్ఛగా సంచరించి ఆలయప్రాంగణంలోనూ, వెలుపలా టైమర్లు అమర్చిన 13 సిలెండర్లను తాము కోరుకున్నచోటపెట్టి వెళ్లగలిగారు. ఎక్కడ ఏ సిలెండర్ బాంబు పెట్టాలో రాసివున్న కాగితాలు కూడా వాటికి అతికించి ఉన్నాయి. అంటే, ఈ పని చేయడానికి ముందే అక్కడ కొందరు వ్యక్తులు రెక్కీ చేశారన్న మాట. ఎక్కడ బాంబులు పెడితే గరిష్ట స్థాయిలో నష్టం కలగజేయగలుగుతామో నిర్ణయించుకున్నారన్నమాట.
 
  మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలకూ, బౌద్ధులకూ మధ్య సాగుతున్న ఘర్షణల ప్రభావంతోనే బుద్ధ గయలో బాంబులు పెట్టి ఉండొచ్చని అంటున్నా ఆ విషయం ఇంకా దర్యాప్తులో తేలవ లసే ఉంది. మన పొరుగునున్న మయన్మార్‌లో ఈ రెండు వర్గాలమధ్యా గత కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల ఇవి మరింతగా ముదిరాయి. ఆ ఘటనలకు ప్రతీకారంగానే ఇక్కడ బౌద్ధ భిక్షువులు లక్ష్యంగా ఇలా బాంబులు పెట్టి ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. 
 
  ఉగ్రవాద ఘటన జరిగిన ప్పుడల్లా చర్చకొచ్చినట్టే ఇప్పుడు కూడా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సీటీసీ) ప్రస్తావనకొస్తున్నది. ఆ సంస్థ గనుక ఉంటే బీహార్ పోలీసులు ఇంత అలసత్వంతో ఉండేవారు కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. ఎన్‌సీటీసీ వంటిది అవసరమే. ఎవరూ కాదనరు. అయితే, దాని అమరికకు సంబంధించి విపక్షాల ముఖ్యమంత్రులకే కాదు... స్వపక్షంలోని ముఖ్యమంత్రులకూ అభ్యంతరాలున్న విషయం మరువకూడదు. రాష్ట్రాల అభ్యంతరాలను గౌరవించి తగిన మార్పులు చేసివుంటే ఆ కేంద్రం ఎప్పుడో సాకారమయ్యేది. 
 
 ఈ విషయంలో యూపీఏ ప్రభుత్వం తనను తానే నిందించుకోవాలి. అలాగని ఆ కేంద్రం ఏర్పడేలోగా చేతులు ముడుచుకుని కూర్చోనవసరంలేదు. ఉగ్రవాదుల కదలికల గురించి చెప్పి అప్రమత్తంచేశాక బాధ్యత తీరిందని చేతులు దులుపుకోకుండా తదుపరి చర్యలు ఏస్థాయిలో తీసుకుంటున్నారో గమనించడం, సంతృప్తికరంగా లేవనుకున్నప్పుడు అన్ని స్థాయిల్లోనూ మాట్లాడి తగిన సలహాలివ్వడం అవసరం. అదే జరిగివుంటే బుద్ధగయలో పేలుళ్లను నివారించడం సాధ్యమయ్యేది. కనీసం ఈ ఘటననుంచి అయినా గుణపాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు అప్రమత్తత తో మెలగాలి.
 
మరిన్ని వార్తలు