బ్రిటన్‌ను వణికిస్తున్న ‘బ్రెగ్జిట్‌’

8 Apr, 2019 00:12 IST|Sakshi

యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం శరాఘాతమవుతుం దని, ‘ముందు నుయ్యి... వెనక గొయ్యి’ చందంగా మారుతుందని బ్రిటన్‌కు ఆలస్యంగా అర్ధ మైంది. మూడేళ్లనాడు ఈయూ నుంచి బయటకు రావాల్సిందేనని ఒక రెఫరెండంలో బ్రిటన్‌ పౌరులు తేల్చి చెప్పిన నాటినుంచి ఆ దేశాన్ని కష్టాలు వెన్నాడుతున్నాయి. మరో అయిదు రోజుల్లో నిష్క్రమించక తప్పని ఈ స్థితిలో కూడా ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో ప్రధాని థెరిస్సా మే పడ్డారు. రెండేళ్లపాటు ఆమె ఈయూ పెద్దలతో బ్రెగ్జిట్‌పై చర్చలు సాగించారు. నిరుడు నవంబర్‌లో ముసాయిదాఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. తీరా దాన్ని ఆమోదించడం కోసం పార్లమెంటులో ప్రవేశపెడితే విపక్ష లేబర్‌ పార్టీ నుంచి మాత్రమే కాదు...స్వపక్షమైన కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి, ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌ పార్టీ డీయూపీ నుంచి కూడా దానిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పర్యవసానంగా ఆ ముసాయిదా ఒప్పందం పార్లమెంటులో ఒకసారి కాదు... మూడుసార్లు వీగిపోయింది. జనవరి 15న తొలిసారి ఒప్పందాన్ని పార్లమెంటు కాదన్నాక, థెరిస్సా మే మరోసారి ఈయూ పెద్దల్ని కలిశారు. ఒప్పం దంలో మరికొన్ని మార్పులకు వారిని అంగీకరింపజేశారు. అయినప్పటికీ  మార్చిలో రెండు సార్లు(12, 29 తేదీల్లో) కూడా ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటులో చుక్కెదురైంది.

ఈయూ భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నందువల్ల అందుకు పరిహారంగా బ్రిటన్‌ 3,900 కోట్ల పౌండ్లు చెల్లించాలని ముసాయిదా నిర్దేశిస్తోంది. దీంతోపాటు బ్రిటన్‌లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్‌లో ప్రస్తుతానికి ఈయూ నిబంధనలే వర్తించాలని అది కోరుతోంది. ప్రధానంగా ఈ రెండు అంశాలనూ అటు లేబర్‌ పార్టీ, ఇటు కన్సర్వేటివ్‌ పార్టీలోని అత్యధికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 2016 జనవరిలో బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌ ఈయూ నుంచి వైదొలగాలని ఓటేస్తే... ఉత్తర ఐర్లాండ్‌ పౌరులు మాత్రం ఈయూకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ కారణంవల్లే ఆ ప్రాంతంలో సరుకు రవాణాకు చెక్‌పోస్టులు పెట్టరాదని ఈయూ స్పష్టం చేస్తోంది. ఇది బ్రిటన్‌లో అత్యధికులకు రుచించడం లేదు. ఈ ఏర్పాటు తాత్కాలికమేనని చెబుతున్నా... బ్రిటన్‌లో భాగమైన ప్రాంతాన్ని స్వల్పకాలానికైతే మాత్రం ఈయూ పరిధికి తీసు కెళ్లడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏమైతేనేం, ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అటు పార్లమెంటును ఒప్పించి ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించమని కోర డమా... ఇటు ఈయూకు నచ్చజెప్పి ఈ నెల 12న ముగుస్తున్న గడువును మరికొంతకాలం పొడిగిం చమని ప్రాథేయపడటమా అన్నది థెరిస్సా మే ముందున్న ప్రశ్నలు. జూన్‌ 30 వరకూ గడువు పొడిగించమని యూరప్‌ మండలి అధ్యక్షుడు డోనాల్డ్‌ టస్క్‌కు ఆమె లేఖ రాశారు. ఈ గడువును వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించడానికి ఈయూ కూడా సిద్ధంగానే ఉంది. కానీ అందుకోసం బ్రిటన్‌ వచ్చే నెలలో జరగబోయే ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనవలసి వస్తుంది. ఎటూ విడిపోదల్చుకున్నప్పుడు ఈ ఎన్నికలు వృథా అని కన్సర్వేటివ్‌లలో అత్యధికులు వాదిస్తున్నారు. అందుకే ఆమె జూన్‌ 30 గడువు సరిపోతుందని కోరారు. కానీ ఈసారి ఈయూ అందుకు సిద్ధపడేలా లేదు. సమస్య మీ దగ్గరుంటే పరిష్కారం కోసం మాపై ఒత్తిడి తెస్తారేమిటన్న  ఈయూ సారథుల ప్రశ్న సహేతుకమైనది. వచ్చే బుధవారం జరగబోయే ఈయూ సమావేశంలో థెరిస్సా వినతికి సానుకూలత వ్యక్తం కాకపోవచ్చు.

బ్రెగ్జిట్‌  ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని థెరిస్సా అనుకుని ఉండరు. విపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు కోర్బిన్‌తో ఆమె బుధవారం సమావేశం కాబోతున్నారు. అది సానుకూల ఫలితం ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. లేబర్‌ పార్టీలో కోర్బిన్‌ వ్యతిరేకులు అదును కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. పార్లమెంటులో ముసాయిదా ఒప్పందాన్ని గట్టెక్కిస్తానని థెరిస్సాకు ఆయన మాటిచ్చిన మరుక్షణం ఆ పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం ఉంది. ఆ అవగాహనపై రిఫరెండమైనా నిర్వహిం చాలి లేక ప్రస్తుత పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నది వారి డిమాండు.  సంక్షోభం తలెత్తినప్పుడు దాని మూలాలు ఎక్కడున్నాయో, అందుకు గల కారణాలేమిటో చిత్తశుద్ధితో తెలుసు కుంటే పరిష్కారం సులభమవుతుంది. కానీ ఆ పని ఎవరూ చేయలేకపోయారు. రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్టు ఈయూ నుంచి వెలుపలకి రావడమే పరిష్కారమని మితవాదులు ప్రచారం చేయడం, అందుకు ప్రధాన పార్టీలు రెండూ అనాలోచితంగా మద్దతు పలకడంతో సమస్య జటిలంగా మారింది.  బ్రిటన్‌ పదే పదే బ్రెగ్జిట్‌ గడువు పొడిగించమని కోరడం, అందుకు ఈయూ సిద్ధపడటం సభ్య దేశాలకు రుచించడం లేదు.

ముఖ్యంగా ఫ్రాన్స్‌ ఈ విషయంలో పట్టుదలగా ఉంది. బ్రెగ్జిట్‌ను పొడిగించుకుంటూపోతే అటు బ్రిటన్, ఇటు ఈయూ అనిశ్చితిలో పడ తాయని అది హెచ్చరిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు. ఈయూ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే అనుసరించవలసిన విధివిధానాలేమిటో నిర్దేశిస్తున్న 50వ అధికరణ పర్యవసానాలేమిటో వాస్త వంగా ఎవరికీ తెలియదు. ఇంతవరకూ ఎవరూ సంస్థను విడిచిపెట్టకపోవడమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు బలపడుతున్న దశలో బ్రిటన్‌లో యూకే ఇండిపెండెంట్స్‌ పార్టీ(యూకే ఐపీ) ఈయూ నుంచి బయటకు రావాలన్న నినాదం అందుకుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదే పరిష్కారమని అది మొదలెట్టిన ఉద్యమం ఊపం దుకోవడం చూసి తాము సైతం దానికి వ్యతిరేకం కాదని అప్పటి లేబర్‌ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ చెప్పారు. అది దేశాన్ని ఈ దుస్థితికి నెడుతుందని అప్పట్లో వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఏదేమైనా బ్రిటన్‌ సంక్షోభం నాలుగురోజుల్లో ఒక కొలిక్కి వస్తుందా లేక ఎప్పటిలా మరో వాయిదాలోకి జారుకుంటుందా అన్నది చూడాలి.

మరిన్ని వార్తలు