అంతరాత్మ ఘోష ఆలకిస్తారా!

21 Jul, 2013 07:13 IST|Sakshi
అంతరాత్మ ఘోష ఆలకిస్తారా!

మరి మీలో ఎవరైనా ఆ విధంగా తప్పు తెలుసుకొని తప్పుకుంటారా? స్వచ్ఛందంగా ‘మైదానం’ విడిచి వెళ్లిపోతారా? ప్రభుత్వ విభాగానికి బాధ్యత వహించే కార్యదర్శి కానీ, ఫైళ్లు చూసే గుమాస్తా కానీ ఎదురుగా కనిపించే లంచానికి లొంగకుండా ఉండగలరా? లంచాలు ఇవ్వజూపకుండా వ్యాపారవేత్తలు ఉండగలరా? వ్యాపారానికి అంతరాత్మకు మధ్య నిరంతరాయంగా జరుగుతున్న యుద్ధంలో దేనిది పైచేయి అవుతున్నది? ఊరించే ‘బులబాటం’ నుంచి మనమంతా తప్పుకోగలిగితే ప్రపంచం వాసయోగ్యమయ్యేది కాదా?

ఒక్కసారి ఆలోచించండి! మీ చేతిలో ఇప్పుడు చాలినంత సమ యం ఉంది! ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఆ రోజున సమయం లేకపోయింది. యాషె స్ టెస్టు మొదటి మ్యాచ్ మూడో రోజున ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుటైనప్పుడు తన మనసులో తలెత్తిన నైతికత అంశాన్ని అణగదొక్కి ఆటలో కొనసాగాడు. ఆటచూస్తున్న వారంతా కనిపెట్టిన తప్పిదం ఏమిటో తన ఆత్మకు తెలిసి ఉండి కూడా, అంపైర్ చూడ లేదనే నెపంతో ఆటలో కొనసాగడంలోని ఔచిత్యం ఏమిట న్నదే క్రికెట్ ప్రపంచాన్ని తాజాగా వేధిస్తున్నది. స్వప్రయో జనం ఆశించి నిజాయితీని పణంగా పెట్టడం ఏ విధంగా చూసినా ఆమోదయోగ్యం కాజాలదు. తాను అవుట్ అయిన సంగతి తెలిసినప్పుడు అంతరాత్మ ప్రబోధం మేరకు స్వచ్ఛందంగా క్రీజ్ నుంచి బయటకు వెళ్లిపోవాలి. కానీ జ్యూరీ నిర్ణయం కోసం వేచిచూడటాన్నే ఎంచుకు న్నాడు. బ్రాడ్‌కు తగినట్టుగానే జ్యూరీ కూడా తెలిసో తెలి యకో తప్పిదమే చేసింది. కళ్లు ఉండీ చూడలేనివారి మాదిరి బ్రాడ్ బ్యాట్ బాల్‌కు తగలలేదని తీర్పు చెప్పింది. అంపైర్, జ్యూరీల పొరపాటు నిర్ణయం చాటున దాగి బ్రాడ్ దోషి అయివుండీ నిర్దోషిలా మిన్నకుండిపోయాడు
.
సిట్టింగ్ రూంలో సోఫాపై జారగిలపడి టీవీలో క్రికెట్ వీక్షించేవారికి లేదా క్రికెట్ పిచ్చి తలకెక్కినవారికి అంత రాత్మ ఆదేశంపై చేసే చర్చ కేవలం సైద్ధాంతికమైనదని అనిపించే అవకాశం లేకపోలేదు. కానీ అది అప్రధానమైన దికాదు కదా! ఎందుకంటే జరుగుతున్న చర్చ విలువలకు సంబంధించినది. చిత్తశుద్ధి అంత అవసరం లేనిదా? మనుగడ, గెలుపు... ఈ రెండే జీవితంలో ప్రధానమా?

మానవ జీవితం లాగా క్రికెట్ ప్రతిసారీ తెలుపు, నలుపులకే పరిమితం కాదు. వీక్షకులు పెడుతున్న కేకలను పెడచెవిన పెడుతూ బ్యాట్స్‌మెన్ తన ఆటను కొన సాగించే పరిస్థితులు ఉత్పన్నం అవడం తరచుగా జరిగేదే. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ నిర్ణయం తీసుకునే సమయంలో, అలాగే క్యాచ్ సూటిగా చేతికి అందని సందర్భంలో అనిశ్చితి అతని మదిలో నిజంగానే తొలగిపోదు కనుక అతనికి ఆట వీడిపోవలసిన అగత్యం ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘థర్డ్ అంపైర్’, నిర్ణయం తీసుకోవడం కఠినతరంగా పరిణమిం చినప్పుడు పని సులువు చేయడానికి తోడ్పడుతున్నది. అది మనుగడలోకి వచ్చింది కూడా ఇందుకే. స్టువర్ట్ బ్రాడ్ కేసును ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్న దంటే ఆట తెలుపు, నలుపులంత స్పష్టంగా పగటి పూట జరిగింది. ఫీల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ, స్టేడియంలో ఆట చూస్తున్న వారందరికీ, స్టేడియం వెలుపల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులకూ నిజం ఏమిటో తెలుసు. దాచేస్తే దాగేది కాదు అది.

క్రికెట్ స్ఫూర్తికి ఒకప్పుడు నిజాయితీ అనేది తప్పని సరి. వ్యక్తిత్వ దోషాల వలనగాని, ఆటకు సంబంధించిన ఒత్తిడుల వలనగాని క్రీడాకారులు తప్పుగా ప్రవర్తించడం ఆ రోజుల్లో హద్దు మీరిన నడవడిగా చూసేవారు. మానవ ప్రయత్నం విఫలం కావాలని ఎవరూ కోరుకోరు. మానవ జాతి చరిత్ర అందుకు సాక్ష్యం పలుకుతున్నది. అయినా నిజాయితీ లేని విజయాన్ని క్రికెట్ క్రీడా సంస్కృతి ఏనా డూ హర్షించలేదు. అటువంటి గెలుపును అది అసహ్యిం చుకున్నది. జీవన క్రీడా మైదానంలో నిజాయితీ ఎన్నడూ తన విలువను కోల్పోలేదు. ప్రతిభను సమాజం ఆ విధం గానే గుర్తించింది. అప్పుడప్పుడు అరుదుగానైనా తప్పుడు దారి తొక్కి ఎవరైనా పైకి రావచ్చు. డబ్బును వినియో గించి కూడా అనుకున్నది సాధించవచ్చు. ఎందుకంటే డబ్బుకు ఎప్పుడైనా పనులు సాధించే శక్తి ఉంటుంది. అయితే నిన్నమొన్నటిదాకా డబ్బు అణకువగా వ్యవహ రించేది. గొంతు విప్పాల్సివచ్చినప్పుడు గుసగుసలు పోయేది తప్ప గొంతెత్తి అరవకపోయేది. కానీ ఈ రోజున అది కంఠాన్ని పెంచేసింది. అంతరాత్మ స్వల్ప మోతాదులో స్వరం తగ్గించి చెప్పే మంచిమాట ఈ ‘ధ్వని కాలుష్యం’లో వినపడే అవకాశం లేదు.

కిందిస్థాయిలో ఎన్ని అవకతవకలున్నా గతంలో క్రికెట్ అన్నివేళలా తననుతాను ఉన్నత స్థానంలో నిలుపు కునేది. అందుకు సకారణంగా గర్వపడేది. 1950వ దశకం దాకా క్రికెట్ ఆటలో వర్గపరమైన హెచ్చుతగ్గులు ఎక్కు వగా ఉండేవి. ఆ నాడు ఔత్సాహికులు క్రికెట్ క్లబ్‌లో శిక్షణ పొంది, సులువుగా ప్రవేశార్హత పొందేవారు. వృత్తి క్రీడాకా రులు ‘ఇరుకుతోవ’లో ఒకరివెనుక ఒకరు అతికష్టం మీద వచ్చేవారు. విద్యాధికులు ఆట ఆడినందుకు తమకు లభించే మొత్తం స్వల్పంగా ఉంటే అది తమ గౌరవానికి భంగకరమని భావించేవారు. అందుకు కారణం వారు సంపన్నవర్గాలకు చెందినవారు కావడమే. శ్రామికవర్గం నుంచివచ్చే వృత్తి క్రీడాకారులకు ఆట ప్రాక్టీస్‌కు వీలుగా కనీసం వారానికి ఒక్కరోజైనా సెలవు తీసుకునే పరిస్థితి ఉండేదికాదు. కానీ ఆటలో నిజాయితీని మాత్రం ఈ వర్గపరమైన బేధాలు ప్రభావితం చేసేవి కావు.

నాటి కాలమాన పరిస్థితులతో పోలిస్తే మనం ఈ రోజున మరింత స్వేచ్ఛాయుత కాలంలో జీవిస్తున్నామని అనుకుంటాం. కానీ ‘వృత్తి క్రీడాకారుడి’ని మనం చేజే తులా అనైతికతకు మారుపేరుగా మార్చివేశాం. ఆట పట్ల ‘వృత్తిపరమైన’ ధోరణి అవలంబించాడనే పేర బ్రాడ్ చేసి న తప్పును క్షమించివేశారు. నిజాయితీ మత బోధకులకు తప్ప అన్యులకు అవసరం లేదనే విపరీతాన్ని ఈ వైఖరి బలోపేతం చేసింది.

బీసీసీఐ రజతోత్సవ సందర్భంగా 1980లో ముం బైలో ఇండియా-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఆడాయి. ఇండి యన్ టీం కెప్టెన్‌గా జీఆర్ విశ్వనాథ్, ఇంగ్లండ్ కెప్టెన్‌గా మైక్ బ్రెయర్లీ వ్యవహరించారు. ఆట కీలకదశలో ఉండగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బాబ్ టేలర్‌ను ఎల్బీడబ్ల్యూ నిర్ణయానికి లోబడి అవుట్ చేశారు. అంపైర్ నిర్ణయంతో మనసు చెదిరి టేలర్ క్రీజ్‌లోనే నిరసనగా అటుఇటూ కదులుతూ ఉండిపోయాడు. కానీ ఆనాడు అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే వ్యవస్థ ఉనికిలో లేదు. అప్పుడు విశ్వనాథ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అంపైర్ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ టేలర్‌కు ఆడే అవకాశం కల్పించాడు. తన నిర్ణయంతో ఇంగ్లండ్ విజయానికి దోహ దం చేశాడు. క్రికెట్ ప్రపంచానికి ఆనాడు సత్య సంద ర్శనమైందా? కాలేదు! ఆ నాటి నుంచి విశ్వనాథ్ తరహా ఉదార వైఖరికి కాలంచెల్లి కఠినవైఖరి అవలంబించే పద్ధతిది పైచేయి అయింది. కొంత మంది క్రికెటర్లు ఈ నాటికీ క్రీజ్‌లో ఈ ధోరణిని అరుదుగానైనా ప్రతిఘటిస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2003లో శ్రీలంకతో ఆడుతున్న ఆట సందర్భంగా మైదా నం నుంచి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు హాషిమ్ అమ్లా తాను అవుటయిన సంగతి గ్రహించిన మరుక్షణం తప్పుకుంటాడు. ఈ ఇద్దరినీ పాపం... పాతకాలపు విలు వలు ఇంకా పట్టి పీడిస్తున్నట్టున్నాయి.

మరి మీలో ఎవరైనా ఆ విధంగా తప్పు తెలుసుకొని తప్పుకుంటారా? స్వచ్ఛందంగా ‘మైదానం’ విడిచి వెళ్లి పోతారా? ఈ ప్రశ్న క్రికెట్‌కన్నా పెద్దది. క్రికెట్ క్రీడాస్థలికి బయట ఉన్న ప్రపంచానికి కూడా వర్తించేది. సాధారణ, అసాధారణ మంత్రులు, ముఖ్యమ్రంతులు లేదా ప్రధాన మంత్రులు అవినీతిపరులని నిగ్గుదేలినా పదవులను పట్టు కొని వేలాడుతుంటారు. మధ్యాహ్న భోజనం విషాహారం గామారి చిన్నపిల్లలను పొట్టన పెట్టుకున్నా అందుకు బాధ్యులైన అధికారులు కుర్చీ వదిలిపోరు. ప్రభుత్వ విభాగానికి బాధ్యత వహించే కార్యదర్శి కానీ, ఫైళ్లు చూసే గుమాస్తా కానీ ఎదురుగా కనిపించే లంచానికి లొంగకుం డా ఉండగలరా? లంచాలు ఇవ్వజూపకుండా వ్యాపారవే త్తలు ఉండగలరా? వ్యాపారానికి అంతరాత్మకు మధ్య నిరంతరాయంగా జరుగుతున్న యుద్ధంలో దేనిది పైచేయి అవుతున్నది? ఊరించే ‘బులబాటం’ నుంచి మనమంతా తప్పుకోగలిగితే ప్రపంచం వాసయోగ్యం అయ్యేది కాదా?

సమకాలీన ‘మతం’ బహిరంగంగా బోధిస్తున్న మొదటి సూత్రం: ఏ విధంగానైనా గెలుపు సాధించు! ఎవరైనా ఇష్టపడేది విజేతనే కదా! రెండవ సూత్రం: తప్పు చేస్తూ పట్టుపడేంత అజ్ఞానిగా ఉండకు! మూడవ సూత్రం ఏదీ లేదు. ఉన్నవి రెండు సూత్రాలే. స్టువర్ట్ బ్రాడ్ ఆటలో అంత ప్రధానం కాని ఓ చిన్న ‘మర’ అయి ఉంటే బహుశా పట్టించుకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ అతడు లక్షలాది మంది యువతీ యువకులకు ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు. హీరోయిజానికి అడ్డదారులు తొక్కినా పరవా లేదు, మనుగడే ముఖ్యమనే మాటే నిజమైతే, పాత కాలపు నైతికతకు ఇక తావే ఉండదు. ఇంకేం! మనుగడ తాలూకు రుచికరమైన ఫలాలు కడుపారా ఆరగించండి. తప్పొప్పు కునే పని మాత్రం చేయకండి!

>
మరిన్ని వార్తలు