‘ముద్రల’ రాజ్యం!

2 May, 2018 02:35 IST|Sakshi
బి.ఆర్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ నిర్మాత

మధ్యప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఛాతీపై కులం ముద్రలు వేయాలని నిర్ణయించిన ఘనులెవరోగానీ దేశంలో వర్తమాన స్థితిగతులకు చక్కగా అద్దంపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని ఆ జిల్లా ఎస్‌పీ వీరేంద్ర సింగ్‌ అంగీకరించారు. మంచిదే. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. కానీ అది జరగడానికి ముందే ఇందులో ‘చెడు ఉద్దేశం’ ఏమీ లేదని ఆయన సమర్థిస్తున్నారు. మరింక విచారణ దేనికి? ఇది వెలుగులోకొచ్చి 72 గంటలు గడుస్తున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దీన్ని గురించి మాట్లాడలేదు. జరిగింది తప్పేనని అంగీకరించడానికి ఆయనకు తీరిక చిక్కలేదు.

పాలకుల తీరు ఇలా ఉన్నది గనుకే దేశంలో ఏదో ఒక మూల దళితులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఈ పోలీసు నియామకాల ఉదంతానికి ముందూ వెనకా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్‌లోని గోర్ధన్‌పురా గ్రామంలో తన పెళ్లి వేడుకలకు గుర్రంపై ఊరేగుతూ వెళ్తున్న దళిత యువకుణ్ణి అక్కడి ఆధిపత్య కులాలవారు కిందకు పడదోసి అతన్ని తీవ్రంగా కొట్టడంతోపాటు ఊరేగింపులోని ఇతరులపై కూడా దాడి చేశారు. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఇప్పుడు ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం వెల్లడైన ఘటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలోని బదాయీలో తమ పొలంలో కోతలకు రానన్నాడని ఆగ్రహించి ఒక దళిత యువకుడిని ఆధిపత్య కులాలవారు ఊరంతా తిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టి కొట్టారు. అతనితో మూత్రం తాగించారు.

ఈ దేశం శాంతి సామరస్యాలకు పుట్టినిల్లని, ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇక్కడ నాగరికత వెల్లివిరిసిందని కొందరు గర్వంగా చెప్పుకుంటారు. కానీ దళితుల పట్ల అమలవుతున్న దౌర్జన్యాలు గమనిస్తే కనీసం ఇప్పటికైనా మనం నాగరికతను అలవర్చుకోగలిగామా అన్న సందేహం కలుగుతుంది.  జీవితంలో ప్రతి దశలోనూ తననూ, తనలాంటి కోట్లాదిమందిని అణగదొక్కడానికి ప్రయత్నించిన కులం మహమ్మారి బారిన దళిత వర్గాల్లో మరెవరూ పడకూడదని కాంక్షించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వలసపాలనలోనే ఎన్నో పోరాటాలు చేశారు. సంఘ సంస్కరణ మార్గం మన దేశంలో కంటకావృతమైనదని, దానికి మిత్రులు కొద్దిమంది అయితే, శత్రువులు అనేకమందని ఆయన 1936లో వెలువరించిన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి డబ్భై ఏళ్లు దాటుతున్నా ఏమాత్రం మారని దళితుల పరిస్థితిని గమనిస్తే ఆయన మాటల్లో ఎంత నిజమున్నదో అర్ధమవుతుంది.

దళిత సంక్షేమం గురించి, సమానత్వం గురించి, అణగారిన వర్గాల ఉద్ధరణ గురించి సమయం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలివ్వడమే తప్ప అందుగురించిన చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని మధ్యప్రదేశ్‌ ఘటన రుజువు చేసింది. దీని గురించి మీడియాలో వచ్చిన మర్నాడే గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది డాక్టర్‌ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రాహ్మణులంటూ వ్యాఖ్యానించారు. పైగా ‘బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చున’ని తన వ్యాఖ్యను సమర్ధించుకున్నారు. ఈ వ్యాఖ్యల లోలోతుల్లోకెళ్తే వాటి అంతరార్ధం సులభంగానే బోధపడుతుంది. మన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయిన కులతత్వం... కుల నిర్మూలన కోసం జీవితాంతం పాటుబడిన మేధావిని సైతం చివరకు కుల చట్రంలో ఇరికించింది! 

అవి పల్లెటూర్లా, పట్టణాలా లేక నగరాలా అన్న తేడా లేకుండా దేశంలో అడుగడుగునా దళితులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. అవి ఎప్పటికప్పుడు మీడియాలో వెల్లడవుతూనే ఉన్నాయి. వాటిని నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో, దోషుల దండనపై ఏమేరకు అవి దృష్టి పెడుతున్నాయో ఎవరికీ తెలియదు. మధ్యప్రదేశ్‌ సంగతినే చూస్తే ఎస్సీ, ఎస్టీలపై ఆగడాలు శ్రుతిమించుతున్న రాష్ట్రాల్లో అది అగ్రస్థానంలో ఉంది. అక్కడ దళితులపై దాడుల పెరుగుదల 49.4 శాతం ఉంది. ఎస్టీల విషయంలో ఆ పెరుగుదల 15.6 శాతం. ఇవి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతున్న గణాంకాలు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల) నిరోధక చట్టంపై జారీ అయిన మార్గదర్శకాలను నిరసిస్తూ గత నెల 4న దేశవ్యాప్త బంద్‌ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది చనిపోయారు.

నిరుడు గుజరాత్‌లోని ఉనాలో గోహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నడిరోడ్డుపై తమను కొరడాలతో హింసించిన దుర్మార్గులపై చర్యలు లేకపోవడంతో విసుగెత్తిన దళిత కుటుంబం ఆదివారం బౌద్ధమతంలోకి మారింది. వారితోపాటు మరో 300 మంది సైతం బౌద్ధాన్ని స్వీకరించారు. కనీసం ఇలాంటి పరిణామాలైనా ఆధిపత్యకులాల్లోనూ, పాలకుల్లోనూ పరివర్తన తీసుకురావాలి. ‘ముద్రల’ ఉదంతంపై రకరకాల తర్కాలు పుట్టుకొస్తున్నాయి. పోలీసు నియామకాలకు హాజరైనవారెవరూ దీనిపై ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదన్నది అందులో ఒకటి. నానా అగచాట్లూ పడి ఈ స్థాయి వరకూ వచ్చిన అభ్యర్థులు తమను అవమానించారని ఫిర్యాదు చేయడానికి సాహసిస్తారా? ఈ తర్కం లేవదీసిన అధికారులు కేసును మూసేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని అనుకోవాలి.

ఎవరూ ఫిర్యాదు చేయలేదు గనుక దీన్ని ఇంతటితో ముగిస్తున్నామని ఏణ్ణర్థం తర్వాత ప్రకటించినా ప్రకటించవచ్చు. కులం, మతం, జాతి, ప్రాంతం వగైరాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమానత్వాన్ని, సమాన హక్కుల్ని, న్యాయాన్ని అందించాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని మధ్యప్రదేశ్‌లోని ‘ముద్రలు’ ఉల్లంఘించాయి. శతాబ్దాలనుంచీ ఇక్కడ అమలవుతున్న కులజాడ్యాన్నే తలకెత్తుకున్నాయి. కనుక ఆ ముద్రలకు నైతికబాధ్యత వహించకపోతే, అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించాలి.  

మరిన్ని వార్తలు