కేటలోనియా స్వాతంత్య్ర కాంక్ష

6 Oct, 2017 00:53 IST|Sakshi

రెండో ప్రపంచ యుద్ధానికి ముందునాటి పరిస్థితుల స్థాయి కాకపోయినా యూరప్‌ గత కొన్నేళ్లుగా అస్థిర, అయోమయ వాతావరణాన్ని చవిచూస్తోంది. రెండేళ్లక్రితం గ్రీస్‌ పార్లమెంటు ఎన్నికల్లో పొదుపు చర్యలకు వ్యతిరేకంగా ఓటేయడం, యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి తప్పుకోవడానికి అనుకూలంగా నిరుడు బ్రిటన్‌ రిఫరెండం తీర్పునీయడం, ఇటలీలో కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు కట్టబెట్టే రిఫ రెండంలో అధికార పక్షాన్ని వ్యతిరేకిస్తూ ఫలితం వెలువడటం వగైరా పరిణా మాలన్నీ ఇందుకు ఉదాహరణలే. స్పెయిన్‌లో అక్కడి సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ కేటలోనియా ప్రాంతంలో మొన్న ఆదివారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన రిఫరెండం సైతం ఆ కోవలోనిదే.

రాగలకాలంలో స్పెయిన్‌తోపాటు, ఈయూను కూడా ప్రభావితం చేసేదే. ఆ రిఫరెండం కేటలో నియా ప్రాంతం దేశం నుంచి విడిపోవడానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజ్యాంగ న్యాయస్థానం వద్దన్నది కనుక రిఫరెండానికి ‘చట్టబద్ధత’ లేకపోవచ్చు... దీన్ని గుర్తించేది లేదంటూ స్పెయిన్‌ ప్రభుత్వం చెప్పి ఉండొచ్చు. కానీ ఆ రిఫ రెండంలో వ్యక్తమైన ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షనూ, స్వయం నిర్ణయాధికారం కోసం వారు పడుతున్న తపననూ, అన్నిటికీ మించి నియంతృత్వ పోకడలపై వారి నిరసననూ ఎవరూ కాదనలేరు. రిఫరెండాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్న రాజ్యాంగం 1978నాటిది కాగా, కేటలోనియా స్వాతంత్య్రేచ్ఛ శతాబ్దాల నాటిది.   

రిఫరెండాన్ని ఆపడానికి పోలీసులు పడిన యాతన అంతా ఇంతా కాదు. ఓటే యడానికొస్తున్న జనంపై ఎక్కడికక్కడ విరుచుకుపడి లాఠీచార్జిలు జరిపి వందల మందిని గాయపర్చినా, పలువుర్ని అరెస్టు చేసినా రిఫరెండం ఆగలేదు. దీనికి కొన సాగింపుగా వచ్చే సోమవారం కేటలోనియా పార్లమెంటు సమావేశం నిర్వహించి స్వాతంత్య్ర ప్రకటన చేయబోతున్నట్టు అధ్యక్షుడు కార్లెస్‌ పుగ్డిమాంట్‌ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ సమావేశాలను సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పెయిన్‌ జాతీయ ప్రభుత్వం ప్రక టించింది. అలాంటి తీర్మానమేదైనా చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చ రించింది. ఈ విషయంలో పుగ్డిమాంట్‌తో ఎలాంటి చర్చలూ ఉండవని స్పెయిన్‌ ప్రధాని మరియానో రజాయ్‌ చెబుతున్నారు. నిజానికి ఇన్నేళ్లుగా చర్చించకపోబట్టే, ఆ ప్రాంత వాసుల మనోభావాలను గుర్తించకపోబట్టే సమస్య ఇంతవరకూ వచ్చింది. 2014లో రిఫరెండం జరిపినప్పుడు సైతం ఇలాంటి ఫలితమే వచ్చింది. అప్పుడు కేటలోనియా నేతలు చర్చలకు సిద్ధపడ్డారు. కనీసం ఆ తర్వాతనైనా తన విధానాలు మార్చుకుని ఉంటే ఆ ప్రాంత ప్రజల మనసుల్ని గెల్చుకోవడం సాధ్య మయ్యేది. కానీ రజాయ్‌ మాత్రం మొండికేశారు. ఫలితంగానే ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ రిఫరెండం జరిగింది.

1936–39 మధ్య జరిగిన స్పానిష్‌ అంతర్యుద్ధంలో నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ అండదండలతో విరుచుకుపడ్డ మితవాదులతో సాగిన పోరాటంలో కేటలోనియాది వీరోచిత పాత్ర. దేశంలోని ఇతర ప్రాంతాలు జనరల్‌ ఫ్రాంకో వశమైనా అది చాన్నా ళ్లపాటు నిబ్బరంగా పోరాడింది. అయితే 3,500మందిని ఊచకోత కోసి, వేలాది మందిని ఖైదు చేశాక లొంగిపోక తప్పలేదు. అంతమాత్రాన అంతరాంతరాల్లోని దాని స్వాతంత్య్ర కాంక్ష చావలేదు. నలభైయ్యేళ్లక్రితం స్పెయిన్‌ నియంత జనరల్‌ ఫ్రాంకో మరణించాక  దేశంలో పునరుద్ధరించిన ప్రజాస్వామిక వ్యవస్థ దీన్ని గుర్తించి ఉంటే...అందుకనుగుణంగా ఆ ప్రాంతవాసులకు అక్కడి వనరులపై, ఆ ప్రాంత అభివృద్ధిపై తగినన్ని అధికారాలిచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో! కానీ కేటలోనియాకు అప్పుడు దక్కింది కేవలం నామమాత్ర స్వయం ప్రతిపత్తి. 1977లో వాగ్దానం చేసిన ఆ స్వయంప్రతిపత్తికి 2006లో మాత్రమే చట్టరూపం ఇచ్చారు.

తీరా స్పెయిన్‌ సర్వోన్నత న్యాయస్థానం అందులో కొన్ని అంశాలు చెల్లవంటూ 2010లో కొట్టేశాక వారికి ఆమాత్రం కూడా మిగల్లేదు. నిజానికి కేటలోనియా ప్రాంత భాష స్పానిష్‌ కాదు...కేటలాన్‌. వారి సంస్కృతి స్పానిష్‌ సంస్కృతికి భిన్నమైనది. ఆహార అలవాట్లయినా, అభిరుచులైనా, సంప్రదాయాలైనా, పండుగలైనా పూర్తిగా వారి సొంతం. స్పెయిన్‌తో వారిని ఏకం చేసే అంశం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. కేట లాన్‌ యూరప్‌లో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఒకటి. కానీ ఈయూ అధికార భాషల్లో కేటలాన్‌ లేదు. వీటన్నిటికీ తోడు కేటలోనియా భూభాగం సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. స్పెయిన్‌ ఆర్ధిక వ్యవస్థకది వెన్నెముక. 2008 ఆర్ధిక మాంద్యం సమయంలో స్పెయిన్‌ ఆర్ధిక వ్యవస్థ తట్టుకున్నదంటే అది కేటలోనియా పుణ్యమే. ఆర్ధిక వ్యవస్థలో దాని వాటా 20 శాతం పైమాటే. అది అటు తయారీ రంగంలోనూ, ఇటు సర్వీసురంగంలోనూ ముందంజలో ఉంది. నిజానికి ఇందువల్లే స్పెయిన్‌ దాన్ని గుప్పిట బంధించింది.

కేటలోనియా స్వతంత్ర దేశంగా ఏర్పడాలంటున్న వేర్పాటువాద పార్టీలు 2015 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు స్పెయిన్‌ జాతీయ ప్రభుత్వం కాదన్నా అక్కడ స్వాతంత్య్రాన్ని కోరుతూ రిఫరెండం నిర్వహించారు. స్పెయిన్‌ రాజు ఫెలిప్‌ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఐక్యతతో కేటలోనియా సమస్యను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా సైనిక చర్య ఉండొచ్చునన్న సంకేతాలిచ్చారు. అదే జరిగితే స్పెయిన్‌ మరోసారి అంతర్యుద్ధంలో చిక్కుకోవడం ఖాయం. రక్తపాతానికి దారితీయగల ఇలాంటి అవాంఛనీయ పరిణామాలకు తావీయరాదనుకుంటే  ఈయూ రంగంలోకి దిగాలి. కేటలోనియాపై మౌనం వీడి మధ్యవర్తిత్వం నెరపాలి. అదే జరిగితే ఇతరచోట్ల కూడా వేర్పాటువాదం పెరిగి యూరప్‌ విచ్ఛిత్తికి దారి తీస్తుందేమోనని మీనమేషాలు లెక్కించడం వల్ల ప్రయోజనం శూన్యం. నాన్చడం వల్ల ఆ ప్రమాదం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. నిజానికి స్పెయిన్‌ పాలకుల అప్రజాస్వామికతను గుర్తించి సకాలంలో హెచ్చరించి ఉంటే... మొగ్గలోనే తుంచి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు.

మరిన్ని వార్తలు