స్వయంప్రతిపత్తి... సీబీఐ!

4 Aug, 2013 01:30 IST|Sakshi

చేసిన తప్పులు శాపాలై వెంటాడక మానవు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చి సీబీఐకి  ఏ మోతాదు వరకూ స్వయం ప్రతిపత్తి ఉండవచ్చునో... తన పర్యవేక్షణలో లేకపోతే ఆ సంస్థ ఏమవుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి సీబీఐని తన పని తాను చేసుకోనీయకుండా అడుగడుగునా అది అడ్డుపడింది. ఆ సంస్థ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంది. సంస్థ డెరైక్టర్‌గా ఉండేవారిపై ఒత్తిళ్లు తీసుకురావడం, విశ్వాసపాత్రులుగా మెలిగిన వారికి పదవీ విరమణ అనంతరం పదవులు కట్టబెట్టడం సాధారణమై పోయింది. బోఫోర్స్ స్కాం ప్రధాన సూత్రధారి కత్రోకిపై నడిచిన దర్యాప్తు నుంచి ఇప్పటి బొగ్గు స్కాం, రైల్వే స్కాంల వరకూ కేంద్రం ప్రమేయంపై ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇవన్నీ చూశాకే సీబీఐ ‘పంజరంలో చిలుక’లా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, దానికి స్వయంప్రతిపత్తి అవసరమని చెప్పాల్సివచ్చింది. అందుకోసం తగిన ప్రతిపాదనలతో రావాల్సిందిగా సీబీఐని, కేంద్రాన్ని అది ఆదేశించింది. ఆ తర్వాతే స్వయం ప్రతిపత్తిపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మంత్రుల బృందం (జీఓఎం)ను నియమించి అభిప్రాయాలు సేకరించింది. దాని ముందు హాజరైన సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పాలనాపరమైన స్వయం ప్రతిపత్తి గురించి నొక్కి చెప్పారు. అయితే, తాము ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణల్లోనే స్వయం ప్రతిపత్తి కోరుతున్నాం తప్ప, దానికి వెలుపల ఉండాలనుకోవడంలేదని తెలిపారు.
 
 అటు తర్వాత కేంద్రం సీబీఐ స్వయంప్రతిపత్తికి ఏమేమి చర్యలు తీసుకోవాలో తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. సీబీఐ డెరైక్టర్ ఎంపిక కోసం ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లతో కూడిన కొలీజియం ఏర్పాటు చేయాలని ఆ అఫిడవిట్ ప్రతిపాదించింది. డెరైక్టర్ కాలపరిమితి, బదిలీ, న్యాయస్థానాల్లో సీబీఐ కేసులను చూసేందుకు ప్రాసిక్యూషన్ బోర్డు ఏర్పాటు, ఆర్ధికాంశాల్లో మరిన్ని అధికారాలివ్వడంవంటి సూచనలు అందులో ఉన్నాయి. మంత్రుల బృందం ముందు ఏమి చెప్పారోగానీ... కేంద్రం దాఖలుచేసిన ఈ అఫిడవిట్‌ను రంజిత్ సిన్హా గట్టిగా వ్యతిరేకించారు. డెరైక్టర్ పదవీకాల పరిమితిని మూడేళ్లకు మార్చాలని... పాలనావ్యవహారాల్లోనూ, క్రమశిక్షణకు సంబంధించి, ఒక కేసు దర్యాప్తు వేగవంతం చేయడానికి డెరైక్టర్‌కు ఇప్పుడు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, వాటిని విస్తృతపరచాలని ఆయన సూచించారు. డెరైక్టర్‌కు ప్రభుత్వ కార్యదర్శితో సమాన హోదా ఇవ్వాలని, ఇప్పటిలా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అదుపాజ్ఞల్లో కాక నేరుగా సంబంధిత కేంద్ర మంత్రికి  జవాబుదారీగా ఉండేలా చూడాలని ఆయన ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ అఫిడవిట్‌పైనే కేంద్రం స్పందించింది. ఆయన అడుగుతున్నన్ని అధికారాలూ అప్పగిస్తే మిన్ను విరిగి మీద పడుతుందన్నట్టు మాట్లాడింది. కేంద్రం అఫిడవిట్‌లోని మాటలు ఆశ్చర్యపరుస్తాయి. జవాబుదారీతనంలేని అధికారం నియంతృత్వానికి దారితీస్తుందట. అరెస్టులు, జప్తులు, దాడులు వగైరాలతో సంబంధం ఉండే సీబీఐ వంటి సంస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉంటే దుర్వినియోగానికి, ఏకపక్ష పోకడలకు ఆస్కారం ఉండదట. ఆ సంస్థ నిర్భయంగా, స్వతంత్రంగా పనిచేయడానికి అపరిమిత స్వయంప్రతిపత్తి అడ్డంకిగా మారుతుందట. న్యాయస్థానాల్లో తన కేసుల్ని వాదించడానికి నియమించే ప్రాసిక్యూటర్లపైనా, ప్రాసిక్యూషన్ డెరైక్టరేట్‌పైనా ఆ సంస్థకు సంపూర్ణ అధికారాలిస్తే నిష్పాక్షికతకు తావుండదట.
 
  పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుంది. సీబీఐ స్వయంప్రతిపత్తిపై కేంద్రం చేసిన వాదన అలాగే ఉంది. కేంద్రం పర్యవేక్షణలో సీబీఐ ఎలాంటి పోకడలకు పోతున్నదో లోకానికంతా తెలుసు. అధికార దుర్వినియోగం, పక్షపాతం లాంటివన్నీ సీబీఐకి అలవాటుచేసింది తానేనన్న సంగతిని అది మరిచిపోయినట్టుంది. ఒకపక్క సీబీఐ స్వయంప్రతిపత్తి వ్యవహారంలో సుప్రీంకోర్టు తలమునకలై ఉండగానే ములాయంపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలనే ప్రయత్నం గుప్పుమనడం, రైల్వే స్కాంలో మాజీ రైల్వే మంత్రి బన్సల్‌కు ప్రమేయం లేదని కోర్టుకు తెల్పడం దేన్ని సూచిస్తున్నది? గత కొన్ని దశాబ్దాలుగా సీబీఐని కేంద్రం ప్రభావితం చేస్తున్న తీరునూ, దాని పర్యవసానాలనూ గమనించాకే ఆ సంస్థకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి తీరాలని సుప్రీంకోర్టు నిర్ణయానికి వచ్చిందని గుర్తుంచుకోవాలి.
 
  ఈ మొత్తం చర్చలో ముఖ్యమైన అంశాలు మరుగున పడుతున్నాయి. దేశంలోనే అత్యున్నత శ్రేణి దర్యాప్తు సంస్థ సీబీఐకి వ్యావహారికంలో ఆ పేరున్నది తప్ప చట్టపరంగా అది ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ మాత్రమే. బ్రిటిష్ పాలకులు 1941లో తీసుకొచ్చిన ఈ సంస్థను 1946లో వచ్చిన ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టంలోనికి మార్చారు. ఆ ప్రత్యేక పోలీసు వ్యవస్థ 1963లో కేంద్ర కేబినెట్ తీర్మానంద్వారా సీబీఐగా మారినా, దాని అధికారాలన్నీ ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టంద్వారా వచ్చినవే తప్ప దానికోసం ఎలాంటి చట్టమూ తీసుకురాలేదు. ఈ అమూర్తమైన సంస్థకు చట్టప్రతిపత్తి కల్పించాలనిగానీ, అందులో ఇప్పటి అవసరాలకు దీటుగా పకడ్బందీ నిబంధనలుండాలని పాలకులెవరూ భావించలేదు. సీబీఐకి అలాంటి ఏర్పాటు చేయకుండా దానికి స్వయంప్రతిపత్తి గురించి, దాని అధికారాలగురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ఫెడరల్ వ్యవస్థ గురించి, ఆ చట్రంలో సీబీఐ పాత్ర గురించి చర్చ జరిగే అవకాశం ఉన్నది గనుక అసలు అలాంటి చట్టం తెచ్చేందుకే ఎవరూ ప్రయత్నించలేదు. పార్లమెంటరీ స్థాయీ సంఘాలు, పాలనా సంస్కరణల సంఘం వంటివి ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో ప్రభుత్వాలు అడుగు ముందుకేయలేదు. ఇప్పుడు సాగుతున్న చర్చ అయినా ఒక పటిష్టమైన చట్టం రూపకల్పనకు దోహదపడితే అది సీబీఐకి, ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ పని జరగనంత కాలమూ స్వయంప్రతిపత్తి మాట అర్ధ రహితమైనదే అవుతుంది.

మరిన్ని వార్తలు