రహస్య జీవో మతలబేమిటి?

17 Nov, 2018 00:33 IST|Sakshi

 

వింత నిర్ణయాలతో, విచిత్ర వాదనలతో తరచు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలనానికి తెరతీశారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సోదాలు, దర్యాప్తు చేసే అధికారాన్ని దఖలు పరుస్తూ గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ అత్యంత రహస్యంగా ఒక జీవో తీసుకొచ్చారు. ఈమధ్య కాలంలో తనకు ఏ క్షణంలోనైనా, ఏమైనా జరగొచ్చునని, తన చుట్టూ రక్షణ వలయంగా ఉండి జనమంతా కాపాడాలని చంద్రబాబు వేడుకుంటున్నారు. కనుకనే ఇలా చడీచప్పుడూ లేకుండా తీసుకొచ్చిన జీవోపై సహజంగానే అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. ఇలాంటి జీవో జారీ చేయడం కేంద్రంపై ఆయన చేస్తున్న మహా పోరాటంలో భాగమని అనుకూల మీడియా అభి వర్ణించవచ్చుగానీ– రాష్ట్రంలో సాగుతున్న అవినీతిపై  సీబీఐ విరుచుకుపడవచ్చునన్న భయమో... ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమా నాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధపడొచ్చునన్న వణుకో–మొత్తానికి ఈ రహస్య జీవో జారీ అయింది.

అది ఆలస్యంగానైనా బట్టబయలైంది. రాష్ట్రంలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని విశ్వసిస్తే... తన చర్య నిజంగానే కేంద్రంపై చేసే పోరాటంలో భాగమే అయితే సీబీఐని ఇకపై రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని బాబు బహిరంగంగానే చెప్పి ఉండేవారు. అందుకోసం జీవో తీసుకురాబోతున్నామని ప్రకటించేవారు. ఇలా చాటుమాటు వ్యవహారాలకు దిగజారేవారు కాదు. చిత్రమేమంటే... ఆయన అనుకూల మీడియాలో వెల్లడైన ఈ జీవో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సాధారణ పౌరులకు అందుబాటులోకి రాలేదు. దానికోసం వెదికేవారికి ‘కాన్ఫిడెన్షియల్‌’ అనే పదం మాత్రమే దర్శ నమిస్తోంది. సోదాలు, దర్యాప్తులపై సీబీఐకి ‘సాధారణ సమ్మతి’ ఇచ్చే జీవోను మొన్న ఆగస్టులో తీసుకొచ్చారు. మూడు నెలల వ్యవధిలో బాబు మనసెందుకు మారిందన్నది ప్రశ్నార్థకం. ఈ రహస్య జీవోను సమర్ధించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకులు, కొందరు తెలుగుదేశం నాయకులు చేస్తున్న వాదనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవల అంతర్గత సమస్యలతో సీబీఐ పని తీరు మందగించిందని, దాని ప్రతిష్ట మంటగలిసిందని వాటి సారాంశం. నిజానికి విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందానికొచ్చి సీబీఐతోసహా వివిధ వ్యవస్థల ప్రతిష్టను మంటగలిపిన చరిత్ర బాబుది.

పైగా సీబీఐతో పోలిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థలే వృత్తిపరంగా మెరుగ్గా ఉన్నాయని ఓ సీనియర్‌ న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారట! రాష్ట్రంలో ఏ నేరాలను రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సమర్ధవంతంగా పరిశోధించి కారకుల్ని పసిగట్టాయో, ఎందరికి ఎన్ని కేసుల్లో శిక్షపడిందో జాబితా ఇచ్చి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో కాల్‌మనీ పేరుతో వందలమంది మహి ళలకు వలవేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడ్డ దుండగుల విషయంలో ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేవు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన బాలిక రిషితేశ్వరి విషాద మరణం కేసులో విద్యార్థిలోకం, రాజకీయ పక్షాలు ఎంతో పోరాటం చేశాక గత్యంతరం లేక కొందరిని అరెస్టు చేసినా ఇంతవరకూ ఆ కేసులో నిందితులకు శిక్షలు పడలేదు. దళితులు, జర్న లిస్టులపై జరిగిన దాడుల విషయంలో దర్యాప్తులేమవుతున్నాయో తెలియడం లేదు. నిరుడు విడు దలైన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం లైంగిక వేధింపుల కేసుల్లో ఆంధ్ర ప్రదేశ్‌ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నదని వెల్లడైంది.

అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ నేరాలు 18 శాతం పెరిగాయని ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పైగా ఇలాంటి కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉన్నదని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎత్తులేసి ఆడియో, వీడియోల సాక్షిగా అడ్డంగా దొరికి పోయాక చంద్రబాబు చేసిన ప్రకటనలు అందరికీ గుర్తున్నాయి. ‘నీకు ఏసీబీ ఉంటే... నాకూ ఏసీబీ ఉంద’ంటూ అప్పట్లో ఆయన దబా యించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీబీఐని రాష్ట్రానికి రానివ్వబోమంటూ ఇచ్చిన జీవో వెనక ఇలాంటి చవకబారు బెదిరింపు కూడా ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోపాటు కేంద్ర విభాగాలకు చెందిన ఉద్యోగులను సైతం ఏసీబీ పరిధిలోకి తీసుకురావడమే ఈ జీవో ఆంత ర్యమని మీడియాలో హోరెత్తిస్తే తమ జోలికెవరూ రారని బాబు భ్రమ పడుతున్నారు. 
 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన తర్వాత ఆ కేసులో రోజురోజుకూ వెల్లడవుతున్న వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరాడనీయడం లేదు. ఈ హత్యాయత్నంపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు జరపాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి, గవర్నర్‌ తదితరులకు వినతిపత్రాలీయడంతోపాటు హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం వెలువడి తన మెడకు చుట్టుకోవచ్చునని బాబు భయపడటమే ఈ రహస్య జీవోకు కారణమని వస్తున్న విమర్శలకు ఆయన జవాబేమిటో తేలాలి. ఏదీ లేదని వాదించదల్చుకుంటే... ఆగస్టులో సీబీఐకి సమ్మతి తెల్పడానికి, ఇప్పుడు రహస్యంగా దాన్ని ఉప సంహరించుకోవడానికి మధ్య ఏం జరిగిందో హేతుబద్ధంగా ఆయన వివరించగలగాలి. ఈ జీవో చిత్తుకాగితంతో సమానమని, దీనిద్వారా సీబీఐని రానీయకుండా అడ్డుకోవడం అసాధ్యమని న్యాయ నిపుణులు చెబుతున్న మాట నిజమే కావొచ్చు. కానీ సుదీర్ఘ పాలనానుభవం ఉన్నదని చెప్పుకుంటున్న చంద్రబాబు... పారదర్శకంగా, ధైర్యంగా చేయాల్సిన పనిని ఇంత చాటుమాటుగా ఎందుకు చేశారన్నది ఇప్పుడు తేలాలి. ఈ చర్య వెనకున్న కారణాలేమిటో రాబట్టాలి. ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానాస్పద ప్రవర్తన కనబరిచేవారి కూపీ లాగడం పోలీసులకు మామూలే. ఈ రహస్య జీవో విషయంలో సైతం ఆ తరహాలో దర్యాప్తు చేస్తే చాలా అంశాలే వెల్లడికావొచ్చు.

మరిన్ని వార్తలు