జగజ్జేత చంఘిజ్ ఖాన్

15 Jul, 2013 03:43 IST|Sakshi
జగజ్జేత చంఘిజ్ ఖాన్

 యెక్కా మంగోలు తెగలో సింహం పుట్టింది. కేర్ కేర్‌మని ఏడ్చే బలిష్టమైన శిశువు. తండా నాయకుడు యాసుకై తన బిడ్డను చూడ్డానికి వచ్చాడు. చూశాడు. హా. ఆనందంతో బొబ్బరించాడు. తల్లి పొత్తిళ్లలో మెత్తటి ఎలుగ్గొడ్డు చర్మం మీద స్తన్యం నోటికందుకుని ఉన్న ఆ బుడతడి కుడి అరచెయ్యి మూసుకొని లేదు. అందులో ఎద్దు మూపురం వలే ఒక కండ పైకి తేలి ఉంది. మహా శకునం అది. దైవ శకునం. సమస్త మంగోలియా భూభాగాన్ని ఏలే విజేత, ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోబోయే జగజ్జేత, దైవాంశ సంభూతుడికి మాత్రమే అలాంటి మూపురం కనిపిస్తుంది. తండ్రికి పట్టపగ్గాలు లేవు.


 ఆనందంతో అరిచి పేరు పెట్టాడు - టెముజిన్. అంటే ఉక్కుమనిషి అని అర్థం.
 పిడికిలి తెరుచుకుని పుట్టిన ఈ బుడతడు భవిష్యత్తులో చేయబోయే ఘనకార్యాలు ఆ క్షణానికి తండ్రికి తెలియవు. ఆ క్షణానికి యెక్కా మంగోలు తెగకు తెలియవు. ఆ క్షణానికి అదే భూభాగంలో ఉన్న మెర్కిట్, తార్ తార్, నైమాన్ వంటి ఇతర బలమైన తండాలకూ తెలియవు. కాసింత దూరాన- ఇలాంటి తండాల పీడ సోకకుండా- భీకరమైన గోడ కట్టుకొని నిశ్చింతగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉన్న చైనా పాలకులకూ తెలియదు. కాని తెలియపరిచే క్షణం వచ్చిన నాడు భూమి కదిలిపోయింది.


 ‘ఇటు చూడండి’ గర్జించాడు టెముజిన్. సహాయకుడు ఒక విల్లంబును పట్టుకొని ఉన్నాడు. పుటుక్కున విరిచాడు. టెముజిన్ సైగ చేశాడు. సహాయకుడు ఈసారి ఐదారు విల్లంబులు కలిపి పట్టుకున్నాడు. విరవలేకపోయాడు. ‘మనం కలిసి ఉంటే ఇలా ఉండగలం. విరిగిపోకుండా. ఎవరికీ లొంగిపోకుండా’ టెముజిన్ గర్జించి చెప్పాడు.


 ఈ ముక్క అతడు తన తల్లి యూలన్ నుంచి తెలుసుకున్నాడు. ఈ ముక్క అతను తన సమస్త మంగోలు తండాలన్నింటికీ చెప్పదలుచుకున్నాడు. కాని ఎలా? పుట్టుకలోనే ఐదు వేళ్లూ కలిపి గుప్పిట సాధించలేనివాడు దూరాలలో లోయలలో చెదిరిపోయి భయంతో అభద్రతతో కక్షలతో లూట్‌మార్‌లతో బతుకుతున్న తండాలను ఒక గుప్పిట కిందకు ఎలా తెస్తాడు? కాని తేవాల్సిందే.


 అప్పటికి మంగోల్ తండాల పరిస్థితి ఏమిటి? ముక్కలు ముక్కలుగా బతుకుతూ, గోబి ఎడారి దుర్భర పరిస్థితులను అనుభవిస్తూ, ఎవడు ఎప్పుడు దాడి చేస్తాడో, ఎవడు ఎప్పుడు తమ ఆడవాళ్లను పిల్లలను సంపదను దోచుకెళతాడో అని భయపడుతూ ఒకడు దాడి చేసేలోపు తమే దాడి చేస్తూ ఎదుటివారిని కత్తికొక కండగా నరుకుతూ పెళ్లిపీటల మీద నుంచి కొత్తపెళ్లి కూతుళ్లను లేవదీసుకుపోతూ గుర్రపు డెక్కలకు రక్తస్నానాలు చేయిస్తూ....


 మూడు వైపులా సముద్రం... ఒక వైపు హిమాలయాలు... ఇలాంటి ప్రకృతి కాపలాదార్లు ఉన్న దేశంలో టెముజిన్‌లు పుట్టరు. పుట్టినా దుస్సాహసిలుగా తయారు కారు. కాని మంగోలియా అన్ని వైపులా భూభాగం ఉన్న దేశం. ఎవడు నాలుగు గుర్రాలను పూనిక చేసుకున్నా పోయి దాడి చేయవచ్చు. చంపొచ్చు. నరకొచ్చు. మరీ ముఖ్యం ఆడవాళ్లను ఎత్తుకుపోవచ్చు. తరతరాలుగా అదే జరుగుతోంది. లోపల తండాల మధ్య కూడా అలానే జరుగుతోంది. ఆ కార్పణ్యాలను టెముజిన్ బాల్యంలోనే చూశాడు. తొమ్మిదేళ్ల వయసులో సాటి తండావాళ్లు విష ప్రయోగం చేస్తే మరణశయ్య మీద నల్లబారిన తండ్రి ముఖాన్ని చూశాడు. అంతెందుకు? ముక్కు పచ్చలారని పసివాణ్ణని చూడకుండా తననే పట్టుకొని మెడకు కొయ్య పలకలు బిగించారే! బతికి బట్ట కట్టాడు.


 ఏం ఉందని తమ భూభాగంలో. తినడానికి తిండా? ఉండటానికి నివాసమా? డేరాలు వేసుకొని, ఎడ్లనూ గొర్రెలనూ సాక్కుంటూ, గుర్రపుపాలు తాగుతూ, మంచు పర్వతాల వల్లా చలికాలంలో భయంకరమైన సైబీరియా చలిగాలుల వల్లా హీనమైన చలిలో గడ్డకడుతూ... టెముజిన్‌కు రెండు అర్థమయ్యాయి. ముందు మన కోసం మనం సమీకృతం కావాలి. తర్వాత తిండి కోసం కూడా సమీకృతం కావాలి. అందుకు సైన్యాన్ని సిద్ధం చేయాలి.


 టెముజిన్ సిద్ధం చేశాడు. నిర్దాక్షిణ్యమైన సైన్యాన్ని సిద్ధం చేశాడు. రెప్పపాటు సైగను కూడా అర్థం చేసుకొని తుఫానులా తెగబడే క్రమశిక్షణ గల సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఆ సైన్యానికి ఒక్కటే తెలుసు. ఆజ్ఞను శిరసావహించడం. మానవజాతి కత్తికి మాత్రమే భయపడుతుందని, కత్తితో మాత్రమే దానిని ఒక నీడ కిందకు తేగలమని, కత్తి అండ ఉంటే తప్ప తిండి దొరకదని టెముజిన్ తన జాలి కనికరం లేని దండయాత్రలతో నిరూపించాడు. హెచ్చరించాడు. అందరికీ ఆ భాష అర్థమైంది. క్రమంగా గోబీ ఎడారిలోని ఒకో తండా ఒకో తండా పాదాక్రాంతమైంది. అతడి వీరత్వానికి, అమోఘమైన సైనిక ఎత్తుగడలకి, రాజనీతికి అచ్చెరువొంది అందరూ కలిసి బిరుదు ఇచ్చారు. చెంఘిజ్ ఖాన్! అంటే ప్రపంచ పాలకుడు. ఆకాశంలో ఒక్కడే సూర్యుడుండాలి. ఈ భూమికి ఒక్కడే పాలకుడుండాలి. చెంఘిజ్ ఖాన్ ఇది నమ్మాడు.


 ఇక అక్కడి నుంచి అతడి సైన్యం ఒక మహమ్మారి కంటే వేగంగా ఇరుగు పొరుగు దూసుకుపోయింది. చైనా, రష్యా, పర్షియా.... అడ్డు వచ్చినవాళ్లను కనికరించడం లేదు. అసలు ఎదిరించకపోయినా కనికరించడం లేదు. చంపడం ఒక్కటే పని. చంఘిజ్ ఖాన్ స్వయంగా సైన్యాధికారిగా ఉండి చైనా గోడను లంఘించి బీజింగ్‌కు నిప్పు పెట్టాడు. తనను ధిక్కరించిన పర్షియా పాలకుడు ముహమ్మద్ షా  మీద లక్ష మంది సైనికులతో దాడి చేసి సమర్‌ఖండ్, బుఖార వంటి నగరాలను నామరూపాలు లేకుండా చేశాడు. ఆ దాడి- చరిత్ర చూసిన అత్యంత క్రూరమైన దాడుల్లో ఒకటి.


 గోబీ ఎడారి క్రూరజంతువు- చెంఘిజ్‌ఖాన్- ఒక నిమిత్తమాత్రుడు. మానవజాతి నాగరికం అయ్యే- నెమ్మదించే- తన లోపాలను తాను సవరించుకునే ఒక సుదీర్ఘ ప్రయాణంలో రేగిన అనేకానేక నెత్తుటి మరకల్లో అతడూ ఒక నెత్తుటి మరక. కాని ఒక జాతికి రూపం ఇచ్చిన పాలకుడు. ఒక దిక్కులేని నేలకు తన కరవాలాన్నే పైకప్పు చేసిన తండ్రి.


 అలెగ్జాండర్- చెంఘిజ్ ఖాన్ దరిదాపులకు కూడా రాడు. కాని చరిత్రకారులు, ప్రచారమూర్తులు చేసిన ప్రచారం అలాంటిది. ఆసియా భూభాగంలో ఒక జగజ్జేత ఉన్నాడంటే నామోషీ. చైనా ఇతణ్ణెప్పుడూ నెత్తిన పెట్టుకోలేదు. మిగిలినవాళ్లకు ఏం పట్టింది.


 ప్రపంచంలో అత్యంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏలిన ఏకైక చక్రవర్తి చంఘిజ్‌ఖాన్.
 మనం ఇప్పుడు అతణ్ణి ఎలాగైనా చూడొచ్చు. కాని పదమూడో శతాబ్దపు మొదలులో, గోబీ ఎడారిలో, గడ్డ కట్టే చలిలో, చుట్టూ మాటు వేసిన శత్రువుల మధ్య, ప్రాణం అంటే గడ్డిపోచ కంటే హీనమైన మంగోలుల అంధయుగంలో, జాజ్వల్యమైన వెలుగుతో ఖడ్గం పట్టుకున్న  క్షణాన అతణ్ణి చూడాలి.


 అప్పుడు మాత్రమే మన తీర్పు నిజమైన తీర్పు.
 కథ అయిపోయింది.
 దీనిని తెలుగులో నవలగా రాయవచ్చా? చంఘిజ్‌ఖాన్ ఎవడు? అతడితో మనకేం సంబంధం. ఆ పేర్లేమిటి ఆ గోలేమిటి ఆ నేపథ్యం ఏమిటి? కాని స్థలాతీతమైన కాలాతీతమైన మనుషుల భావోద్వేగాలకు, పరాక్రమాలకు, జీవితానుభవాలకు ప్రాంతంతో భాషతో నిమిత్తం లేదు. మొద్దుబారిన మస్తిష్కాల మీద మైనపు వత్తి వెలిగించి సంచలనం రగిలించాలంటే ఇలాంటి గాథలే చదవాలి. రచయిత ‘తెన్నేటి సూరి’ అది సాధించారు. అదీ ఎప్పుడు? ఒక మీట దూరంలో కుప్పల తెప్పల సమాచారం ఉండే ఈ రోజుల్లో కాదు. ఒక చిన్న వివరానికి కూడా దిక్కులు చూడాల్సిన 1950లలో ఆయన చంఘిజ్ ఖాన్ చరిత్రనూ సమాచారాన్ని కథలనీ గాథలనీ సేకరించి నిజ పాత్రలను ఆకళింపు చేసుకొని ఘట్టాలను సిద్ధం చేసుకొని ఒక భాషలో ఒక ధోరణిలో ఒక ఊపులో ఈ నవల రాశారు. ఈ రచనలో గొప్పదనం ఏమిటంటే మొదటి పేజీ నుంచే మనం ఎగిరివెళ్లి గోబీ ఎడారిలో పడటం. ఆ దుమ్ము మనకు సోకడం. ఆ గుర్రపుపాల వేడి మన పెదాలకు అంటడం. డేకిశాల్లో ఉడుకుతున్న మాంసపు వాసన మన పుటాలకు చేరడం. ఈ కథకు ఎటువంటి భాష అవసరమో అటువంటి భాషను అటువంటి పదాలను అటువంటి వర్ణనను అటువంటి జుగుప్సను కూడా ఆయన సాధించారు. నిజానికి ఈ నవలను చదవాలంటే ధైర్యం కావాలి. ఇక రాయాలంటే!
 చాలా అరుదైన నవల ఇది. తెలుగు నవలల్లో ఒక రౌద్రజ్వాల.              
 వివరాలు:
 చంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి
     (1911 - 1959)
 మొదటి ముద్రణ - 1956
 తెలుగులో విశేష ఖ్యాతి పొందిన నవల. చరిత్ర ఆధారంగా ఇలా నేరుగా ఒక నవల రాయడం అందునా మంగోలు స్థితిగతుల నేపథ్యమూ ప్రవర్తన... వాస్తవిక స్థాయిలో రాయడం రచయిత ప్రజ్ఞకు గీటురాయి.
 విశాలాంధ్రలో లభ్యం.
 వెల: రూ. 125  

మరిన్ని వార్తలు