మరింత కృషి అవసరం

7 Oct, 2017 01:17 IST|Sakshi

సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన శిశుమరణాల నియం త్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్‌ లాన్‌సెట్‌ వెల్లడించిన గణాంకాలు ఊరటనిస్తాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మధ్య అయిదేళ్లలోపు పిల్లలు 10 లక్షలమంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదిక చెబుతోంది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. 2015లో ప్రతి వెయ్యి శిశు జననాలకూ 37 మర ణాలుంటే... నిరుడు అది 34కి తగ్గింది.

నెల కంటే తక్కువ వయసున్న శిశువుల్లో అంటురోగాలు 66 శాతం తగ్గగా, ఊపిరాడక కన్నుమూసే కేసులు 76 శాతం తగ్గాయి. అలాగే ధనుర్వాతం కేసులు 90 శాతం మేరా... న్యూమోనియా కేసులు 63శాతం, మలేరియా కేసులు 44 శాతం, మశూచి 92 శాతం, మెదడువాపు, నాడీమండల వ్యాధులు 61శాతం మేర తగ్గాయని లాన్‌సెట్‌ చెబుతోంది. మాతా శిశు సంరక్షణపై వివిధ పథకాల ద్వారా గణనీయంగా వ్యయం చేయడం వల్లనే ఈ నియంత్రణ సాధ్య మైందని లక్ష కుటుంబాల్లో చేసిన సర్వే వల్ల వెల్లడైంది. శిశు మరణాల తగ్గింపులో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం), జననీ సురక్షా యోజన పథకాల పాత్ర ప్రధానమైనది. వీటివల్ల ఆస్పత్రుల్లో పురుడు పోసు కోవడం గణనీయంగా పెరిగింది. వాక్సిన్‌ల వినియోగం, తల్లిపాల ప్రాధాన్యతను తెలియజెప్పడం కూడా ఉపయోగపడింది.

మరణించేవారిలో ఆడ శిశువుల శాతం ఇంతక్రితం అధికంగా ఉండేది. ఇప్పుడది బాగా తగ్గింది. ఇదే సమయంలో నెలలు నిండని శిశువుల మరణాలు, బలహీన శిశువుల మరణాలు 16 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇంక్యుబేటర్లు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు వగైరాలు విస్తృతంగా అందుబాటులోకొస్తే తప్ప ఇవి తగ్గే అవకాశం లేదు. ఇందుకోసం గణ నీయంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ తరహా మరణాలు ఇంచు మించు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా ఉండటాన్ని గమనిస్తే ఇదెంత ముఖ్యమో అర్ధమ వుతుంది. గోరఖ్‌పూర్, జంషెడ్‌పూర్, ఫరూఖాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎందరో పిల్లలు కనీస వైద్య సౌకర్యాలు కొరవడి కన్నుమూసిన ఉదంతాలు ఈమధ్యే వెల్లడై అంద రినీ కలవరపరిచాయి. వీటన్నిటా పాలకుల నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కన బడింది. కేవలం సరఫరాదారుకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంవల్ల ఆక్సిజెన్‌ సిలెండర్లు కరువై గోరఖ్‌పూర్‌లో రోజుకు పదుల సంఖ్యలో పిల్లలు చని పోయారు. చిత్రమేమంటే మరికొన్ని రోజులకు ఫరూఖాబాద్‌లో సైతం ఈ కార ణమే పిల్లల ప్రాణాలు తీసింది.
ఈ రెండూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవి. జార్ఖండ్‌లో నాలుగు నెలల్లో 170మంది పిల్లలు అత్యంత బలహీనంగా జన్మించడం వల్ల చనిపోయారు. ఆ రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించిన కార్య క్రమాలేవీ సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సులభం గానే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే దేశంలో శిశు మరణాల సంఖ్య తగ్గినా ఇంకా వైద్య రంగంలో చేయాల్సింది మరెంతో ఉంది. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. లాన్‌సెట్‌ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా మరణాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి జననాలకు 2000లో 13.2 మరణాలుంటే... 2015కు అది 17కు చేరుకుంది. తల సరి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రాలకూ, అది తక్కువగా ఉన్న రాష్ట్రాలకూ మధ్య కూడా శిశు మరణాల్లో వ్యత్యాసం ఉన్నట్టు నివేదిక చెబుతోంది.  

వచ్చే 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిం చాలని ఐక్యరాజ్యసమితి 2015 సెప్టెంబర్‌ 25న తీర్మానించింది. ఈ లక్ష్యాలు మొత్తం 17 ఉన్నాయి. 2015 కల్లా సాధించాల్సిన లక్ష్యాలుగా 2000 సంవత్సరంలో గుర్తించిన ఎనిమిదింటికి కొనసాగింపుగా సమితి ఈ తీర్మానం చేసింది. ఇందులో పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, మంచి ఆరోగ్యం, నాణ్యతగల విద్య, స్త్రీ–పురుష సమానత్వం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వగైరాలున్నాయి. మిగిలినవాటి సంగతలా ఉంచి మంచి ఆరోగ్యమనే లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటినుంచి చేయాల్సింది ఎంతో ఉన్నదని లాన్‌సెట్‌ నివేదిక తెలియజెబుతోంది. నిజానికి ఈ లక్ష్యా లకు నిర్దేశించిన ప్రాతిపదికలు సహేతుకంగా లేవన్న విమర్శలుండగా వాటి సాధనలో సైతం మన దేశం వెనకబడుతోంది. సుస్థిరాభివృద్ధిపై 2015లో తీర్మానం చేశాక ఏడాది వ్యవధిలో ఏ దేశం ఏం సాధించిందో వివరించే సూచీని నిరుడు విడుదల చేసినప్పుడు మన దేశం 110వ స్థానంలో ఉంది. మనకంటే దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటివి ఎంతో మెరుగు.

వైద్య ఆరోగ్య రంగంలో 2030నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలంటే  అయిదేళ్లలోపు శిశు మరణాల నియంత్రణలో ఇప్పుడు సాధించిన విజయాన్ని నిలబెట్టుకోవడంతోపాటు నెలలు నిండని, బలహీన శిశువుల మరణాల నియంత్రణలో కూడా సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శిశు మరణాలు సంభవించినప్పుడు ఆస్పత్రులు జారీచేయాల్సిన డెత్‌ సర్టిఫికెట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమూనా విడుదల చేసింది. చైనా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు దాన్ని అనుసరిస్తున్నాయి. అందువల్ల శిశువు మరణానికి నిర్దిష్టమైన కార ణమేమిటో వెల్లడవుతుంది. లోపాలు సవరించుకోవడానికి వీలవుతుంది. అలాగే ఆరోగ్య రంగానికి మన దేశం చేస్తున్న బడ్జెట్‌ కేటాయింపులు చాలా వెనకబడిన దేశాలకంటే తక్కువగా ఉంటున్నది. తగినన్ని నిధులు వ్యయం చేస్తే ఎంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునో లాన్‌సెట్‌ నివేదిక చెబుతోంది. దాన్ని గమనించాకైనా ఆరోగ్య రంగం కేటాయింపులు బాగా పెంచాలి. జాతి సంపదగా భావించే శిశువుల శ్రేయస్సుకు తీసుకునే చర్యలే మెరుగైన రేపటి సమాజానికి పూచీపడతాయని గుర్తించాలి.

మరిన్ని వార్తలు