చివురించిన వుహాన్‌!

10 Apr, 2020 00:24 IST|Sakshi

వరసగా 76 రోజులపాటు ఒంటరి బందీఖానాలో గడిపిన చైనా మహానగరం వుహాన్‌ బుధవారం తొలిసారి జనజీవనంతో కళకళలాడింది. కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాలంటే కరోనా మహమ్మారి బాహువుల నుంచి అది ‘విముక్తి’ సాధించింది. కష్టకాలంలో అలుపెరగకుండా పనిచేసిన 55,000 మంది వైద్య సిబ్బంది స్వస్థలాలకు బయల్దేరిన వేళ అక్కడ భావోద్వేగాలు ఒక్కసారిగా పెల్లుబికాయి. కనబడిన ప్రతి ఒక్కరినీ అనుమానంగా, భయంగా, కోపంగా చూసిన చోటే  ఒకరినొకరు తనివితీరా హత్తుకున్న దృశ్యాలు తళుక్కున మెరిశాయి. మనుషుల మధ్య భౌతిక దూరాన్ని పెంచిన మహ మ్మారిని ఒక్కటై సంహరించిన ఆ సిబ్బంది విజయ గర్వంతో చాన్నాళ్ల తర్వాత  కరచాలనాలు చేసుకున్నారు. ఎటుచూసినా చెమ్మగిల్లిన నయనాలే కనబడ్డాయి. ఈ రెండున్నర నెలలుగా తమ చిన్నారులను కంటితో చూసుకోలేని వారు కొందరైతే... వృద్ధాప్యంలోకొచ్చిన ఇంటి పెద్దకు ఎలా వుందో తెలియక కలవరపడుతున్నవారు మరికొందరు. నగరం నగరమంతా మళ్లీ జూలు విదిల్చి రోడ్డెక్కింది. 

కంటికి కునుకంటే తెలియని ఆ మహానగరం కరోనా వైరస్‌ బారిన పడినప్పుడు దాని రూపు రేఖలేమిటో, దాన్ని అంతమొందించడానికి చేయాల్సిందేమిటో చైనాకు తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం చేసేలోగానే ఆ మహమ్మారి మృత్యుభేరి మోగించింది. ఒకటితో మొదలై పదులు, వందలు, వేలకు చేరుకుంటున్న మృతుల సంఖ్య ఆ దేశాన్ని బెంబేలెత్తిస్తుండగా...ప్రపంచమంతా నిర్ఘాంతపోయి చూసింది. కొందరికది కామెడీ అయింది. వారి తిండితిప్పలు చూపించి మరికొందరు హేళన చేశారు. మహమ్మారి మూలాలు అందులోనే వున్నాయని ఇంకొందరు తీర్పులిచ్చారు. కుట్ర కోణం సరేసరి. నిరుడు డిసెంబర్‌ నెలాఖరున మొదలైన చావుబాజా వున్నకొద్దీ హోరెత్తిపోతుండగా మొన్న జనవరి 23న చైనా ప్రభుత్వం ఆ నగరాన్ని అజ్ఞాతంలోకి నెట్టింది. బయటి ప్రపంచానికి భౌగోళిక చిత్రపటాల్లో తప్ప అది కనబడకుండా పోయింది. వాస్తవానికి ఒక్క వుహాన్‌ మాత్రమే కాదు...హుబీ ప్రావిన్స్‌లోని మరో 15 నగరాలను కూడా చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌లో పడేసింది. మొత్తంగా ఆరు కోట్లమంది ప్రజానీకం పూర్తిగా ఇళ్లకు పరిమితమయ్యారు.

విమానాలు ఎగరలేదు. రైళ్లు తిరగలేదు. వాహనాల జాడ లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనబడలేదు. ఈ క్రమంలో ఎందరు జైలుపాలయ్యారో, ఎందరు చిత్రహింసలెదుర్కొన్నారో ఎవరికీ తెలియదు. చైనా విడుదల చేసిన ఛాయాచిత్రాల్లో మాత్రం వుహాన్‌ జనం మూకుమ్మడిగా పరిత్యజించిన నగరంగా దర్శనమిచ్చింది. రోజుకు వేలాది పాజిటివ్‌ కేసులు బయటపడిన ఆ నగరంలో అవి క్రమేపీ డజనుకు తగ్గాయి. చివరికి ఒకటి అరా కేసులు కనబడ్డాయి. ఇది జీరోకు పడిపోయిందని నిర్ధారణగా తెలిశాక చైనా లాక్‌డౌన్‌ తొలగించే ఆలోచన చేసింది. లెక్కకు ఆ దేశంలో 3,337మంది వైరస్‌ బారిన పడి మరణించారని చైనా చెబుతోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్యను 83,000గా ప్రకటించింది. కానీ  కాస్త ఆలస్యంగా మొదలై ఉగ్రరూపం దాల్చిన అమెరికాలో ఇప్పటికే 4,00,000 మంది ఆ జబ్బు బారినపడ్డారు. మరణాల సంఖ్య 13,000 దాటింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇదే పెద్ద సమస్యగా వుంది. అగ్రరాజ్యమైన తనకే లొంగని మహమ్మారి వుహాన్‌లో ఎలా నియంత్రణలో కొచ్చిందో ఆయనకు అంతుబట్టడం లేదు.

చైనా చెబుతున్నదల్లా నమ్మి, దాని భుజం తడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆయన విరుచుకుపడుతున్నారు. బయటి ప్రపంచానికి చైనా చెబుతున్న కరోనా లెక్కలన్నీ తప్పులతడక అంటున్నారు. అక్కడ రోగులు, మరణాల సంఖ్య చాలా ఎక్కువని చెబుతున్నారు. ఆరోగ్య సంస్థకు తమ నుంచి ఇక నిధులు రావని కూడా ప్రకటించారు. కరోనా వైరస్‌కు అది బయటపడిన వుహాన్‌ లేదా చైనా పేరు పెట్టడం సరికాదని ఆ సంస్థ అభ్యంతరం చెప్పడం ట్రంప్‌కు అవమానంగా తోచి ఇంత రాద్ధాంతం చేశారు. ఈ వివాదాల సంగతలావుంచితే... మొదట్లో చైనా లాక్‌డౌన్‌ అమలు తీరును ప్రశ్నించినవారు కొద్దిపాటి అనుభవంతో దాన్ని అర్ధం చేసుకున్నారు. మందులేని ఈ మహమ్మారిని అదుపు చేయా లంటే అదొక్కటే పరిష్కారమని దేశాలన్నీ ఒక నిశ్చయానికొచ్చాయి. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగం దాని నీడన జీవనం సాగిస్తోంది. అలాగని చైనా చురుగ్గా రంగంలోకి దిగి ఆ మహమ్మారిపై పోరాడిందని చెప్పడానికి లేదు.

డిసెంబర్‌ నెలాఖరున తొలిసారి లీ వెన్లియాంగ్‌ అనే యువ కంటి వైద్యుడు జనవరి మొదటివారంలో ఈ వైరస్‌ జాడ గురించి జనాన్ని అప్రమత్తం చేసినప్పుడు చైనా ప్రభుత్వం కప్పెట్టే యత్నం చేసింది. అలా కాకుండా వ్యాధి కూపీ లాగితే ఇప్పుడు బయటపడిన 83,000 కేసుల్లో కేవలం 5 శాతంమాత్రమే... అంటే 4,150 మందికి మాత్రమే వ్యాధి సోకేదని నిపుణులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా స్వల్పంగా వుండేదని, ప్రపంచానికి అది విస్తరించే ప్రశ్నే తలెత్తేదికాదని వారి అంచనా. ఏదేమైనా ఇప్పుడు ప్రపంచ మానవాళి ఎక్కడికక్కడ ఈ వైరస్‌తో తలపడుతోంది. వ్యాధి విస్తరించకుండా ప్రభుత్వాలు అనేకానేక చర్యలు తీసుకుంటున్నాయి. వైద్యులు, ఇతర సిబ్బంది అవిశ్రాంతంగా ఆ వ్యాధిపై పోరాడుతున్నారు. అయితే మహమ్మారులుగా ముద్రపడిన వ్యాధుల విషయంలో సామాజికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు అనేకం వున్నాయి. ఆ వ్యాధి బారినపడినవారిని చిన్నచూపు చూడటం, దాన్ని ఒక వర్గానికి, ప్రాంతానికి అంటగట్టే ప్రయత్నం చేయడం, నిరాధారమైన, అశాస్త్రీయమైన నిర్ధారణలకు రావడం మనుషులమధ్య విద్వే షాలను పెంచుతుంది. వ్యాధిగ్రస్తుల్లో భయాందోళనలు కలిగిస్తుంది. కనుకనే వ్యాధిగ్రస్తులను ఆదు కుని, ఆ కుటుంబాలకు సాంత్వన కలిగించాలి తప్ప, వారిని దోషులుగా చిత్రించడం సరికాదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం హితవు పలికింది. అందరూ దీన్ని పాటిస్తేనే వుహాన్‌ విజయం మనకూ సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు