హాంకాంగ్‌లో మళ్లీ చిచ్చు

28 May, 2020 00:18 IST|Sakshi
భద్రతా చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న హాంగ్ కాంగ్ పౌరులు

జూలై నెల సమీపిస్తున్నదంటే హాంకాంగ్‌ వాసులు హడలెత్తుతారు. 1997 జూలై నెలలో ఆ నగరంపై బ్రిటన్‌కున్న లీజు ముగిసి, అది చైనాకు స్వాధీనమైంది. ఏటా ఆ వార్షికోత్సవం సమయానికల్లా హాంకాంగ్‌లో ఏదో ఒక చిచ్చు రేపడం చైనాకు ఆనవాయితీగా మారింది. ఈసారి అది భద్రతా చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరి గణించే బిల్లును గత నెలలో జనంపైకి వదిలింది. దానిపై ఆందోళనలు రాజుకుంటున్న జాడలు కనిపిస్తుండగానే ఈ భద్రతా చట్టం ప్రతిపాదన బయటికొచ్చింది. హాంకాంగ్‌లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం అవసరమంటోంది చైనా. ఆ దేశం చెప్పినదానికల్లా తలాడించడం అలవాటైన హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యారీ లామ్‌ యధాప్రకారం ఈ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన నిరసనలు, ఆందోళనలు ఈ భద్రతా చట్టం పరిధిలోకి రావని, పౌరుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం వాటిల్లదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హాంకాంగ్‌ వాసులపై ఆంక్షల సంకెళ్లు వుండబోవంటున్నారు. మెజారిటీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయమంటున్నారు. నెలక్రితం జాతీయ గీతం బిల్లు విషయంలోనూ ఆమె ఈ మాదిరే మాట్లాడారు. 

ఇరవైమూడేళ్లక్రితం హాంకాంగ్‌ను వెనక్కి తీసుకున్నప్పుడు చైనా చాలా హామీలు ఇచ్చింది. తాము స్వతంత్ర రాజ్యంగా మనుగడ సాగిస్తాం తప్ప, విలీనం కావడానికి ఒప్పుకోబోమని హాంకాంగ్‌ వాసులు ఆందోళనలకు దిగినప్పుడు నాటి చైనా అధినాయకుడు డెంగ్‌ షియావో పెంగ్‌ వారికి అనేక విధాల నచ్చజెప్పారు. చైనాలో తాము అమలు చేస్తున్న విధానాలేవీ హాంకాంగ్‌లో అమలుకాబోవని చెప్పారు. ఆ నగరంలో వచ్చే 50 ఏళ్లపాటు... అంటే 2047 వరకూ పాత విధానాలే పూర్తిగా అమల వుతాయని, దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం రానీయబోమని రాతపూర్వకంగా వాగ్దానం చేశారు. అప్పటివరకూ ‘ఒకే దేశం– రెండు వ్యవస్థల’ విధానం కొనసాగుతుందని చెప్పారు. ఆయనిచ్చిన హామీల ప్రకారం ఆర్థిక, వాణిజ్య, న్యాయ వ్యవహారాల్లో హాంకాంగ్‌ సొంతంగా నిర్ణయాలు తీసు కోవచ్చు. పాలనా నిర్వహణ, శాసనాధికారం కూడా దానికే ఉంటాయి. కానీ అనంతరకాలంలో చైనా మాట తప్పడం మొదలుపెట్టింది.

2003లో తొలిసారిగా జాతీయ భద్రతా చట్టం ప్రతిపాదన తీసు కొచ్చింది. అప్పట్లో ఆ ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హాంకాంగ్‌లో విదేశీ శక్తులు చొరబడకుండా ఆపడానికే చట్టం తెస్తున్నామని చెప్పినా ఉద్యమకారులు వినలేదు. గత్యంతరం లేని స్థితిలో దాన్ని చైనా ఉపసంహరించుకోవాల్సివచ్చింది. గత మూడేళ్లుగా బాహాటంగానే ప్రవర్తిస్తోంది. పాలనా వ్యవస్థలో వున్న చైనా వ్యతిరేకులను అనర్హులుగా ప్రకటించడం, చైనా వ్యతిరేకులన్న అను మానం కలిగినవారిని కిడ్నాప్‌ చేయడం వంటివి మొదలయ్యాయి. నిరుడు నేరస్తుల అప్పగింత చట్టం సవరణ బిల్లు తీసుకొచ్చారు. అది ఆమోదం పొందివుంటే నేరాలు చేసినవారిని చైనాకు అధికారికంగా అప్పగించడానికి వీలయ్యేది. విశ్వసనీయత అంతంతమాత్రంగా వున్న చైనా న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంతో అందరికీ తెలుసు. పైగా వెనకటి కాలం నుంచి వర్తించేలా ఆ సవరణ బిల్లు రూపొం దించారు. ఆ బిల్లుపై చెలరేగిన ఆందోళనల్ని ఎంతగా అణచడానికి ప్రయత్నించినా హాంకాంగ్‌ పాలక వ్యవస్థకూ, చైనాకూ అసాధ్యమైంది. నయానా భయానా చెప్పి చూసినా ఆ ఉద్యమం చల్లారలేదు సరిగదా అది మరింత ఉధృతంగా కొనసాగింది. చివరకు ఆ బిల్లును వెనక్కు తీసుకుంది. అనంతరం నిరుడు నవంబర్‌లో హాంకాంగ్‌ పరిధిలోని 18 జిల్లా పాలకమండళ్లకు జరిగిన ఎన్నికల్లో 17 మండళ్లు ప్రజాస్వామ్య అనుకూలవాదుల చేతికి చిక్కడంతోపాటు 452 స్థానాల్లో 390 స్థానాలు లభించాయి. చైనా అనుకూలురకు కేవలం 59 స్థానాలు మాత్రమే వచ్చాయి. పాలకమండళ్లకు పెద్దగా అధికారాలు లేకపోయినా ఆ తీర్పు చైనాకు పెద్ద షాకిచ్చింది. పర్యవసానంగా నేరస్తుల అప్పగింత చట్టాన్ని మించిన కఠిన నిబంధనలతో తాజాగా ఈ చట్టానికి రూపకల్పన చేసింది. 

ఒకపక్క కరోనా వైరస్‌ మహమ్మారితో పోరాడటంలో ప్రపంచమంతా నిమగ్నమైన తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఈ కఠినమైన చట్టాన్ని జనం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇది అమల్లోకొస్తే చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలు హాంకాంగ్‌లో తిష్ట వేస్తాయి. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచడానికి పనిచేస్తాయి. హాంకాంగ్‌ పాలనా వ్యవస్థ, పోలీస్‌ విభాగం అప్పుడే ఆ చట్టానికి అనుకూ లంగా ప్రచారం మొదలుపెట్టాయి. వారు చెబుతున్న ప్రకారం హాంకాంగ్‌లో ఉగ్రవాదం పెరిగిపోతోందట. దాని స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయట. అలా ప్రక టనలు చేసిందే తడవుగా హాంకాంగ్‌  పోలీసులకు ఆ నగరంలో తుపాకులు, కొన్ని పేలుడు పదార్థాలు ‘దొరికాయి’. ఉగ్రవాద దాడులకు దిగేవారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివే వినియోగిస్తుంటారని పోలీస్‌ చీఫ్‌ క్రిస్‌ టాంగ్‌ చెబుతున్నారు. చట్ట ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దశలోనే ఇలా తుపాకులు, పేలుడు పదార్థాలు దొరికాయంటే, మున్ముందు ఆ నగరం పరిస్థితేమిటో సులభంగానే అంచనా వేసు కోవచ్చు. హాంకాంగ్‌కు సంబంధించి చట్టాలు చేయదల్చుకున్నప్పుడు వాటికి సంబంధించిన బిల్లుల్ని అక్కడి పాలనా మండలిలో ప్రవేశపెట్టడం రివాజు. ఆ దారిన పోతే వికటిస్తోందని భయపడి ఈసారి చైనా కొత్త మార్గం ఎంచుకుంది. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లుపెట్ట బోతోంది. చైనా పాలకులకు రబ్బర్‌ స్టాంపుగా ఉపయోగపడే ఆ సభలో ఇది ఆమోదం పొందడం ఖాయం. ఇంతవరకూ బిల్లు గురించి స్థూలంగా ఒకటి రెండు ముక్కలు చెప్పడమే తప్ప, దాని పూర్తి పాఠాన్ని చైనా బయటపెట్టలేదు. ఆ పని చేస్తే వ్యతిరేకత మిన్నంటుతుందని దాని భయం. ప్రజా స్వామ్య పరిరక్షణకు గత 23 ఏళ్లుగా నిరంతరం పోరాడుతూ చైనా ప్రయత్నాలను వమ్ము చేస్తూ వచ్చిన హాంకాంగ్‌ పౌరులు ఈసారి తమ కృషిలో విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాలి.

మరిన్ని వార్తలు