చైనా సంస్కరణల పర్వం!

16 Nov, 2013 03:45 IST|Sakshi

చైనాను మూడున్నర దశాబ్దాలక్రితం సరికొత్త మార్గంలోకి మళ్లించినప్పుడు డెంగ్ జియావో పెంగ్ ‘పిల్లి నల్లదైతేనేం, తెల్లదైతేనేం...కావల్సింది ఎలుకల్ని పట్టడం’ అని ప్రవచించి ఇకపై తమది సామ్యవాద మార్కెట్ ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని తెలియజేశారు. కానీ తెలుపు, నలుపుల సంగతలా ఉంచి ఏ రంగు మార్చడమైనా అంత సులభంకాదని చైనా గుర్తించినంత తేలిగ్గా, అక్కడ మార్పులు కోరుకునేవారు గమనించలేదు. అందువల్లే ఈ కాలమంతా చైనాలో నెమ్మది నెమ్మదిగా సాగుతున్న మార్పులపై పాశ్చాత్య ప్రపంచంలో అసహనం వ్యక్తమైంది. ఇలా అరకొర సంస్కరణలతో పనికాదని, వేగంగా కదలాలని హితవు పలికినవారు చాలామందే ఉన్నారు. అలాంటివారందరికీ ఈ నెల9న ప్రారంభమై 12తో ముగిసిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశం నిర్ణయాలు కాస్తయినా సంతృప్తికలిగించి ఉంటాయి.

తమ ఆర్ధిక వ్యవస్థలో మార్కెట్ శక్తులకు మరింత ప్రాధాన్యమిస్తామని, వనరుల కేటాయింపుల్లో ఇకనుంచి ప్రభుత్వ పాత్రకు బదులు మార్కెట్ శక్తులు ‘నిర్ణయాత్మక’ పాత్రను పోషించబోతున్నాయని చెప్పింది. తమ ఆర్ధిక వ్యవస్థలో మార్కెట్ శక్తులది ‘మౌలిక’ స్థానమని చెప్పిన 1992నాటి పార్టీ ప్రకటనతో పోలిస్తే ఈ ‘నిర్ణయాత్మక’ పదం కీలకమైనది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించి ఏణ్ణర్ధం అయ్యాక తదుపరి ఆర్ధిక సంస్కరణలపై దృష్టిపెట్టి కొత్త విధానాన్ని ప్రకటించడం ఇదే ప్రథమం. సమూల సంస్కరణలకోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. 2020కల్లా అనుకున్న లక్ష్యాలను సాధించాలని పేర్కొంది.  

ఈ మూడున్నర దశాబ్దాల్లోనూ ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యపోయే రీతిలో చైనా ఆర్ధిక వ్యవస్థ శరవేగంతో పురోగమించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా చైనా రూపొందింది. కొన్నేళ్లలో అమెరికాను సైతం అధిగమించగలదన్న అంచనాలు వెలువడ్డాయి. ఇదంతా రెండేళ్లక్రితంనాటి మాట. ఈ రెండేళ్లుగా ఆర్ధికాభివృద్ధి మందగించింది. రెండు దశాబ్దాల్లో ఎన్నడూలేనంతగా వృద్ధి రేటు 7.5శాతంవద్ద ఆగిపోయింది. పర్యవసానంగా ఇన్నాళ్లనుంచీ అమలుచేస్తున్న వృద్ధి నమూనాను సవరించుకోవాల్సిన అగత్యం ఉన్నదని చైనా గుర్తించింది. కేవలం ఎగుమతులపైనే ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థను దేశీయ వినియోగంపై ఆధారపడే వ్యవస్థగా తీర్చిదిద్దితేనే ఈ మందకొడితనంనుంచి బయటపడగలమని చైనా నాయకత్వం కొంతకాలంగా భావిస్తోంది. ఎగుమతులు పడిపోయి, ఉత్పాదకత తగ్గి క్రమేపీ నిరుద్యోగం పెరుగుతుండటాన్ని గమనించి నాయకత్వం ఆందోళనకు గురవుతోంది. అమలులో ఉన్న ఆర్ధిక నమూనాను సవరిస్తే తప్ప ఈ పరిస్థితి మారదని గుర్తించింది.

ఇప్పటికిప్పుడు విదేశీ మారక నిల్వలు దండిగానే ఉన్నా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాను అధిగమించాలనుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ వెనక్కు వెనక్కు లాగుతున్నాయి. ‘ఇంటికి ఒకరే బిడ్డ’ విధానం పర్యవసానంగా జనాభా అదుపులోకొచ్చిన మాట వాస్తవమే అయినా దానివల్ల వృద్ధుల జనాభా అంతకంతకు పెరుగుతోంది. పట్టణాలకూ, గ్రామాలకూ మధ్య...సంపన్నులకూ, పేదలకూ మధ్య అంతరాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ రుణభారమూ, అవినీతి పెరిగాయి. కనుకనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి భూసంస్కరణలను ప్రారంభించాలని, అందుకోసం చట్టాలను తగినవిధంగా సవరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహక పెట్టుబడుల స్థానంలో కార్పొరేట్ సంస్థల పాత్రను పెంచాలని కొత్త విధాన పత్రం నిర్దేశిస్తోంది. ఇలా అంటూనే ఆర్ధికవ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పటిలానే ఇరుసుగా ఉంటాయని తెలిపింది.

 నూతన ఆర్ధిక సంస్కరణలగురించి పార్టీ స్థూలమైన విధాన ప్రకటన మాత్రమే చేసింది. ఇందుకు సంబంధించిన లోతైన వివరాలు ఇంకా వెల్లడి కావలసే ఉన్నాయి. అయితే, చెప్పినమేరకు చూస్తే ఇకపై విదేశీ కార్పొరేట్ సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించడానికి అవకాశమిస్తారని అనుకోవచ్చని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా 1991లో మన దేశంలో నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు చెప్పినట్టే ఇకపై చైనాలో వినియోగదారులు చవక ధరల్లో నాణ్యమైన, వైవిధ్యమైన వస్తువులను పొందగలుగుతారని వారు ఊరిస్తున్నారు. అంతేకాదు...ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయంటున్నారు. అయితే, ఈ సంస్కరణల అమలు అంత సులభం కాదు. పార్టీ యంత్రాంగం కిందిస్థాయివరకూ బలంగా వేళ్లూనుకున్నచోట, అన్ని రంగాలపైనా దాని ఆధిపత్యం కొనసాగుతున్నచోట పైన ఒక నిర్ణయాన్ని తీసుకుని అంతే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలుచేయించడం పెను సవాలే.

అయితే, సంస్కరణల గురించి ఇంతగా ఊరించిన చైనా కమ్యూనిస్టు పార్టీ సామాజిక రంగంలో తన పట్టు సడలించుకోవడానికి ససేమిరా అంటున్నది. ముఖ్యంగా స్వేచ్ఛాస్వాతంత్య్రాల విషయంలో తనది పాత విధానమేనని కొత్తగా ప్రకటించిన కేజీబీ తరహా భద్రతా కమిషన్ ద్వారా తెలియజేసింది. సంస్కరణల అమలులో కొత్త పుంతలు తొక్కాలనుకుంటున్న పార్టీ అందుకు అనుగుణంగా విపక్షాన్నిగానీ, స్వతంత్ర మీడియానుగానీ ప్రోత్సహించడానికి ఎందుకు ముందుకురావడంలేదో అర్ధంకాని విషయం. ఈ విషయంలో గూడుకట్టుకున్న అసంతృప్తి పర్యవసానంగానే ప్లీనరీకి ముందు తియానాన్మెన్ స్క్వేర్‌వద్ద ఆత్మాహుతి దాడి, పార్టీ ప్రధాన కార్యాలయంవద్ద బాంబు దాడి జరిగాయి. ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీలో పరివర్తన రావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో?!

>
మరిన్ని వార్తలు