‘పారిస్‌ కల’ నెరవేర్చే దిశగా...

8 Dec, 2018 00:44 IST|Sakshi

పారిస్‌ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో మూడేళ్లక్రితం 200 దేశాల మధ్య కుదిరిన ఒడంబడికలోని అంశాల అమలుకు సంబంధించిన ఆచరణాత్మక ప్రణాళికల్ని రూపొందించేందుకు పోలాండ్‌లోని కటోవీస్‌లో పక్షం రోజులు జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌)–24 సదస్సు మొదలైంది. బొగ్గు, మరికొన్ని శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించుకోనట్టయితే కర్బన ఉద్గారాల కారణంగా పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదమున్నదని చాన్నాళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పారిస్‌ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రెండు నెలలక్రితం ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం తేల్చిచెప్పింది. ఆ బృందం కీలకమైన అంశాన్ని అందరి దృష్టికీ తెచ్చింది. పారిస్‌ ఒడంబడిక ‘భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాల’ని పిలుపునిచ్చింది. అయితే సమితి బృందం దీన్ని స్పష్టంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిలిపితేనే ముంచుకొస్తున్న ముప్పును నివారించగలమని అంటున్నది. లేనట్టయితే వాతావరణ మార్పులు ఊహించని స్థాయిలో ఉత్పాతాన్ని తీసుకొస్తాయని హెచ్చరించింది.

 పారిస్‌ ఒడంబడిక అమలుకు రూపొందించుకోవాల్సిన నియమ నిబంధనలపై గత రెండే ళ్లుగా చర్చలు సాగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేని దేశాలపైనా, దాన్ని ఉల్లంఘిస్తున్న దేశాలపైనా తీసుకునే చర్యలు, దీన్నంతటినీ పర్యవేక్షించాల్సిన యంత్రాంగం స్వరూపస్వభావాలు నియమనిబంధనల్లో పొందుపర్చాల్సి ఉంది. అలాగే సభ్యదేశాలకు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. వాటితోపాటు ఉద్గారాలను కొలిచే ప్రమాణాలను, పర్యవేక్షక యంత్రాంగానికి అవసరమైన వనరుల కల్పనను కూడా చర్చించారు.  కటోవీస్‌ సదస్సు నాటికల్లా ఈ చర్చలు పూర్తయి అప్పటికల్లా ఇవన్నీ ఖరారు కావాలన్నది కాప్‌–24 నిర్వాహకుల లక్ష్యం.

వచ్చే వారమంతా కూడా కొనసాగే ఈ సదస్సు నిర్వాహకులు రూపొందించిన నియమ నిబంధనలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలపవలసి ఉంది. అలాగే ఉద్గారాల తగ్గింపు నకు ముందుకొచ్చే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక వనరుల్ని, సాంకేతికతను సమకూర్చేం దుకు సంపన్న దేశాలు ఏమేరకు హామీ ఇవ్వగలవో ఈ సదస్సులో నిర్ణయం కావాల్సి ఉంది. 2016 లో మొరాకోలోని మర్రకేష్‌లో కాప్‌–22 సదస్సు జరిగినప్పుడు 2018 కల్లా నియమ నిబంధనలు ఖరారు కావాలని నిర్ణయించారు. అయితే కటోవీస్‌ సదస్సు ముంగిట్లోకొచ్చినా చర్చల పరంపర పూర్తికాలేదు. అంతర్జాతీయ ఒడంబడికల్ని అమలు చేసి తీరాలని వెనకబడిన దేశాలను ఒప్పించడం చాలా సులభం. కానీ సంపన్న దేశాలపై ఇలా ఒత్తిడి తీసుకురావడం ఓ పట్టాన సాధ్యం కాదు. అలాగే వెనకబడిన దేశాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని, సాంకేతికతను అందించమని వాటికి నచ్చజెప్పి ఒప్పించడం కూడా కష్టం. ఈ రెండేళ్లలోనూ నిర్వాహకులకు అది బాగా అర్ధమైంది.

ఉద్గారాల తగ్గింపుపై పారిస్‌ శిఖరాగ్ర సదస్సులో తాము వాగ్దానం చేసిన లక్ష్యాలను గడువుకు ముందే నెరవేరుస్తామని, ఆ లక్ష్యాలను దాటి కూడా ముందుకెళ్తామని కాప్‌–24లో మన దేశం తర ఫున పాల్గొన్న కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఇది సంతోషించదగ్గదే. పారిస్‌ సదస్సులో మన దేశం 2030కల్లా ఉద్గారాల తీవ్రతను 2005నాటి స్థాయితో పోలిస్తే 33–35 శాతం మేర తగ్గించుకుంటామని హామీ ఇచ్చింది. ఆమేరకు పునర్వినియోగ ఇంధన వనరుల్ని పెంచుకో వాల్సి ఉంది. ఈ విషయంలో హామీ ఇచ్చినదాని కంటే ఎక్కువగా... గడువుకంటే ముందుగా భారత్‌ చేసి చూపగలిగితే అది అటు సంపన్న దేశాలకూ, ఇటు వర్ధమాన దేశాలకూ ఆదర్శనీయ మవుతుంది.

ప్రపంచంలో కర్బన ఉద్గారాలను భారీగా విడుదల చేసే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఈ శతాబ్దాంతానికి భూతాపం మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ పెరగొచ్చునని శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాలు అందరిలో గుబులు పుట్టిస్తున్నాయి. భూతాపం పెరుగుతున్నకొద్దీ రుతువులు గతి తప్పి కరవుకాటకాల బారినపడతాయి. అదే జరిగితే 2030నాటికి మరో 12.2 కోట్లమంది పేదరికంలోకి జారిపోతారని ఆమధ్య ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. అంతేకాదు... జనం అంతుచిక్కని ప్రాణాంతక అంటు రోగాలబారిన పడతారని తెలిపింది. అనేక తీర ప్రాంత దేశాలు ముంపు బారిన పడతాయని వివరించింది. ఇప్పుడు ఉగ్రవాదం కారణంగా సిరియా, నైజీ రియా, లిబియా వంటి దేశాలనుంచి శరణార్థులు యూరప్‌ దేశాలకు వలసపోతున్నట్టే మున్ముందు భూతాపం హెచ్చడం వల్ల కలిగే అనర్థాలను తట్టుకోలేక మాల్దీవులు, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల జనం వలసబాట పట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలు యుద్ధాలకు దారితీస్తాయి.

 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కి ఇవేమీ పట్టడం లేదు. అసలు పర్యావరణ ఉత్పాతం భావనే శాస్త్రవేత్తల విశ్వామిత్ర సృష్టిగా ఆయన కొట్టిపారేస్తున్నారు. ఈ సదస్సుకు కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగర్‌ మినహా అమెరికా నుంచి చెప్పుకోదగ్గ ముఖ్య నాయకులెవరూ రాలేదు. అటు ముప్పును అంగీకరించే ఇతర సంపన్న దేశాలైనా ఉదారంగా వ్యవహరించడం లేదు. ఒకపక్క పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలేదని అమెరికాను దుయ్యబడుతూనే ఆ దేశాలు కూడా ఆచరణలో అందుకు భిన్నంగా ఏమీ ఉండటం లేదు.

వర్ధమాన దేశాలకు అందించాల్సిన ఆర్థిక సాయం విషయంలోనూ, అవసరమైన సాంకేతికతను సమకూర్చడంలోనూ ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో కటోవీస్‌ సదస్సు విజయవంతమవుతుందా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. భూమండలం ముప్పు ముంగిట్లో ఉన్న ఈ తరుణంలోనైనా సంపన్న దేశాలు, పేద దేశాలు సమష్టిగా, సమన్వయంతో కదలవలసిన అవసరం ఉంది. పారిస్‌ ఒడంబడిక లక్ష్యాలు నెర వేరడానికి అనువైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను కటోవీస్‌ సదస్సు రూపొందిస్తుందని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు